Tuesday, October 28, 2025

 *వ్యామోహం... వివేకం*
వ్యామోహం... మనిషిని అంధత్వంలోకి నెట్టేసే భయంకర దుర్గుణం. ఎంతటి వివేకవంతులనైనా, భగవద్భక్తులనైనా అది అధఃపాతాళానికి తొక్కేస్తుంది. లౌకిక విషయాలపై, బంధాలపై, కోరికలపై అతిగా ఏర్పడే మమకారం, ఆసక్తే వ్యామోహం. ఇది సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది, సత్యాన్ని చూడనీయకుండా మనసును కప్పేస్తుంది. చివరికి దుఃఖానికి దారితీస్తుంది.

వ్యామోహం మనిషిలోని ఆలోచనా శక్తిని హరించివేస్తుంది. తీవ్రమైన మానసిక వేదనకు దారితీసి ఆత్మశాంతిని దూరం చేస్తుంది. వ్యామోహంలో పడిన మనిషి, తన కోరికలను తీర్చుకోవడానికి అధర్మానికైనా పాల్పడటానికి వెనుకాడడు. ధర్మం, న్యాయం, నైతిక విలువలు అన్నీ అడుగంటిపోతాయి. వ్యామోహానికి లోనైన మనిషి వివేకాన్ని కోల్పోయి దేనినైతే మోహిస్తున్నాడో, దాన్ని మాత్రమే చూస్తాడు. కానీ దాని మంచి- చెడులను విశ్లేషించలేడు. అజ్ఞానం, అహంకారం పెరుగుతాయి. వ్యామోహం ఎంతటి గొప్పవారినైనా ఎలా పతనం చేస్తుందో చెప్పడానికి ధృతరాష్ట్రుడు గొప్ప ఉదాహరణ. తమ్ముడు పాండురాజు మరణం తరవాత ధృతరాష్ట్రుడు రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. కానీ, అతడికి తన కుమారుల పట్ల ముఖ్యంగా దుర్యోధనుడిమీద అపారమైన పుత్రవ్యామోహం. దుర్యోధనుడు పాండవుల పట్ల ఎంత అన్యాయంగా, అధర్మంగా వ్యవహరించాడో ధృతరాష్ట్రుడికి స్పష్టంగా తెలుసు. కొడుకు దుష్ట బుద్ధిని, అహంకారాన్ని, పాండవులపై ద్వేషాన్ని గమనించాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి మహానుభావులు ఎన్నోసార్లు ధృతరాష్ట్రుణ్ని హెచ్చరించారు కూడా. పుత్రుడి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి, ధర్మమార్గాన్ని అనుసరించమని సలహా ఇచ్చారు. పాండవులకు న్యాయంగా రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వమని హితవు చెప్పారు. ధృతరాష్ట్రుడికివేవీ చెవికెక్కలేదు. స్వయంగా శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి ధర్మస్థాపనకు ప్రయత్నించినా, తన పుత్రవ్యామోహాన్ని వీడలేకపోయాడు.తన సమక్షంలో అధర్మం జరగడానికి అనుమతించాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి అమానుష చర్యలు జరిగినప్పుడు కూడా కౌరవులను ఆపలేకపోయాడు. ఈ పుత్రవ్యామోహం చివరికి ఒక మహా సంగ్రామానికి దారితీసింది. ఆ యుద్ధంలో అతని నూరుగురు కుమారులు, ఎందరో బంధువులు, మిత్రులు మరణించారు. ఎవరి మీదైతే విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకుని అధర్మానికి కొమ్ము కాశాడో, ఆ పుత్రుణ్నే పోగొట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడి వివేకం, ధర్మజ్ఞానం వ్యామోహమనే అంధకారం ముందు నిష్ప్రయోజనమయ్యాయి. విషయాసక్తిని తగ్గించుకోవాలని, వాటిపై అతిగా ఆధారపడకూడదని పెద్దలు చెప్పేది అందుకే. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, పరిస్థితులను తటస్థంగా విశ్లేషించడం... వ్యామోహాన్ని దూరంగా ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసం మనసును ప్రశాంతంగా ఉంచి, వ్యామోహాలను దరిచేరనివ్వవు.
వ్యామోహం అనేది మనిషి జీవితాన్ని నిస్సారంగా మార్చే ఒక విషతుల్యమైన భావన. దానికి దూరంగా ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని, అంతర్గత శాంతిని కోరుకునేవారు వ్యామోహాన్ని వీడి, వివేక మార్గంలో పయనించాలి. అప్పుడే నిజమైన ఆనందాన్ని, మోక్షాన్ని పొందవచ్చు.....*
.

No comments:

Post a Comment