Monday, October 27, 2025

 261 వ భాగం 
🕉️అష్టావక్ర గీత 🕉️ 
అధ్యాయము 18 
శ్లోకం 50

యధా యత్కర్తుమాయాతి తథా తక్కురుతే రుజుః|
శుభం వాప్యశుభం వా$పి తస్య చేష్టా హి బాలావత్||

జ్ఞాని తనకు ప్రాప్తించిన ఏ కర్మనైనా మంచిది, చెడ్డవి అని భావించక సమదృష్టితో శాంతముతో ఆచరిస్తాడు. కేవలం బాలుని వలె అతని ప్రవర్తన ఉంటుంది.

అన్ని సమయ సందర్భాలలోనూ పరిస్థితులలోనూ కూడా జ్ఞాని సమభావముతో శాంతంగా జీవించగలడు.ప్రారబ్దనుసారముగా సంప్రాప్తమైన కర్మలను మనశ్శరీరాలతో కర్త,భక్త భావాలు లేకుండా ఆచరిస్తుంటాడు.దేనిని కావాలని కోరుకోడు ,వచ్చిన దానిని నిరసించడు.ఎట్టి పరిస్థితులలోను భయాందోళనకు సంతోషాతిశయాలకు లోను కాడు. సంఘటనలను సాక్షిగా చూస్తూ కొత్త కోరికలను కోరకపోవటముతో కర్మలు అతనిని బంధింప సమర్ధము కావు. అహంకార మమకార రహితులైన సర్వత్రా ఏకమైన సచ్చిత్ ఆనందమైన తన స్వరూపాన్ని వీక్షిస్తూ శాంతంగా జీవించే అట్టి మహాత్మానికి శుభాశుభ భావాలే ఉండవు. కోరే మనసుకు నిర్ణయించే బుద్ధికి తన్ను వేరుగా తలపోస్తూ నానాత్వాన్ని దర్శించే అహంకారాన్ని అధిగమించి ఏకత్వానుభవంలో స్థిరుడై ఉంటాడు.

ప్రాప్తించిన వాటిని శాంతంగా వీక్షిస్తూ నిశ్చల మనోబుద్ధులతో జ్ఞాని వ్యవహరించేతీరు బాలును వలె కనిపిస్తుంది. ఈ ఉదాహరణ ఇదివరకే వివరంగా చర్చించబడింది.

ఇదే అధ్యాయంలోని 29వ శ్లోకపు భావాన్ని ఈ శ్లోకము వ్యతిరేకించినట్టుగా స్మరిస్తుంది. తాను కర్త నేనే బావం తనలో ఉన్నవాడ కర్మలను చేయకున్నా చేసినట్టే. అహంకార వర్జితుడైన జ్ఞాని కర్మలను ఆచరించిన మానిన నిశ్చయంగా అతడు ఎన్నడూ దేనిని చేయనట్టే అని చెప్పవచ్చును. అయినా నిశితంగా పరిశీలిస్తే అదే భావం విపుళీకరించబడటం కనిపిస్తుంది.🙏🙏🙏

No comments:

Post a Comment