*మార్గదర్శి.....*
*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా... 9వ రోజు*
*📿🪔ఆదిదేవుడి అవతారమూ, ఆచరణా ఆర్తుల సముద్ధరణకే🪔📿*
*అన్యాయాలు, అక్రమాలు అవధులు దాటితే ఆది భగవానుడు భువిపై అవతరిస్తూంటాడు. సజ్జనులను కాపాడటమే తన అవతార లక్ష్యం. ఆయన చేసే ప్రతీ పనీ సన్మనుష్యుల ఉపకారానికే తప్ప తనకేమీ ప్రయోజనం ఆశించిచేయడు. అందుకే ఆతని పనులన్నీ “లీల" లంటారు. మన పనులన్నీ పరాయివాళ్ళను హింసించడానికీ, స్వార్థ సంతృప్తికినీ, కాబట్టి అవి “ఘోర కర్మము" లయ్యాయి.*
*మంచివారిని హింసించే వారిని క్రమంగా ఏరిపారవేస్తాడు... తన అవతార కాలంలో. వారి బలానికీ, వారి కపటానికీ తానెప్పుడూ బలి అయిపోడు. అలా బలి అయిపోయేవాడు ఇతరులనేమి రక్షిస్తాడు? దుష్టులకు గుణపాఠమెలా చెప్తాడు?*
*విపరీత ప్రవృత్తి వెర్రితలలు వేసిన వికృత జీవులను పెకలించి వేస్తాడు, కలుపు తీసినట్లు. తద్వార మంచివారనే పంటను* *స్వేచ్ఛగా పండనిస్తాడు. తనకోసం వారు చేసే ప్రతి సేవను ప్రీతితో స్వీకరిస్తాడు. విదురుడు, శబరి పెట్టిన పండ్లను “శుచీని” చాలా పవిత్రమైనవి అనుకుంటూ ఆరగించాడు గద! జాతి, కుల భేదాలుండవు. నిష్కలంకమైన శ్రీకృష్ణ భక్తి ఒక్కటే అక్కడ ప్రధానం. అది కలవారేది చేస్తే అదే ధర్మమౌతుంది. వారా ధర్మానాచరించగలిగే అవకాశం కలిగిస్తాడు. అదే తర్వాతి తరాలకి ఆదర్శమౌతుంది. బోయ స్త్రీ శబరి. శూద్రుడు విదురుడు. తిరుప్పాణి ఆళ్వారు, తిరుమంగైయాళ్వార్, గుహుడు మొదలైనవారంతా దళితులు. జటాయువు ఒక పక్షి, సుగ్రీవాదులు కోతులు. విభీషణాదులు రాక్షసులు. మాలాకారుడెవరో తెలియదు. గోపగోపికలు వెర్రిగొల్లలు. అయినా వీరందరూ చేసిన పనులే ధర్మాలయ్యాయి. వారి రక్షణకే భగవ దవతారం. ఇలాంటి వారికోసము గత యుగాలలో ఎన్నో అవతారా లెత్తినట్లే ఈ యుగంలోనూ, ఎన్నో రూపాలలో మన ఆరాధన లందుకుంటూ విగ్రహరూపంలో ఉన్నాడు.*
*శ్రీకృష్ణున్ని రూపంలో తయారుచేసినా, అంటే ప్రాకే కృష్ణుడు, నవనీతకృష్ణుడు, గోపాల కృష్ణుడు, మురళీ కృష్ణుడు, తాండవకృష్ణుడు, రోటికి బద్ధుడైన కృష్ణుడు ఇలా రూపమేదైనా, ఇత్తడి, వెండి, బంగారం వంటి ద్రవ్యమేదైనా, చివరికి మట్టితోనైనా సరే తాను స్వీకరించి, మనలను ఆ ద్రవ్యం, ఆ రూపంలోంచి అనుగ్రహిస్తాడు. ఆయనకిదీ ఒక అవతారమే. దీనిని “అర్చావతారం” అంటారు. ఆనాటి అవతారాలలో ఎంత సులభుడై, అప్పటివారికి లొంగి ఉన్నాడో ఇప్పటి మనకిగూడ ఈ అర్చావతారంలో ఎప్పటికీ లొంగే ఉంటాడు. మనం ఎలా చెబితే అలా, ఏది పెడితే అది తిని, ఎలా ఉంచితే అలా ఉండి, ఎక్కడ ధరించినా సహించేటంత సులభుడైపోయి ఉంటాడు. అయితే విగ్రహంలో ఏమీ చేతకానట్టున్నా... చేతకానివాడని మనం భ్రమపడకూడదు. ఏమీ తెలియనట్లే ఉంటున్నా, ఆతడు సర్వజ్ఞుడే అనేది మనం గుర్తుంచుకోవాలి. రోటికి కట్టివేసిన తల్లివద్ద అమాయకంగ నిలచినట్లే, మనమీది ప్రేమతో మనవద్ద అలా అశక్తునిలా, అజ్ఞుడిలా, ఏమీ లేనివానిలా, మనమీదే పూర్తిగా ఆధార పడినట్లుగ ఉంటాడంతే. ఇది కేవలం స్వేచ్ఛతో తానే కావాలని పరిగ్రహించే అవతారమని గుర్తించామా మనం ధన్యులం. అదే చెబుతున్నాడీ శ్లోకంలో. తాను సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు, సర్వేశ్వరుడు, సత్య సంకల్పుడు, సర్వరక్షకుడు, సమస్తకళ్యాణ గుణాకరుడు. ఈ గుణాలన్నీ, మనం భయపడతామని, కనిపించనీయకుండా దాచుకొని ఉంటాడు. అది అవతారమైనా, అర్చావతారమైనా సరే. ప్రీతితోతాను అవతారాల్లో అయినా విగ్రహరూపాల్లో అయినా ఏమీ చేతకానట్లు స్వీకరిస్తూ సంతృప్తి పడుతూ ఉంటాడు. మనమెలా చేసినా తాను స్వీకరిస్తాను అనే భరోసా కలిగించడానికే ఈ లీల. అందుకే భగవంతుడి యొక్క జన్మ, కర్మ ఈ రెండూ దివ్యములే.*
*పైపై చరిత్ర చదివినా, దర్శించినా ఆపాతరమణీయంగ, ఆకర్షణీయంగ ఉంటుంది. పుట్టడంలోని రహస్యం, పెరగడంలోని వైచిత్రి, జారత్వ, చోరత్వాదుల వంటి ఆశ్చర్య కృత్యాలు, అవ్యక్తంలోంచి వ్యక్తస్థితిలోకి వచ్చిన అవతార రహస్యం. వీటిని తరచి చూస్తే, ఆలోచించే కొద్దీ అమృత మయతీరాలలోనికి తీసుకు వెడతాయి. అందుకే భగవంతుని జన్మకర్మల రహస్యం రెండురకాలుగానూ తెలియాలి. పైపైకి అందంగ, ఆకర్షణీయంగ కనిపించే కథాభాగం తెలియాలి. ఇది ఆపాత మధురం. లోలోపలి తత్త్వ యథాత్మ్య సాక్షాత్కారంకై అన్వేషించాలి. ఇది ఆలోచనామృతం. ఇదే “తత్త్వతః " తెలియడమంటే! ఇది తెలిసినవానికి దేహత్యాగమే ఆలస్యము, ఆ జీవి మరో కర్మకృత దేహంలోకి రానేరాదు. తననే చేరుతాడని శ్రీకృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. ఆ ఇవ్వడం కూడా ఎంత హుందాగా ఔదార్యంతో యిచ్చాడో గమనించాలి.*
*జన్మించేవాళ్ళం ఇద్దరం. జీవుడూ, నేనున్నూ. నా అవతార రహస్యం తెలిస్తే “నీవు” జన్మించనవసరం లేదు అన్నాడు శ్రీకృష్ణుడు. అందులోనే మన జన్మలను మనం లేకుండా చేసుకొనే ఉపాయం చెప్పేసాడు. కానీ, ఆయనజన్మలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని అర్ధంకద! తెలుసుకున్న వాళ్ళవరకు తరిస్తారు. ఇంకా తెలియని జీవులు ఎందరో వుంటూనే ఉంటారీలోకంలో, వారందరికోసం శ్రీకృష్ణుడు తానుమాత్రం మళ్ళీ మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తూ ఉంటాడన్నమాట.*
*కర్మవల్ల కలిగే జన్మలు మనవి. ఆయన అనుగ్రహిస్తే మన కర్మ నశించిపోతుంది. కనుక మన జన్మలకంతమున్నది. కర్మలేకుండా, కేవలం కృపవల్ల ధరించే జన్మలు ఆయనవి. ఆ కృప నశించడమనేది లేదు. ఆతని ప్రేమ తరగని గంగాజలధార వంటిది. కృపవల్ల ఎత్తే అవతారాలు గూడ అలానే తరగనివే మరి! అందుకే నీ జన్మలకు అంతమున్నా అర్జునా! నా జన్మలకు మాత్రం అంతంలేదని సూచిస్తూన్నాడు శ్రీకృష్ణుడు ఇందులో.*
*జన్మలు లేకుండా, శరీరాలు లేకుండా, ఎక్కడో రాయి రప్పలా పడిఉంటామా? గాలిలో తేలియాడుతూంటామా అనే భయం కలగడం, బుద్ధిమంతునికి సహజం. ఆ భయాన్ని తీరుస్తూ "మామేతి సః” ఆ జీవులను నా దివ్య సన్నిధానానికి చేర్చుకుంటాను. ఏ దుఃఖ వాసనలూ, పాపకర్మ ప్రభావాలూ వాడి వైపుకూడా చూడనంత గొప్పస్థితి వానికి కలిగిస్తాను. మట్టిలో వేసినా పాదరసానికి మట్టి అంటదు కదా! అలానే ఎక్కడున్నా, ఈ క్షుద్రవిషయాలు అంటుకోకుండా ఉండే మంచి దివ్య దేహాన్ని ప్రసాదిస్తాను. దివ్యానుభవాలు ప్రసాదిస్తాను. నేనెట్లా ప్రకృతి ప్రభావానికి అతీతుడనో, ఈ నా భక్తుడినీ అలానే అప్రాకృతునిగ తీర్చిదిద్దు కుంటాను.. అన్నాడు స్వామి. ఇక ఇంత కంటే ఘనమైన ఉపకారమేమున్నది?*
*శ్రీకృష్ణుడు పరుల పీడలకు బలికాడు. పాలకుల పారుష్యానికి పీడితుడు కాడు. చేతకాక చేతులెత్తేసి కన్నీరు మున్నీరు కాడు. తన నాశ్రయించిన వారిని పాపాలనుండి బయటకు తెస్తాడు. పీడించేవారిని పారద్రోలుతాడు. చిరునగవు మోముతో మనలను ఉత్తేజితులను చేస్తాడు. ఎదురు తిరిగిన వారికి బుద్ధి చెప్పి పశ్చాత్తాప పడేట్లు చేస్తాడు. ఆ శ్రీకృష్ణుని కంటే వేరు దైవమేమి? ఆ ప్రభువు యొక్క అవతార రహస్యాన్ని ఆకళింపు చేసుకుందాం! ఆనందపు అంచులను అందుకొందాం!*
*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment