Sunday, October 26, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   తల్లిగారితో సహా ఆశ్రమ సేవకులు, భక్తులతో మహర్షి కొండ మీద ఉన్న రోజులవి.  ఆ రోజు మహర్షి తల్లిగారు అలఘమ్మ అరుణగిరిలో లీనం(మోక్షం) అయ్యారు. మహర్షి "ఈ శరీరాన్ని చీకట్లో తీసుకునిపోయి ఏ సందడి లేకుండా ఎవరికీ తెలియకుండా ఎవరిదిగాని నేల చూసి దాంట్లో గుంట తీసి పాతిపెట్టి తెల్లవారక ముందే వచ్చేయండి" అని ఆశ్రమ వాసులకు సెలవిచ్చారు.

    ఆశ్రమ సేవకులు అరుణగిరి మీద నుండి దేహాన్ని క్రిందికి దింపారు. కాని ఎక్కడ పాతిపెట్టాలో తెలియక తికమక పడి తమలో తాము చర్చించుకోసాగారు. ఇంతలో ఈ విషయం తిరువన్నామలైలో తెలిసిపోయింది. అందరూ వచ్చి ఒక మంచి స్థలం చూసి పాతిపెట్టారు.

  ఒక భక్తుడు సమాధి కట్టించారు.  మరొక భక్తుడు అన్నం వండి పెట్టాడు. ఇంకొక భక్తుడు పేదలకి అన్నదానం చేశాడు. ఇలా పదిరోజులు హడావుడి జరిగింది. 

    ఇది తెలిసిన చిన్నస్వామి(మహర్షి తమ్ముడు) రోజూ కొండ దిగి వచ్చి అమ్మ సమాధికి పూజ చెయ్యడం, నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారు. ఇక చిన్నస్వామి వెంట అందరూ కొండదిగి రావడం; కొన్ని రోజులకు మహర్షి కూడా అరుణగిరి దిగి రావడం జరిగింది.

   ఈ విధంగా మహర్షి ప్రతిరోజు కొండ దిగడం ఎక్కడం ఎందుకని కాబోలు ఒకరోజు అక్కడే అమ్మ సమాధి వద్ద ఉండిపోయారు. ఒక భక్తుడు మహర్షికి నీడగా ఉంటుంది అని ఒక పందిరి వేశాడు. ఈ విధంగా రమణాశ్రమం ఏర్పడినది. 

   ఒకసారి మహర్షి యధాలాపంగా ఇలా సెలవిచ్చారు ....

   ఎవరికీ తెలియకుండా పాతిపెట్టి తెల్లవారేలోపల గప్పుచిప్పున వచ్చేయండి అని అన్నాను; కాని ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. చూశారా! రహస్యంగా దేహాన్ని పాతిపెట్టిన చోట ఎన్ని కట్టడాలు ఇప్పుడు పైకి లేచాయో కదా!

No comments:

Post a Comment