*#పురానీతి-అతి తెలివికి ఆశాభంగం*
విభీషణుడు లంకానగరానికి రాజైన తర్వాత శ్రీరంగపట్నంలోని రంగనాధాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేవాడు . ఒక వ్యక్తి ఇది గమనించాడు. అతను ఆశపోతు . అతి తెలివిగలవాడు. లంకానగరం చాలా సంపన్నమైనది కాబట్టి ఎలాగైనా విభీషణుని కన్నుగప్పి లంకకు వెళ్తే బోలెడంత డబ్బు , బంగారం తెచ్చుకోవచ్చననుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఒకరోజున విభీషణుడు పూజలో లీనమై ఉన్న సమయంలో మెల్లగా ఆయన వెంట ఉన్న పూలసజ్జలో దూరాడు . పూజ అయిపోయిన వెంటనే విభీషణుడు ఆ సజ్జను తీసుకుని ఆకాశమార్గాన లంకకు పయనమయ్యాడు . విభీషణుడు రాక్షస జాతిలో జన్మించాడు కాబట్టి , అతనికి ఆ వ్యక్తి ఒక చీమ వంటి వాడే . విభీషణుడు లంకకు చేరుకున్న తర్వాత తన పూలసజ్జను దింపాడు . అందులోనుంచి ఈ వ్యక్తి బయటికి వచ్చాడు . విభీషణుని చూసి భయంతో వణికి పోయాడు . అతన్ని చూసి ఆర్చర్యపోయిన విభీషణుడు అతన్ని అనునయించి , భయాన్ని పోగొట్టి మెల్లగా అతని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు . సహజంగానే మంచివాడు . దానగుణం సంపన్నుడు అయిన విభీషణుడు అతని సాహసానికి ముచ్చటపడ్డాడు. అతని కోరిక తీర్చాలనుకుని , తన అనుచరులను పిలిచి , ఇతనికి ఏమి కావాలో అది ఇచ్చి తిరిగి భద్రంగా శ్రీరంగపట్నం చేర్చమని ఆదేశించాడు .
విభీషణుని సేవకులు అతన్ని అరచేతిలో పెట్టుకుని తీసుకుని వెళ్లి కోశాగారము ముందు దించారు . అక్కడ ఉన్న అమూల్యమైన మణి మాణిక్యాలు , రత్నాభరణాలు , అపారమైన సంపదను చూసి సంబ్రమాశ్చర్యాలతో నోటమాట రాలేదు . ఏది కావాలో తేలుచుకోలేక దిక్కులు చూడసాగాడు . విభీషణుని సేవకులు అది చూసి చిన్నగా నవ్వుకుని , ఏం కావాలో తొందరగా చెప్పామన్నారు . అతను ఎంతో తెలివిగా " మీరలా అడిగితే నాకేమి తెలుస్తుంది ? మీ రాజ్యంలోకెల్లా అమూల్యమైనది , అపురూపమైనదీ అయిన వస్తువును తెచ్చి ఇవ్వండి " అన్నాడు
. ఆ రాక్షసులు కాసేపు అలోచించి ఒక చిన్న బంగారు భరిణను తీసుకొని వచ్చి దానిని అందంగా అలంకరించి ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టి అతని ముందుంచారు . " మా రాజ్యంలోకెల్లా అపురూపమైన వస్తువు ఇదే . నిన్ను తీసుకుని వెళ్లి మీ రాజ్యంలో దించాలి మేము. ఇక రా నువ్వు ". అంటూ కళ్ళు మూసి తెరిచేలోగా అతన్ని శ్రీరంగపట్నంలోని స్వామివారి ఆలయం ముందుంచి , అక్కడినుంచి మాయమైపోయారు.
ఆవ్యక్తి ఎంతో ఆత్రంగా ఆ పెట్టెలోనుంచి ఆ భరిణను బయటకు తీసి , దానిలో ఉన్న వస్తువును చూసి నిర్ఘాంత పోయాడు . ఆ తర్వాత తన అతితెలివికి లబోదిబోమని నెత్తీనోరూ కొట్టుకున్నాడు . ఎందుకంటె అది ఒక సాధారణమైన సూది మాత్రమే కానీ లంకానగరవాసులకు అదే ఎంతో అమూల్యమైనది మరి !
ఈ సంఘటన నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ , శ్రీ రామకృష్ణ పరమహంస ఈ కదా ద్వారా ఆశపోతులకు ఎప్పటికైనా శృంగభంగం తప్పదని శిష్యులకు బోధించేవారు..*
No comments:
Post a Comment