Thursday, October 17, 2024

 *🎻🌹🙏 నేడు వాల్మీకి మహర్షి జయంతి...!!*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿వాల్మీకి తండ్రి బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతసుడు . వాల్మీకి అసలు పేరు ప్రాచేతసుడు . చిన్నప్పుడే తండ్రి శాపం వల్ల బోయ కులంలో కిరాతకుడుగా పుట్టాడు . మళ్ళీ అయ్యో పాపం అనుకుని తండ్రి నీకు మహాపురుషులు కొంతమంది దివ్యమంత్రం ఉపదేశిస్తారు .

 🌸అప్పుడు మంచివాడయిపోతావని శాప విమోచనం కూడా చెప్పాడు . తమసా నదీ తీరంలో ఒక మహారణ్యంలో ఒక కిరాతకుడు జంతువుల్ని చంపిన మాంసంతోనూ , దారి కాచి వచ్చిపోయే వాళ్ళ దగ్గర ధనం ఎత్తుకుపోయి భార్యా పిల్లల్ని పోషిస్తున్నాడు . 

🌿ఒకసారి సప్తమహర్షులు దారి తప్పి అరణ్యంలో తిరుగుతూ వచ్చిన జంతువులు , గ్రద్దలు , మాంసం ముక్కలు , వాటికోసం పోట్లాడుకుంటున్న వేట కుక్కలు వున్న ప్రాంతానికి వచ్చారు . కిరాతకుడు వాళ్లని అడ్డగించి వాళ్ళ దగ్గరున్న ధనం ఇవ్వమన్నాడు . వాళ్ళు మా దగ్గరేముందిరా నీకివ్వడానికి ? అయినా ఇన్ని కిరాతకాలు చేసి సంపాయిస్తున్నావు ఎన్నాళ్ళు బ్రతుకుతావు ? ఏం పట్టుకు వెడతావు ? అన్నారు .

🌸 నాకోసం కాదు నా భార్య పిల్లల కోసం చేస్తునానన్నాడు కిరాతకుడు . నీ భార్య పిల్లలు నువ్వు తెచ్చి పెడితే తింటారు కానీ , నీ పాపంలో భాగం పంచుకోరు . ఈ పాపమంతా నువ్వే అనుభవించాలి . నువ్వు తీసికెళ్ళిన సొమ్ము వాళ్ళు తింటారు . ఎందుకురా ! ఇంత పాపం మూటకట్టుకుంటున్నావు ! అన్నారు . 

🌿బోయవాడు అయ్యా ! ఈ విషయం నాకు తెలియదు . నేను పెట్టిన దానితోపాటు నా పాపంలో కూడ భాగం పంచుకుంటారనుకున్నాను . ఎంతో తప్పు చేశాను . ఇప్పుడు నేను ఏం చేయ్యాలి ? అన్నాడు . సప్త ఋషులు ఆ కిరాతకుణ్ణి స్నానం చేసి రమ్మని శ్రీరామ మంత్రాన్ని ఉపదేశించారు . కాని అతడికి పలకడం చాతకాలేదు . అందుకుని ' మరా మరా ' అనమని చెప్పి వెళ్ళిపోయారు .

🌸 ఆ కిరాతకుడు దంపలు పళ్ళు తింటూ ఆ ఋషుల్ని తల్చుకుంటూ వాళ్ళు చెప్పినట్లే ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాడు . ఎవరొచ్చి పిల్చినా వెళ్ళలేదు . బోయకులం వాళ్ళంతా వీడికి బ్రహ్మరాక్షసి పట్టిందేమోనని వదిలేశారు . 

🌿అతడు గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు . ఇంద్రుడు ఎంతమందిని పంపించినా మనిషి కదలలేదు . అక్కడ జనసంచారం లేకపోవడంతో అతడి చుట్టూ పుట్టలు పెరిగిపోయి
నల్లత్రాచులు , తీగలు పెరిగి పక్షులు గూళ్ళు కట్టుకుని , క్రూర జంతువులు తిరుగుతూ వున్నాయి . అయినా అతని ఆత్మ ' రామ ' శబ్ద ధ్యానంతో నిండిపోయింది . 

🌸సప్త ఋషులు తిరిగివస్తూ మారిపోయిన ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎవరో మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడనుకుని అంతలోనే జ్ఞాపకం తెచ్చుకుని అతణ్ణి పిలిచారు . ప్రాచేతసుడు శాపవిమోచనమయి వాళ్ళకి నమస్కారం చేశాడు . నువ్వు ఇప్పుడు మా అంతటి వాడివయ్యావు అని చెప్పి వెళ్ళిపోయారు సప్తఋషులు .

🌿 వాల్మీకుడు బ్రహ్మదీక్షలో ఉండగా విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు . వాల్మీకి శ్రీరాముణ్ణి స్తోత్రం చేశాడు . శ్రీరాముడు నువ్వు నా చరిత్ర రాస్తే నాకు ఆనందం , నీకు కీర్తి , మోక్షం కలుగుతాయని ఆశీర్వదించాడు . వాల్మీకి గంగా తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అనేకమంది శిష్యుల్లో భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకుని జీవిస్తున్నాడు .

🌸 రాముడు లోకుల అపవాదుకి భయపడి సీతని అరణ్యంలో వదలేసినప్పుడు వాల్మీకి రక్షించి , ఆమెకి పుట్టిన కుశలవుల్ని అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించాడు . ఒకసారి వాల్మీకి శిష్యుల్ని తీసుకుని తమసా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తూ పక్షుల జంటని చుశాడు . కిరాతకుడొకడు అందులో ఒక పక్షిని కొట్టాడు . 

🌿మగపక్షి కిందపడి చచ్చిపోయింది . ఆడపక్షి ఏడుస్తోంది . వాల్మీకి అది చూసి బాధపడి ఒక శ్లోకంతో ఆ కిరాతకుణ్ణి శపించాడు . ఆ శ్లోకాన్ని భరద్వాజుడు చక్కగా పలికి గురువయిన వాల్మీకికి వినిపించాడు . వాల్మీకి తన శోకం , శ్లోకంగా రావడమేమిటా ! అని అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ స్నానం పూర్తి చేసి వెళ్ళిపోయాడు.

🌸ఒకనాడు బ్రహ్మదేవుడు వాల్మీకి దగ్గరకి వచ్చాడు . వాల్మీకి బ్రహ్మని పూజించి ఆజ్ఞాపించండి నేనేం చెయ్యాలో ! అన్నాడు . నువ్వు చెప్పిన శ్లోకం సరస్వతీ దేవి నా కోరిక ప్రకారం చెప్పించింది . నువ్వు రామకథ రాయడం మొదలు పెట్టు . అంతేకాదు నువ్వు రాసిన రామాయణం ఎంతవరకూ లోకంలో వుంటుందో అంతవరకూ నీకూ అన్ని లోకాల్లోనూ తిరగగల శక్తి , ఏదనుకుంటే అది జరిగేలా , ఎప్పుడునుకుంటే అప్పుడు మోక్షం పొందేలా వరం ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ .

🌿 శిష్యులు తను పలికిన మొదటి శ్లోకాన్ని రాగయుక్తంగా చదువుతుంటే విని ఆనందంతో వాల్మీకి దర్భాసనం మీద పద్మాసనం వేసుకుని యోగధ్యానంలోకి వెళ్ళి రామాయణం మొత్తం చూసి శ్రీరామ జననం మొదలు పట్టాభిషేకం వరకు , ఉత్తరకాండతో కలిపి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఎంతో మధురంగా , మనోహరంగా రాశాడు .

🌸ఆ మనోహరగాథని కుశలవులకి నేర్పించాడు . ఆ కవలలు ముని సభల్లో పాడుతుంటే విని ఆనందించని వాళ్ళూ , దాన్ని తప్పుపట్ట కల్గిన వాళ్ళూ లేరు . నైమిశారణ్యంలో శ్రీరాముడు అశ్వమేథ యాగం చెయ్యడం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది . వాల్మీకి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని అశ్వమేధ యాగం చూడ్డానికి వెళ్ళాడు .

🌿వెళ్ళేటప్పుడు కుశలవుల్ని పిలిచి రాజమార్గాల్లోనూ , రాజ భవనాల్లోనూ , బ్రాహ్మణ సభల్లోనూ , రాముడి భవన ద్వారం దగ్గర ఎవరడిగినా ఎప్పుడడిగినా రామాయణ గానం చెయ్యండి . ఎవరు పెట్టినా ఏమి తినకండి . మీరు ఎవరి పిల్లలు ? అని అడిగితే వాల్మీకి మహర్షి శిష్యులమని చెప్పండి అని చెప్పాడు వాల్మీకి . శ్రీరాముడు కుశలవుల్ని పిలిపించుకుని రామయణగానం ఇరవై సలు విన్నాడు . వాళ్ళకి మణి మణిక్యాలు ఇవ్వబోతుండే మేము కాయలు , పళ్ళు , దుంపలు తిని బ్రతుకుతాం . మాకివన్నీ వద్దన్నారు కుశలవులు . మొత్తం రామాయణం ఎన్ని సర్గలని అడిగాడు రాముడు . కుశలవులు 500 సర్గలు , ఇరవై నాలుగువేల శ్లోకాలని చెప్పారు . మిగిలిన కథ కావాలంటే మీ యాగం అయిపోయాక వినిపిస్తామని చెప్పారు .

🌸 రాముడు వాళ్ళగానం విన్నాక వాళ్ళు తన కొడుకులే అని తెలుసుకుని వాల్మీకి మహర్షిని సీతతో వచ్చి సభలో చెప్పమన్నాడు . వాల్మీకి సీతని , కుశలవుల్ని తీసుకుని వచ్చి నిండు సభలో సీత క్షేమంగా వుందనీ , ఆమె పిల్లలే ఈ కవలలనీ ఇది సత్యం కాకపోతే తనకున్న తపశ్శక్తి నానశనమయిపోతుందనీ సభలో చెప్పాడు . 

🌿సీత పడ్డ కష్టాలు విని సీతను చూడగానే ప్రజలంతా ఏడ్చేశారు . శ్రీరాముడు సీతతో కూడా శపథం చేయించమని వాల్మీకిని ప్రార్ధించాడు . సీత కూడ మూడుసార్లు శపథం చేసి తనని తీసుకు పొమ్మని భూదేవి అయిన తన తల్లిని ప్రార్ధించింది . వెంటనే భూమిలోంచి రత్నసింహాసనం వచ్చి సీతను కూర్చో పెట్టుకుని తీసికెళ్ళిపోయింది . దుఃఖపడుతున్న రాముడికి బ్రహ్మాది దేవతలు సీతారాముల అసలు కథ చెప్పి వెళ్ళిపోయారు . 

🌸శ్రీరాముడు వాల్మీకిని పూజించి అశ్వమేథ యాగం పూర్తి చేసి కుశలవుల్ని తీసుకుని అయోధ్యకి వెళ్ళాడు . వాల్మీకి మహర్షి శ్రీమద్రామయణాన్ని రాసి , పిల్లలో గానం చేయించి , తాను మోక్షం పొంది , అది చదివిన వాళ్ళకి , విన్నవాళ్ళకి కూడా మోక్షం వచ్చేలా అనుగ్రహించి , రఘువంశాన్ని ఉద్ధరించిన మహానుభావుడు . వాల్మీకి మహర్షి కథ చదివితే రామాయణం చదివితే వచ్చేంత పుణ్యమే వస్తుంది . అద్భుతంగా వుంది కద వాల్మీకి మహర్షి కథ... స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment