Sunday, October 26, 2025

 దీపం... సత్య స్వరూపం. చీకటి... అసత్యానికి మారుపేరు. చీకటికి గారడి విద్యలు తెలుసు... తాడును పాములా, పామును తాడులా భ్రమింపజేస్తుంది. తలపుల్ని తప్పుదారి పట్టిస్తుంది. చీకటి మహా కర్కశమైంది... మనిషిని తాత్కాలిక అంధుడిగా మార్చేస్తుంది. ఆ కాసేపూ ఎదురుగా దేవుడే ఉన్నా గుర్తించలేడు. చీకట్లో మనిషిలోని అసుర ప్రవృత్తి పదింతలు పెరుగుతుంది. మహామహా ఘోరాలన్నీ చీకటిపడ్డాకే జరుగుతాయి. కాబట్టే, చీకటంటే అతనికి అంత భయం. ఆ కారు నలుపును మృత్యువు ముఖంలా ఊహించుకుంటాడు. ‘అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగమయా...’ అంటూ చెడు నుంచి మంచి వైపూ, చీకటి నుంచి వెలుతురు వైపూ, మృత్యువు నుంచి అమరత్వం వైపూ తనను తీసుకెళ్లమని సర్వేశ్వరుడిని వేడుకుంటాడు. దీపారాధన సమయంలో దేవుడి ముందు దీపం వెలిగించేది, పూజగదిలోని చీకటిని తొలగించడానికి కాదు... మన మదిలోని అజ్ఞానపు మబ్బుల్ని వదిలించుకోడానికి!
మనుషుల స్వభావాలూ దీపాల్లాంటివే. కొందరు వెలగని దీపాలు, తమోగుణానికి ప్రతీకలు. అంతరంగం నిండా అజ్ఞానమే! కొందరు గుడ్డి దీపాలు, రజోగుణ స్వరూపులు. జీవితమంతా జ్ఞాన-అజ్ఞానాల దోబూచులాటే! కొందరు మాత్రం, దేదీప్యమాన దీపాలు, సత్వగుణ సంపన్నులు. అచ్చమైన జ్ఞాన స్వరూపాలు వీళ్లు.  మరణం తర్వాత కూడా ఆత్మీయ బంధువులుగానో, ఆత్మబంధువులుగానో... నాలుగు ఇళ్లలో పటాలై నిలుస్తారు, దీపాలై వెలుగుతారు. నరకచతుర్దశి నాడు పితృదేవతల కోసం యమదీపాలు వెలిగించే సంప్రదాయం పూర్వం నుంచీ ఉంది. అవే వాళ్లకు స్వర్గానికి దారి చూపుతాయట. ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకంటూ ఓ జన్యు చరిత్రను ప్రసాదించిన మూడుతరాల పెద్దల్ని మనసారా తలుచుకోడానికి ఇదో మంచి సందర్భం కూడా.
రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు... ముంగిట్లో ఎన్ని దీపాలున్నా, అందులోని ఏదో ఓ దీపంతోనే మిగిలిన వాటినంతా వెలిగించి ఉంటాం. ఆ దీపాలకు దీపమే... ప్రదీపం! దీపం వెలుగుతుంది, ప్రదీపం వెలిగిస్తుంది. మనిషి  ఏనాటికైనా ‘ప్రదీపుడు’ అనిపించుకోవాలి. తాను బతకడమే కాదు, నలుగుర్నీ బతికించాలి. ఆ నలుగురూ మరో నలుగురిని బతికించేలా స్ఫూర్తినివ్వాలి. అప్పుడే, అతని జీవితానికి సార్థకత. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి చూడండి, తృప్తిగా భోంచేశాక... ఆ కళ్లు జోడు దీపాల్లా వెలుగుతాయి. కష్టంలో ఉన్నవారికి సాయం చేసి చూడండి, గండం గట్టెక్కాక... ఆ ముకుళిత హస్తాలు వెలుగుతున్న జ్యోతిని తలపిస్తాయి. ఓ పదిమందికి జీవనోపాధి కల్పించి చూడండి, వరుసగా కూర్చుని పనిచేస్తున్నప్పుడు... ఆ శ్రమజీవులు దివ్వెల సమూహంలా అనిపిస్తారు.     
బుద్ధుడి మహాభినిష్క్రమణకు ముందు ఆనందుడనే శిష్యుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ‘స్వామీ! ఇంతకాలం మీరు ఓ దీపమై దారి చూపారు. మీరు లేని భవిష్యత్తు మాకు చీకటిమయమే’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆనందుడిని ఓదారుస్తూ ‘ఇతరులు అందించే వెలుతురు మీద ఆధారపడేంత పరాధీనత ఎందుకు ఆనందా? నీలోని దీపాన్ని నువ్వే వెలిగించుకో!’ అని ధైర్యం చెప్పాడు గౌతముడు. అవును, అప్పుడే మనిషి ‘స్వయంప్రకాశ దీపం’ అవుతాడు. 
ఆదిశంకరుడు ముప్పై రెండేళ్లు జీవించాడు. వివేకానందుడు నలభైలోపే నిర్వాణం పొందాడు. అయితేనేం, ఒకరు దేశాన్ని చుట్టుముట్టిన అజ్ఞానపు చీకట్లను తొలగిస్తే... మరొకరు సనాతన జ్ఞానకాంతిని ప్రపంచానికంతా పంచారు. ముహూర్తం జ్వలితం శ్రేయో న తు ధూమాయితం చిరం... ధూపంలా పొగలుకక్కుతూ కలకాలం బతికేకంటే, దీపంలా కాసేపు వెలుతురు పూలు పూయించి ఆరిపోయినా జన్మ ధన్యమైనట్టే.
మనం దెయ్యంతోనో, భూతంతోనో పోల్చి తిట్టుకునే కటిక చీకటికి ‘మనుచరిత్ర’లో అల్లసాని పెద్దన వెలుతురుతో సమానమైన హోదాను కట్టబెట్టాడు. చీకటి... కొత్త నెమలిపింఛం ధరించిన శ్రీకృష్ణుడిలా కనువిందు చేస్తోందట, నల్ల హంసలతో అలరారే యమునా నదికి దీటుగా కనిపిస్తోందట, మహావృక్షాలతో కళకళలాడే కాటుక కొండల శ్రేణిని తలదన్నేలా ఉందట! జీవితం అంటేనే సగం చీకటి, సగం వెలుతురు. చీకటిని ద్వేషిస్తూ కూర్చుంటే, సగం జీవితాన్ని వృథా చేసుకున్నట్టే. ‘దీపం వ్యవధి కొన్ని గంటలు. బల్బు జీవితకాలం కొన్ని రోజులు. సూర్యచంద్రుల ఆయుర్దాయం మహా అయితే కొన్ని యుగాలు. ఆ తర్వాత అంతా చీకటే! కాబట్టి, అంధకారమే శాశ్వతమని గుర్తించాలి. ఏదో ఒక రోజు వెలుగులు చీకట్లో కలిసిపోవడం ఖాయం. చీకటిని ఆమోదించడమూ నేర్చుకోండి. అది అనివార్యం కూడా’ అంటారు జగ్గీ వాసుదేవ్‌. 
వెలుతురే ఉండాలనుకోవడం దురాశ. చీకటి పోదేమో అనుకోవడం నిరాశ. జీవితం చీకటివెలుగుల సమాహారం. ఎవరికి తెలుసు? కొన్నిసార్లు తైలం నిండుకోవచ్చు. వత్తి కొండెక్కి పోవచ్చు. ప్రమిద చేజారిపోవచ్చు. కారణం ఏదైతేనేం, చీకటి అనివార్యం అయినప్పుడు... ఆ మార్పును సవినయంగా స్వీకరించాలి. సుఖదుఃఖాలు కూడా చీకటి వెలుగుల్లాంటివే.
సుఖస్యానంతరం దుఃఖం...
దుఃఖస్యానంతరం సుఖం.
న నిత్యం లభతే దుఃఖం... 
న నిత్యం లభతే సుఖం. 
ఆ సంక్షోభ సమయంలో... ఆత్మవిశ్వాస దీపాన్ని వెలిగించుకోవడమే వివేకవంతుల లక్షణం.
ఓ శిష్యుడు తన గురువు దగ్గరికెళ్లి... ‘స్వామీ! వెలుతురు అంటే ఏమిటి?’ అని అడిగాడు. 
దీంతో, కాస్తంత దూరంలో ఉన్న ఆలయాన్ని చూపిస్తూ... ‘అక్కడేం ఉన్నాయి నాయనా?’ అని అడిగాడు గురువు.
‘గోపురం, మహాద్వారం, గరుడ ధ్వజం, గర్భాలయం...’ టకటకా చెప్పాడు శిష్యుడు.
‘అంతేనా? ఆ గుడి ముందు కూర్చున్న యాచకుల్ని గుర్తించలేనంత కాలం... నువ్వు చిమ్మచీకట్లో ఉన్నట్టే. నీ చుట్టూ వెలుతురు సోకనట్ట్టే’ అని జవాబిచ్చాడు గురువు. సమ్యక్‌ కాంతి అంటే అదే. దీపావళికి మనమంతా వెలిగించాల్సిన మానవతా దీపమూ అదే.

No comments:

Post a Comment