Thursday, June 19, 2025

**** *వాసనాత్రయము* *వాటిని ఎలా తొలగించుకోవాలి?*

 *వాసనాత్రయము*

*వాటిని ఎలా తొలగించుకోవాలి?*

*వాసనాత్రయము* అంటే...
*లోకవాసన,*
*దేహవాసన,*
*శాస్త్రవాసన*
అనే మూడు రకాల వాసనలు. ఇవి మనకు బ్రహ్మజ్ఞానం లేదా అచ్చ తెలివి కలగకుండా అడ్డుపడతాయి. 

 "లోకవాసన" అంటే లోకంలో మనం చూసే విషయాల పట్ల మనకు కలిగే ఆసక్తి, -  "దేహవాసన" అంటే మన దేహం పట్ల మనం చూసే ఆసక్తి, - "శాస్త్రవాసన" అంటే శాస్త్రాల పట్ల మనం చూసే ఆసక్తి. 

 ఈ మూడు రకాల వాసనలు మనకు ఉన్నంత వరకు మనకు బ్రహ్మజ్ఞానం కలగదు♪.  

 వాసనాత్రయము యొక్క వివరాలు:

*లోకవాసన:*
లోకంలో మనం చూసే విషయాల పట్ల మనకు కలిగే ఆసక్తి. ఇది మనకు ఒక భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది.

*దేహవాసన:*
మన దేహం పట్ల మనం చూసే ఆసక్తి. ఇది మనకు ఒక వ్యక్తిగత ప్రపంచం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది.

 *శాస్త్రవాసన:*
శాస్త్రాల పట్ల మనం చూసే ఆసక్తి. ఇది మనకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది.

 మనం ఈ మూడు రకాల వాసనల నుండి విముక్తి పొందాలి. అప్పుడు మనం బ్రహ్మజ్ఞానం పొందవచ్చు.

*శ్లో.*
*లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహాను వర్తనం |*
*శాస్త్రాను వర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ||*

*ప్రతిపదార్ధం:*

*లోకానువర్తనం త్యక్త్వా* = 
జనులు పోవురీతిని వదిలి; 

*దేహాను వర్తనం త్యక్త్వా* = 
దేహం నేననే భావాన్ని విడిచి; 

*శాస్త్రాను వర్తనం త్యక్త్వా* = 
శాస్త్రాలను అనుసరించటం వదిలి; 

*స్వ అధ్యాస అపనయం కురు* = 
నీ అధ్యాసను పోగొట్టుకో;

*వ్యాఖ్య...*

ఆత్మగా భావిస్తూ జీవించటంలో ముఖ్యమైన ఆటంకాలు.. 3 (అనువర్తనం = గ్రుడ్డిగా సదా అనుసరించటం.)

1) *లోకానువర్తనం త్యక్త్వా...*

జనులంతా ఎలా వెళ్తున్నారో చూచి గ్రుడ్డిగా అలాగే ఆధ్యాత్మికరంగంలో ఉన్న మనమూ వ్యవహరించటం కూడదు.  సామాన్యంగా ఈ లోకంలో ప్రతివారూ తామున్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎగబ్రాకటానికి ప్రయత్నిస్తారు. 
ధన సంపాదన, వస్తు సంపాదన, పదవీ సంపాదన, భోగ సంపాదన, రాజ్య సంపాదన, ఐశ్వర్య సంపాదన, ఇలా అన్నింటిని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానికి తగిన కర్మలు చేస్తారు. వాటివల్ల ఆ జన్మలో కలిగే ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారు. "ఆ తర్వాత ఏమిటి..? అని ఆలోచించరు, ఇదే - *"లోకానువర్తనం".*

 అలాగే, భార్యాబిడ్దల పోషణ, బంధుమిత్రాదులతో సంబంధం - ఇవన్నీ బంధాలని భావించకుండానే బంధంలో పడిపోతుంటారు.  ముక్తిని కోరే మనం గ్రుడ్డిగా లోకంలోని జనులను అనుసరిస్తే ఈ జన్మ వృధా అయినట్టే. జన్మరాహిత్యానికి ఏ ప్రయత్నమూ జరగనట్టే.

కనుక ఇలా గ్రుడ్డిగా అనుసరించటం కాకుండా జీవితాన్ని ఉన్నత ఆదర్శం వైపు త్రిప్పాలి.  ఇప్పటిదాకా కొనసాగిస్తున్న జీవితాన్ని మార్చుకోవాలి. 

 ఒక బాలుడు యవ్వనంలో ప్రవేశించగానే జీవనవిధానాన్ని మార్చుకుంటాడు. ఒక యువకుడు వృద్ధుడు కావటంతోనే జీవనవిధానం మారిపోతుంది. ఒక యువతి పెళ్ళి చేసుకోగానే పరిసరాలు మారిపోతాయి, జీవనవిధానం మారిపోతుంది. 

అలాగే,  మనం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం సాగించాలంటే ఇందులో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి వరకు సాధారణ జనులు నడిచిన మార్గంలో నడిచే నీవు, నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి.

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళువాకిళ్ళను అందరిలాగా పట్టుకొని ప్రాకులాడరాదు. బరువులు, భాద్యతలు అంటూ అన్నీ నెత్తిన వేసుకొని, తనకు లేని, ఎప్పటికీ రాని సుఖాల కోసం పరుగులు తీస్తూ గ్రుడ్డిగా నీ తోటి వారిని అనుసరిస్తూ జీవించే విధానం పశుజీవనమే.

అందుకే,  దీనిని వదలి తెలివిగా, మెలకువగా జీవించాలి... ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆశ్రయించి, వారు చూపిన మార్గంలో నీ జీవితాన్ని నడిపించాలి.  అయ్యో!  నలుగురు నడిచే బాటను నడవాలి గదా..! అని దిగులు పడరాదు, లోకాన్ని చూచి భయపడరాదు.  అందరూ బురదగుంటలో దిగుతున్నారు గదా..! అని మనమూ దిగరాదు.

2)  *దేహాను వర్తనం త్యక్త్వా...*

దేహం మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఎప్పుడూ దాని పోషణలోనే దాని అలంకరణలోనే మునిగిపోకూడదు.  అది కోరే కోర్కెలను తీర్చే బానిసవు కావద్దు. ఇష్టమైన తిండికోసం, ఆకర్షణీయంగా కనపడటం కోసం, దేహానికి వెట్టిచాకిరీ చేయరాదు. అలాగని సాధకుడు దేహాన్ని పట్టించుకోకుండా ఉండరాదు. అది "సిద్ధుల పని". సాధకుడు ఈ దేహంతోనే సాధనలు సాగించాలి...
 
శ్రవణ, మనన, నిధి, ధ్యాసనలకు ఈ దేహమే ఆధారం కనుక తగినంత సాత్విక ఆహారాన్నిస్తూ తగినంత దేహపోషణ చేసుకుంటూ, అనారోగ్యం రాకుండా కాపాడుకుంటూ ఒకవేళ అనారోగ్యం చేస్తే ఔషధాలు వాడుతూ దానిని చక్కగా పోషించుకోవాల్సిందే. అయితే, అతి కూడదు.

3)  *శాస్త్రాను వర్తనం త్యక్త్వా...*

 శాస్త్రాలన్నీ కీకారణ్యాల వంటివి. వాటిపై విపరీత వ్యామోహాన్ని పెంచుకొని, అన్నీ తెలుసుకోవాలని తపనపడితే జీవితమంతా కృషి చేసినా చాలదు. 

 చతుర్వేదాలు, షడంగాలు, షట్ శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, చరిత్ర, భూగోళం, భూగర్భశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం.. ఎన్నో.. ఇవిగాక నాట్య నృత్య శిల్పం, సంగీతం, లలితకళలు, యోగా ఇలా ఎన్నో శాస్త్రాలను తెలుసుకోవాలని అనుకోరాదు.  అన్నీ తెలుసుకోవటం సమయం వృధాచేసుకోవటమే.

No comments:

Post a Comment