🕉️ ఓం నమో శివ కేశవ శనీశ్వరాయ నమః 🕉️
🙏 శివాయ గురవే నమః 🙏
*🙏సుఖం,సంతోషం,ఆనందం
ఈ మూడు ఒకటేనా?అసలైన
ఆనందాన్ని ఏలా పొందగలం?🙏*
*కొంతమంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమైన ఆనందం అంటే ఏమిటి దాన్ని ఎలా పొందవచ్చో వివరించమని. నిజానికి ఆనందం అనేది ప్రతి మానవుని సహజస్థితి, వాస్తవపరిస్థితి. కానీ, చాలామంది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక భోగాలు, విషయవాంఛలు, సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ కొనసాగిస్తున్నారు.*
*సుఖం, సంతోషం, ఆనందం ఈ మూడింటిని పరిశీలిస్తే ఈ మూడింటిని నోటితో పలికే సమయంలో ఒకేలా అనిపిస్తున్నా, ఇవి వేరు వేరుగా మూడురకాల అనుభూతులు. వీటిని పొందే విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. పంచ కర్మేద్రియాలను సంతృప్తిపరిచడం ద్వారా పొందే అనుభూతి ''సుఖానుభూతి ''. ఇది కేవలం శారీరకమైనది. ఇది తాత్కాలికమైన ఒక అనుభూతి మాత్రమే తప్ప ఇది శాశ్వతానందం కాదు.*
*వినోదభరితమై సంఘటనల వలన మనస్సును ఉత్సాహపరిచే అనుభూతి ''సంతోషానుభూతి '' అంటారు. ఇది ఒక మానసిక అనుభూతి తప్ప శాశ్వతానందం కాదు. శాశ్వతానందం అంటే వీటికి అతీతమైన "ఆనందానుభూతి " అది ఆత్మసంబంధితమైన "ఆత్మానందం " ఇదే శాశ్వతానందం. నిజానికి ఈ ఆనందం అనేది ఆధ్యాత్మికం. ఇది బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి.*
*మీరు గమనిస్తే "సుఖానుభూతి " అనేది మిమ్మల్ని మీ జీవితాలని భోగాలతో కట్టిపడేస్తుంది, "సంతోషానుభూతి " అనేది మీకు జీవితంలో కేవలం చిరుస్వేచ్చనిస్తుంది. "ఆనందానుభూతి " అనేది మీకు పరిపూర్ణమైన "శాశ్వతానందాన్ని" ప్రసాదిస్తుంది. ఇది శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి చేరుకుప్పుడే ఆ ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి చేరుకుంటాం.*
*ఇందులో మొదటిది మనకు బంధం అవుతుంది, రెండవది తాత్కాలికమైనది, మూడవది మాత్రమే శాశ్వతమైనది. మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జననమరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి చేరినవాడు అమృతమయుడై జీవిస్తూ ఉంటాడు. సుఖం, సంతోషం పొందడానికి హంగులు కావాలి. కానీ ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధికస్థితిగతులూ అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం, అన్నీ అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.*
*మన భావాలపట్ల, మనలో ఉన్న ఆంతర్యామిపట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటిపట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామి పట్ల ఎరుకతో, నమ్మకం వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో కలిసి మెలిసి వున్నట్లే.*
*ఆనందాన్ని పొందటానికి మనిషి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత. మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత. ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం పేరు ఏదైతేనేం అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని మనకు తెలియజెప్పే ప్రక్రియలే.*
*ఎక్కడైతే "నేను, నాది, అంతా నాకే కావాలి అనే అహం 'ఉండదో ' అక్కడ ఆనందం తప్పనిసరిగా ఉంటుంది ". నిజానికి ఆనందం అనేది మనలోపలే వుంటుంది. అయితే ఆ ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే మనకు అర్ధమౌతుంది మనలోని ఆనందమే దివ్య చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది ''సత్ చిత్ ఆనందం '' యొక్క గొప్పతనం. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం ఆనందమంటే పరమానందం. ముందుగా ఏ విషయంలోనైనా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి ". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు ఆత్మను స్పృశించగలరు. అందుకు తప్పని సరిగా సాధన చేస్తే సత్ ఫలితాలను పొందవచ్చును.*ఆదిత్యయోగీ*
*మరి ఆనందం పొందగలిగే కొన్ని మార్గాలను తెలుసుకొందాం. నీవు ఏ పని చేసినా ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. అందరిలోఉన్న పరమాత్ముని గుర్తించడం. ఏ క్షణానికాక్షణం ఎరుకతో వర్తమానంలో జీవించడం. ఇతరుల పట్ల సర్వజీవులపట్ల భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం. "మానవ సేవే మాధవ సేవ ".*
-------------------------------------------------------
పరమ శివుని అనుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు.
దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో........ అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
శివుడు సర్వాంతర్యామి. ఎవరెవరు..... ఎప్పుడెప్పుడు...... ఏమనుకుంటున్నారో.... అన్నీ తెలుసుకోగలడు. కుబేరుని అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది.
కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు......, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి.
ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకు వెళ్ళు......' అన్నాడు పరమశివుడు.
హా! ఈ పసిపిల్లవాడా...., నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే... అనుకుంటూనే గణపతిని తీసుకుని తన భవనంలోకి తీసుకెళ్ళి, అక్కడ ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.
వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.ఆదిత్యయోగీ.
వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు.
కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
శివా! శంకరా! నేవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్నీ ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు.
మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నువ్వు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు.
ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహంకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేన్పులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక..*
.
శంకరుడు వింధ్య పర్వతాన్ని అనుగ్రహించడానికి కారణం :
దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి 'మహాదేవా, తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి' అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. 'నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను' అన్నాడు.
'నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి' అని అడిగాడు. 'నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను' అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు 'ప్రభూ, దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను' అని చెప్పాడు.ఆదిత్యయోగీ.
అపుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి 'ఓంకార లింగము', ఒకటి 'అమలేశ లింగము'. అందుకే మనం చెప్తే 'ఓంకారమమలేశ్వరం' అంటాము. ఆ వెలయడం మాంధాతృ పురంలో వెలశాడు.
ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. ఇపుడు వింధ్య గిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆసవ మలము, కార్మిక మలము, మాయక మలము అని మూడు రకములయిన మలములు ఉంటాయి.
మీరు స్నానం చేసినా ఈ మూడూ వదలవు. కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడో వాడు ఓంకారేశ్వరుడు.
మీరు కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. మీరు అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఇపుడు ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు....*
సర్వే జనాః సుఖినోభవంతు
.
🙏 ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏
No comments:
Post a Comment