Vedantha panchadasi:
బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధిర్మతః ౹
దేహాత్మవత్పరాత్వదార్డ్యే బోధః సమాప్యతే ౹౹285౹౹
సుప్తివద్విస్మృతిః సీమా భవేదుపరమస్య హి ౹
దిశానయా వినిశ్చేయం తారమ్యమవాన్తరమ్ ౹౹286౹౹
285. బ్రహ్మలోకమును కూడా తృణీకరింపగలుగుట వైరాగ్యమునకు పరాకాష్ఠ అని చెప్పబడును.దేహమే ఆత్మ అనే బోధ ఎంత దృఢముగా ఉన్నదో అంత దృఢముగ పరమాత్మ బోధకలుగుట జ్ఞానమునకు పరాకాష్ఠ.
286. సుషుప్తియందువలె విస్మరణము ఉపరమమునకు పరాకాష్ఠ.వీనియందలి తారతమ్యములు తరగతులు పరిశీలన ద్వారా తెలియనగును.
ఆరబ్ధకర్మ నానాత్వ ద్భుద్ధానామన్యథాఽ న్యథా ౹
వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యం న పన్డోతైః ౹౹287౹౹
287.వారివారి ప్రారబ్ధమును అనుసరించి జ్ఞాని పురుషుల ప్రవర్తన భిన్నవిభిన్నములుగ ఉండవచ్చును.అంతమాత్రముచేత విద్వాంసులకు,జ్ఞానము చేతనే మోక్షము లభించుననుటయందు భ్రమ కలుగరాదు.
స్వస్వకర్మానుసారేణ వర్తన్తాతే యథా ౹అవిశిష్ఠః సర్వబోధః సమా ముక్తిరితి స్థితిః ౹౹288౹౹
288.తమతమ పూర్వకర్మను అనుసరించి జ్ఞాని పురుషులెట్లు ప్రవర్తించినను వారి తత్త్వజ్ఞానమునందు భేదము లేదు.మోక్షము కూడా సమానమే.ఇదే వస్తుస్థితి.
వ్యాఖ్య:-సుషుప్తిలో లాగా సమస్తమూ మరపుకు రావటమే
ఉపరతికి చివరి హద్దు.
బ్రహ్మలోకాన్ని కూడా తృణీకారభావంతో చూడగలగటం అనేది వైరాగ్యానికి చివరిహద్దు.
మూర్ఖుడైనవాడు ఈ శరీరాన్నే ఆత్మ అని,అది శాశ్వతము సత్యము అని ఎంత గట్టిగా నమ్ముతాడో,
అంత గట్టిగా దృఢంగా బ్రహ్మమే ఆత్మ అనే నిశ్చయం కలగటమే జ్ఞానానికి చివరి హద్దు.
వీటికి సంబంధించిన అవాంతర భేదాలన్నీ -
న్యూనాధిక్యతలన్నీ - ఎవరికి వారు తమ బుద్ధితో తెలుసుకోవాలి.
తత్త్వజ్ఞానుల్లో సైతం రాగాదులకు సంబంధించిన హెచ్చుతగ్గులున్నాయని అంటే,
జ్ఞానమనేది ముక్తికి సాధనమనటం సందేహాస్పదమేగదా ! అంటే -
ప్రారబ్ధకర్మలో ఉండే వైవిధ్యం కారణంగా జ్ఞానుల ఆచరణకూడా భిన్నంగా ఉంటుంది.
ప్రారబ్ధకర్మ ఫలంవల్ల రోగాదులు సంభవించినట్లే జ్ఞానుల్లో రాగాదులు కూడా
ఉంటూ ఉంటాయి.కాని,
అవి ఆ జ్ఞానులకు మోక్షం కలగటంలో ప్రతిబంధకాలు కావు.వారి ఆచరణలో ఉండే భిన్నత్వన్ని చూచి పండితులైనవారు భ్రమకు లోనుకాకూడదు.అంటే,
శాస్త్రార్థాన్ని గ్రహించటంలో అనుమానించకూడదు.
అయితే,ఏమని నిశ్చయించుకోవాలి ? అంటే -
జ్ఞానులు తమతమ ప్రారబ్ధకర్మానికి వశులై అందుకు తగినట్టుగా వ్యవహరిస్తే,
అట్లాగే ఆచరించవచ్చు.
కాని,వారందరికీ కలిగే తత్త్వజ్ఞానం మాత్రం అందరిలోను ఒకే విధంగా ఉంటుంది.
"అహం బ్రహ్మస్మి" అనే జ్ఞానం మాత్రం అందరిలోనూ ఒకటే !
శ్రీకృష్ణుడు భోగమయ జీవితము గడపెను.
శుకుడు ఉపనయనమునకు మునుపే సన్న్యసించెను.
శ్రీరాముడు,జనకుడు రాజ్యములనేలిరి.
వశిష్టుడు గొప్ప కర్మానుష్ఠానపరుడు. అయినను అందరూ జ్ఞానపురుషులే.
నిరవద్య బ్రహ్మ స్వరూపస్థితి అనే ముక్తి విషయంలోనూ ఏమీ భేదం ఉండదు.
ముక్తి అనేది అందరికీ ఒకటే !
ఇదే శాస్త్ర సిద్ధాంతం.
జగచ్చిత్రం స్వచైతన్యే పటే చిత్రమివార్పితమ్ ౹
మాయయా తదుపేక్ష్యైవ చైతన్యం పరిశేష్యతామ్ ౹౹289౹౹
289.కూటస్థ చైతన్యముపై జగత్తు, వస్త్రముపై తైల చిత్రము వలె రచింపబడినది. చైతన్యముపై మాయారోపమిట్లు జరుగును. ఈ మాయను ఉపేక్షించి చైతన్యమును గ్రహింపవలెను.
చిత్రదీపమిమం నిత్యం యేఽ నుసందధతే బుధాః ౹
పశ్యంతోఽ పి జగచ్చిత్రం తే ముహ్యంతి న పూర్వవత్ ౹౹290౹౹
290. ఈ చిత్రదీప ప్రకరణమును నిత్యము అనుసంధానము చేయు విద్వాంసులు ఈ ప్రపంచమనెడి చిత్రమును చూచుచున్నను పూర్వము వలె మోహము నొందరు.
ఆరవ ప్రకరణము : సమాప్తము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
వ్యాఖ్య:- జగత్తు అనే చిత్రం, వస్త్రంమీద చిత్రింపబడిన చిత్రంలాగా,
మాయ ద్వారా చిద్రూపంమీద (ఆత్మ చైతన్యం మీద) చిత్రింప బడ్డది.
ఆ జగద్రూపమైన చిత్రాన్ని ఉపేక్షించి,స్వాత్మచైతన్యంలోనే బుద్ధిని స్థిరంగా నిలుపుకోవాలి.అంటే,
ముముక్షుడైన వాడు ఆత్మ చైతన్యం యొక్క విశుద్ధ స్వరూపాన్ని తెలుసుకోవాలి.
ఈ ఆత్మయే బ్రహ్మమనీ,దానిపై కారణ శరీరం మొదలైన శరీరాలను ఆరోపించి జీవుడనీ, మాయాశక్తి మొదలైనవి ఆరోపించి ఈశ్వరుడనీ వ్యవహారం జరుగుచున్నదనీ,
ఈ ఆరోపాలను తొలగిస్తే
"జీవ - బ్రహ్మలకు",
"జీవాత్మ - పరమాత్మలకు" అభేదమనీ ,
అది ఏక సత్యమనీ రెండవదనునదే లేదనీ అనుభవమవుతుంది.
అద్వితీయమగు బ్రహ్మమును స్పర్శింపగలుగునదేదియు లేదు.ఇవి అన్నీ సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మమున మాయచే కల్పింపబడినవే.
చేతనాలు,అచేతనాలు అనే విభాగానికి కారణం కూటస్థమైన చైతన్యమే అధిష్ఠానం అని తెలుసుకోవాలి.
చైతన్యముపై మాయారోపములను ఉపేక్షించ. చైతన్యమును గ్రహింపవలెను.
ఈ చిత్రదీప ప్రకరణాన్ని నిత్యమూ అనుసంధానంచేసే (మననం చేసే)ముముక్షువులు,
చిత్రరూపంలో వుండే ఈ జగత్తును చూస్తూ ఉన్నప్పటికి,
వెనకటిలాగా మోహాన్ని పొందరు - భ్రమకు లోనుకారు.
అందుచేత ఈ చిత్రదీప ప్రకరణాన్ని మాటిమాటికీ అభ్యాసం చేయాలని భావం.
ఇతి పంచదశ్యాం
చిత్రదీప ప్రకరణం సమాప్తం.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
No comments:
Post a Comment