Saturday, January 25, 2025

 Vedantha panchadasi:
అసత్త్వంశో నివర్తేత పరోక్షజ్ఞానతస్తథా ౹
అభానాంశ నివృత్తిః స్యాదపరోక్షధియా కృతా ౹౹5౹౹

56. బ్రహ్మము గురించిన సంశయమును పరోక్షజ్ఞానము తీర్చును.
బ్రహ్మానుభవము గురించిన సంశయము అపరోక్షజ్ఞానము నశించును.

దశమోఽ స్తీతి విభ్రాన్తం పరోక్షజ్ఞాన మీక్ష్యతే ౹
బ్రహ్మాస్తీత్యపి తద్వత్స్యాదజ్ఞానవారణం సమమ్ ౹౹57౹౹

57. 'పదవవాడు కలడు మునిగిపోలేదు'అనుట పరోక్షజ్ఞానము.అది భ్రమ కాజాలదు.అట్లే బ్రహ్మము కలదు అనే పరోక్షజ్ఞానము భ్రమ కాదు.
రెంటియందు అజ్ఞానము తొలగుట సమానమే.

వ్యాఖ్య:- పరోక్షజ్ఞానంవల్ల బ్రహ్మముయొక్క అసత్వాంశకు సంబంధించిన  నివృత్తి జరుగుతుంది.అంటే,
బ్రహ్మములేదు అనే భావాన్ని కలిగించే అజ్ఞానం 
నివృత్త మౌతుంది.
బ్రహ్మము లేకపోవచ్చును అనే సంశయమును పరోక్షజ్ఞానము తీర్చును.

అపరోక్షజ్ఞానం వల్ల బ్రహ్మముయొక్క అభావాంశ -
"బ్రహ్మము కనిపించటంలేదు" అనే అజ్ఞానం నివృత్తమౌతుంది.అంటే,
బ్రహ్మము ప్రకాశింపదు అనుభవగతము కాదు అనుభావమును అపరోక్షజ్ఞానము నశింపజేయును.

అసత్వాంశ,అభావాంశలు వ్యాపర్త్యాంశలన్నమాట.

అపరోక్షంగా తెలుసుకోవటానికి వీలైనది,పరోక్షంగా కూడా తెలుసుకోవటానికి వీలవుతుంది అనేందుకు దృష్టాంతం -

"దశమోఽస్తి" పదవవాడున్నాడు అనే ఆప్తపురుష వచనంవల్ల కలిగిన 
పరోక్షజ్ఞానం భ్రమ శూన్యమైనది  
అయినట్లే ,
"బ్రహ్మాస్తి"- "బ్రహ్మ ఉన్నాడు" అనే 
వాక్యంవల్ల కలిగే పరోక్షజ్ఞానం కూడా భ్రమ శూన్యమైనదే !
"పదవవాడు కలడు మునిగిపోలేదు" అనే పరోక్షజ్ఞానము భ్రమకాదు అలాగే బ్రహ్మము కలదనే పరోక్షజ్ఞానము కూడా భ్రమకాజాలదు.

దశమవ్యక్తి,బ్రహ్మము ఈ రెంటి విషయంలోనూ అజ్ఞనాకృతమైనట్టి ఆవరణం మాత్రమే సమానం. రెండింటియందు సత్యమునావరించే అజ్ఞానము తొలగుట సమమే.

పరోక్షజ్ఞానము పరోక్షమైనంత మాత్రమున భ్రమ కాజాలదు.
సోపపత్తికముగ కలిగినపుడు అది అపరోక్షజ్ఞానమునకు దారి తీయును.
పదవవాడు కలడని ఒక విశ్వసనీయుని ద్వారా వినుటవలన శోకము తగ్గును గదా!
పిదప వాడెక్కడ కలడని పరీక్ష జరిగి వాడు ప్రత్యక్షమగును.

ఆ విశ్వసనీయుడైన సద్గురువులేక ఆత్మ తత్త్వమనే గుర్తు తెలియబడదు. బ్రహ్మదేవునికైనా అతని తండ్రి విష్ణువుకైనా సద్గురువు లేక పరతత్త్వము తెలియబడదు.

అదే విధముగా గురువు తెలుపకున్న పరతత్త్వము తెలియదు,మోక్షము పొందలేడు - వేమన యోగి యొక్క అనుభవవాక్యము.

"ప్రోక్తోఽన్యేనైవ సుజ్ఞాయప్రేష్ఠా"-
తనకంటె వేరైన సద్గురువు చేతనే "ఆత్మ జ్ఞానతత్త్వము"
తెలియబడునని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

ఆత్మా బ్రహ్మేతి వాక్యార్థే నిఃశేషేణ విచారితే ౹
వ్యక్తి రుల్లిఖ్యతే యద్వద్దశమస్త్వమసీత్యతః ౹౹58౹౹

58. ఈ ఆత్మయే బ్రహ్మము అనే   
శ్రుతి వాక్య విచారణ వలన "నేను" బ్రహ్మమును అనే అపరోక్షజ్ఞానము కలుగును.
'నీవే దశముడవు'అని చెప్పబడిన వ్యక్తి ఆలోచించి అదియట్లే అని గ్రహించును గదా.

59.దశమః క ఇతిప్రశ్నే త్వమేవేతి నిరాకృతే ౹
గణయిత్వా స్వేన సహ స్వమేవ దశమం స్మరేత్ ౹౹59౹౹

59.పదవవాడెవడు అని ప్రశ్నించినచో అది అతడే అని ఉత్తమరము.వరుసగా లెక్కించుచు తనను కూడా లెక్కించుకొని తానే పదవవాడని గుర్తించును.
ఇదే అపరోక్షజ్ఞానము.

దశమోఽ స్మీతి వాక్యోత్థా న ధీరస్య విహన్యతే ౹
ఆది మధ్యావసానేషు న నవత్వస్య సంశయః ౹౹60౹౹

60.'నీవే పదవవాడవు' అనే వాక్యముచే జనించిన 
'నేనే గదా దశముడను'అనే జ్ఞానము ఏవిధముగనైనా నష్టపడదు.ఎలా లెక్కించినా సంశయములు కలుగనే కలుగవు.

వ్యాఖ్య:-ఆప్తజనుల వాక్యాలవల్ల పరోక్షజ్ఞానం కలిగితే కలుగవచ్చు ! మరి అపరోక్షజ్ఞానం దేనివల్ల కలుగుతుంది ? అంటే -

అపరోక్షజ్ఞానమునకు విచారణ ప్రధానమా శ్రూతిలోని 
మహావాక్యము ప్రధానమా అనుటలో భేదాభిప్రాయములు గలవు.సామాన్యముగ మహావాక్యమే ప్రధానమని స్వీకరింపబడినది.

"అయమాత్మ బ్రహ్మ" 
బృ- 2-5-19 
ఈ ఆత్మ బ్రహ్మ స్వరూపం కలది.అనే శ్రుతివాక్యార్థాన్ని చక్కగా విమర్శించి అర్థంచేసుకొన్నప్పుడు ప్రత్యభిన్నమైన బ్రహ్మానికి సంబంధించినట్టి లోగడ కలిగిన పరోక్షజ్ఞానం, ఇప్పుడు బ్రహ్మము యొక్క వ్యక్తిత్వం (ఆత్మకంటే భిన్నంకాకపోవటం)
అపరోక్షమౌతుంది (ప్రత్యక్షమౌతుంది).

"నీవు పదవవాడవు" అన్నప్పుడు ఆ దశమత్వం ఎట్లా ప్రత్యక్షమౌతుందో అదే విధముగా ప్రత్యగభిన్నత్వం ప్రత్యక్షమౌతున్నందన్నమాట.

శ్రుతివాక్య విమర్శనంవల్ల అపరోక్షజ్ఞానం ఎట్లాపుడుతుందో దృష్టాంతం ,
"పదవవాడు ఎవడు" ? 
అనేది ప్రశ్న.
"ఆ పదవవాడవు నీవే" ! అనేది సమాధానం .
ఈ సమాధానంవల్ల ఆ పదవవాడు మిగిలిన తొమ్మండుగురిని లెక్కించి తానే పదవవాడననే విషయాన్ని స్మరణకు తెచ్చుకొని వరుసగా లెక్కించుచు తనను కూడా లెక్కించుకొని తానే పదవవాడనని గుర్తించి అంగీకరిస్తున్నాడు.
ఇదే అపరోక్షజ్ఞానము.

ఈ విధంగా విమర్శనా పూర్వకమైన వాక్యం ద్వారా ప్రత్యక్షజ్ఞానం కలుగుతుంది.
ఇట్లా కలిగిన ప్రత్యక్షజ్ఞానానికి విపరీత భావనవల్ల ఎటువంటి హాని(బాధ)కలగదు.

ఈ పదవవానికి వాక్యజన్యజ్ఞానం కలిగింది - 'నేను పదవవాడను' అని. ఇటువంటి జ్ఞానం ఇక ఎన్నడూ ఏవిధంగానూ ఖండింపబడదు.
అంటే,'నీవే పదవవాడవు' అనే వాక్యముచే జనించిన
 'నేనే గదా దశముడను' అనే జ్ఞానమునకు ఏవిధమైన నష్టముండదు.

తనను మొదటనే లెక్కించినా, మధ్యలో లెక్కించినా,
చివర లెక్కించినా తాను దశముడనని దృఢముగ తెలియునే గాని తొమ్మిదవవాడనేమో ఆ తొమ్మిదిలో నొకడనేమో అనికాని,
"నేను పదవవాడను కానేమో"!
 మొదలైన సంశయములు విపరీతజ్ఞానం ఎన్నడూపుట్టదు.

కాబట్టి,అదే దృఢమైనట్టి అపరోక్షజ్ఞానం.
అపరోక్ష మైన జ్ఞానము అంత దృఢముగ ఉండును.          

No comments:

Post a Comment