*శ్రీమద్రామాయణము*
*అయోధ్యాకాండము*
*నేడు 27వ సర్గ*
*🌺📿🌺సీత తానుకూడా రాముణ్ణి అనుసరిస్తానని కోరటం 🌺📿🌺*
*రాముని మాటలన్నీ ప్రశాంతంగా విని సీత రామునిపై గల ప్రేమచేత కోపగించింది. తన మనస్సులోని మాట నిర్భయంగా చెప్పింది.*
*సీత: నాథా! నువ్వు చెప్పే మాటలు అర్ధం లేనివిగా ఉన్నాయి. నువ్వు మరొకసారి ఆలోచించుకుంటే నీకే నవ్వు కూడా వస్తుంది. అంతేకాదు వినేవాళ్ళంతా కూడా నవ్వుతారు. ఎందుకంటావా?*
*లోకంలో తల్లి, తండ్రి సోదరులు అంతా కూడా వాళ్ళ పుణ్యపాప ఫలాలను బట్టి జన్మిస్తారు; కర్మలు అనుభవించి పోతారు. కానీ ఒక్క భార్య మాత్రం భర్త కష్టసుఖాలను పంచుకొంటుంది. కాబట్టి మహారాజు మిమ్మల్ని అడవులకు పొమ్మని ఆజ్ఞాపిస్తే నన్నుకూడా ఆజ్ఞాపించినట్లే అవుతుంది. స్త్రీకి తండ్రికాని, పుత్రులుగాని, తల్లిగాని గమ్యాన్ని చూపరు (దిక్కు కాదు).*
*ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా భార్య భవిష్యత్తంతా భర్తతోనే ముడిపడి ఉంటుంది. అదే స్త్రీకి ఉత్తమగతి. కనుక నాథా! నువ్వు అడవులకు బయలుదేరినట్లయితే నేను నీ ముందు నడుస్తాను; దారిలో ఉండే రాళ్ళురప్పలు, ముళ్ళపొదలు శుభ్రంచేస్తూ నువ్వు నడవటానికి దారి సుగమంచేస్తూ ముందుకు పోతాను.*
*ఓ వీరుడా! నా మీద కోపం తెచ్చుకోకు. ఒకవేళ వచ్చినా, త్రాగగా మిగిలిన నీళ్ళను పారబోసినట్లుగా ఆ కోపాన్ని విసిరిపారెయ్యి, ఎందుకంటే, నన్ను విడిచి నువ్వు ఒక్కడవే వెళ్ళేందుకు, నేను ఏ పాపమూ చేయలేదు. పైగా అడవుల్లో నీకు ఏ కష్టమూ కలిగించను. నా మాట నమ్ము కాబట్టి నన్ను కూడా నీతో అడవులకు తీసుకొని వెళ్ళు.*
*దేవా! భార్య ఎప్పుడూ భర్తను అనుసరించే ఉండాలి. అదే శాస్త్ర సమ్మతం, పెద్ద పెద్ద భవనాల్లో నివసించినా, మేదలు మిద్దెలు కలిగి ఉన్నా, అణిమాది సిద్ధులతో ఆకాశమార్గాన రాకపోకలు సాగించినా, భార్య ఎప్పుడూ భర్తను అనుసరించే ఉండాలి. అట్లా భర్తతో కలసి ఉండటమే భార్యకు ధర్మం. ఈ భార్యాధర్మాలన్నీ నా తల్లిదండ్రులు ఉగ్గుపాలతో నాకు నేర్పారు. ఇవాళ కొత్తగా-నేర్చుకోవలసింది ఏమీ లేదు.*
*నాథా! మీరు వెళ్ళే అడవి ముళ్ళపొదలతో కూడి ఉంటుందని, పులులు, సింహాల వంటి క్రూరమృగాలు ఉంటాయనీ నన్ను భయపెట్టవద్దు. అక్కడ ఎటువంటి కష్టాలు ఎదుర్కోవలసివచ్చినా నేను వెనుకాడను; మీతో రాక తప్పదు. అదీకాక నా రామునితో ఉంటున్న నా దగ్గరకు భయం గాని, ఆపదలుగాని ఎట్లా వస్తాయి? మీకు సేవలు చేసుకుంటూ, పొందే పరమానందాన్ని త్రుంచి వేయకండి.*
*ఓ పురుషోత్తమా! అరణ్యవాస కాలమంతా మీకు ఉత్తమ సేవలు చేస్తూ ఉంటాను. కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను. మీతోపాటు పూలవాసనలు, పండ్లవాసనలను పీల్చుకుంటూ ఆనందిస్తాను. తామరపూలతో నిండిన సరస్సులలో స్నానాలుచేస్తాను. కొండలు, గుట్టలు, పర్వతాలు, నదులు, వాగులు ఇలా ఎన్నిటినో నీతో పాటే ఉంటూ చూసి ఆనందిస్తాను. ఈ విధంగా మీతోపాటు లక్ష సంవత్సరాలైనా గడిపేస్తాను. మీ పాదాలకు సేవ చేసుకుంటూ ఉండే సుఖం నాకు పుట్టింట్లో దొరకుతుందా? నాథా! నువ్వులేని స్వర్గమైనా నాకు వద్దు.*
*నాథా! మిమ్మల్ని సేవించటంకన్నా వేరొకటి తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా వదలి ఒంటరిగా వెళ్ళినట్లయితే నేను వెంటనే ప్రాణత్యాగం చేస్తాను. కాబట్టి ఏ విధమైన శంకలూ పెట్టుకోకుండా నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. నేను మీకు బరువు కాను. నా కోరిక తప్పక మన్నించండి. అంతట రాముడు ఆమెకు అరణ్యవాసంలో ఎదురయ్యే కష్టాలెన్నో చెప్పాడు. ఆమె మనస్సు మరల్చాలని అరణ్యంలో వాటిల్లే కష్టాలను ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు.*
*రేపటి శీర్షికలో...*
*🌺🌸🏵️రాముడు వనవాసంలో ఎదురయ్యే కష్టాలను సీతకు వివరించటం🏵️🌸🌺*
*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
📿🏹📿 🙏🕉️🙏 📿🏹📿
No comments:
Post a Comment