Friday, June 6, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
          *అంతర్గత శత్రువులు*

*అహంకారం, అంతా నా ఘనతే అనుకోవడం, మమకారం... వ్యక్తి వినాశనానికి తొలి అడుగులు. వాటిని కలిగి ఉండటం జారుడు మెట్లపై నాట్యం చేయడమే. సామాన్య దృష్టితో భౌతిక శరీరం కనిపిస్తుంది. ఆత్మ అలౌకిక దృష్టికి మాత్రమే గోచరిస్తుంది. అలాగే అరిషడ్వర్గాలు వ్యవహార దృష్టికి తోచవు. అహంకారంతో విర్రవీగిపోతున్నా, నా వల్లే అన్నీ సాధ్యమవుతున్నాయనే గర్వంతో అంధులైనా, మమకారంలో మునిగి తేలు తున్న... మనిషి గ్రహించకపోవడం భగవంతుడి మాయ. ఆ మాయని అర్ధం చేసుకోవడం, నారదుడి లాంటి మహర్షులకే సాధ్యం కాలేదు. ఆ విషయాన్ని భాగవతం స్పష్టంచేస్తోంది. అయితే తాను స్వచ్ఛమైన భక్తికి దాసోహమైపోతానని స్వయంగా భగవంతుడే అనేక సందర్భాలలో చెప్పాడు.*

*రాగద్వేషాలకు అతీతులు కానివారుండరు! భారత యుద్ధ ముగింపు సమయంలో,* *రథసారథి అయిన కృష్ణుణ్ని తన సేవకుడిగా భావించి, ముందుగా రథం దిగమన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు 'కాదు నువ్వే ముందు దిగమన్నాడు. అర్జునుడు అయిష్టంగానే, గర్వాన్ని అణచుకుని దిగాడు. ఆ తరవాత శ్రీకృష్ణుడు దిగగానే రథం కాలిపోయింది. ఆ రథానికి తగిలిన అస్త్రశస్త్రాలు తాను ఉన్నంతవరకు పని చేయవని, తాను రథం దిగగానే అవి దాన్ని ధ్వంసం చేశాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన అహంకారం ఫలితం ఎలా ఉండేదో తలచుకుని సిగ్గుపడ్డాడు అర్జునుడు. ఒక గురువు శిష్యులతో దేవాలయ సందర్శనకు వెళ్లాడు. దారిలో సెలయేరు దాటాల్సి వచ్చింది. కొందరు భయపడటంతో వాళ్లకి తన పేరు ఉచ్చరిస్తూ సెలయేరు దాటమని చెప్పాడు గురువు. వాళ్లు అలాగే చేశారు. తన నామమహిమ గురించి శిష్యుల ముందు గర్వపడ్డాడు గురువు. అందరూ దైవదర్శనానికి వెళ్లారు. పురుషులు నడుం పైభాగంలో ఎటువంటి వస్త్రం ధరించకూడదన్న నియమాన్ని అనుసరించారు. ముందుగా శిష్యులను పంపించి ఆఖరున గురువు లోపలికి వెళ్లబోయాడు. పూజారి అతణ్ని ఆపి నడుం పైభాగాన వస్త్రం తీయలేదేంటి... అని అడిగాడు. గురువు నివ్వెరబోయి, ఛాతీమీద వస్త్రం ఏమీ లేదన్నాడు. అప్పుడు పూజారి నవ్వుతూ అతని హృదయాన్ని అహంకారం అనే వస్త్రం కప్పివేసిందన్నాడు. శిష్యులు చేసింది భగవన్నామ స్మరణ అని దానికి గురువు గర్వించాల్సిన అవసరం లేదనీ చెప్పాడు. 'కాదు, వాళ్లు స్మరించింది నా పేరే...' అని వాదించాడు గురువు.*

*అప్పుడు పూజారి చిరునవ్వుతో 'అన్నీ భగవన్నామాలు కావా? నీ పేరు కూడా భగవంతుడి పేరే కదా!? అన్నాడు. అప్పుడా గురువు పూజారి కాళ్లమీద పడి 'నా కంటికి ఏర్పడిన పొరలు తొలిగిపోయాయి, నాలోని అహంకారం ఈ క్షణమే నశించిపోయింది' అన్నాడు.*

*భగవంతుణ్ని ఆశ్రయించడంలో అడ్డుపడే, ఆయనని పొందకుండా ఆషే, అంతర్గత శత్రువులను గుర్తించాలి. వాటిని వదిలించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴

No comments:

Post a Comment