Sunday, October 26, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-186.
276d3;2610e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣6️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                  *భగవద్గీత*
                 ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*8. వ శ్లోకము:*

*రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।*
*ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥8॥*

“కుంతీ కుమారుడవైన ఓ అర్జునా! జలంలో ఉన్న రుచి, సూర్యచంద్రులలో ఉన్న ప్రకాశము, వేదములలో, శాస్త్రములలో అంతర్లీనంగా ఉన్న ఓం కారము, ఆకాశంలో నుండి ఉధ్భవించే శబ్దము, మానవులలో ఉన్న అహంకారము, ఇవన్నీ నేనే.”
```
ఈ శ్లోకంలో పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు. మానవులకు ఒక సహజలక్షణం ఉంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడం. శైవులకు శ్రీశైలంలో, కాశీలో, వైష్ణవులకు శ్రీరంగంలో, రామభక్తులకు అయోధ్యలో, శాక్తేయులకు కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఇలాగా ఎవరి ఇష్టదైవం ఎక్కడో ఒకచోట ఉన్నారు అని అనుకోవడం అక్కడకు వెళ్లడం అక్కడ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి అని మొక్కుకోవడం, 
ఆ మొక్కులు తీర్చుకోవడం తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించడం, దీనినే భక్తి అనుకుంటున్నాము. అటువంటి వాళ్లకు శ్రీకృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయం చిన్ని చిన్ని ఉదాహరణలతో ఈ శ్లోకంలో చెప్పాడు. అత్యంత వివరంగా రాబోయే విభూతి యోగంలో వివరించాడు. ఈ శ్లోకంలో ఉదాహరణకు కొన్నిటిని గురించి చెప్పాడు.

నీటిలో రుచి, సూర్యుడు, చంద్రుడు వీటిలో ఉన్న ప్రకాశము, వేదములలో ఓంకారము, ఆకాశంలో శబ్దము, మనుష్యులలో అహంకారము, పరాక్రమము, వీరత్వము, పౌరుషము, ఇవి అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములు అన్నీ పరమాత్మే. అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతములు కనపడతాయి. ఆకాశములోనుండి శబ్దము, రసమునకు జలము, ఓంకారము వాయుస్వరూపము, ప్రకాశము అగ్ని, మానవ శరీరము భూమి అంటే పంచభూతములలో నేనే అంతర్లీనంగా ఉన్నాను. ఈ లక్షణములను విడదీయలేము. సూర్యచంద్రులు వేరు, వాటి ప్రకాశమువేరు కాదు. అలాగే జలము వాటి రుచి వేరు కాదు. వేద శాస్త్రములలో ప్రతి మంత్రము ఓం తో మొదలవుతుంది. ఓం లేనిదే మంత్రమే లేదు. వేదశాస్త్రములను చదవలేని వారు, కనీసం ఓంకారము జపిస్తే చాలు అని పెద్దలు చెబుతారు. దానికి ఉదాహరణ పై శ్లోకంలోనే వివరించాడు. మణిహారంలో దారంలాగా నేను అన్నిటిలో అంతర్లీనంగా ఉన్నాను అని ప్రకటించాడు. దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు.

మనం మానవులము కాబట్టి మన లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి. మానవునికి అహంకారము,(సాత్వికాహంకారము), పౌరుషం, పరాక్రమము వీరత్వము, వీటన్నికి మించి మానవత్వము సహజలక్షణాలు. కాని కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. మానవులు మానవులుగా బతకడం మానుకున్నారు. మానవత్వం మరిచిపోయారు. అమానవీయత సహజలక్షణంగా మారిపోయింది. మానవులు మానవత్వం మరిచి క్రూరత్వం అవలంబించడం ఎంత అసహజమో, మానవులకు దీనత్వము కూడా అంతే అసహజలక్షణము. మానవులకు దీనత్వము, దైన్యము పనికి రాదు. ఎంత కష్టము వచ్చినా, ధైర్యంగా ఎదుర్కోవాలి. నీరసపడి పోకూడదు. సుఖదుఖములు సమానంగా చూడాలి. చిరునవ్వుతో భరించాలి. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి. అంతేకానీ ఏడుపు ముఖంతో ఉండకూడదు, మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు. అతి చిన్న కారణాలకు ఆత్మహత్యాప్రయత్నాలు మానుకోవాలి. అందుకే పౌరుషం, నృషు అంటే నరులలో పౌరుషం నేను అని పరమాత్మ ప్రకటించాడు. ధైర్యంగా పౌరుషంగా ఉండటం పరమాత్మ లక్షణము. ఆ లక్షణం మనం కష్టసమయములలో విడిచిపెట్టకూడదు.
```


*9. వ శ్లోకము:*

*పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।*
*జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥9॥*


“పృథా దేవి(కుంతీ దేవి) కుమారుడవైన ఓ పార్థా! భూమిలో నుండి వెలువడే మంచి వాసనను, అగ్నియందు ప్రకాశమును, సర్వభూతములలో ఉన్న జీవము (ప్రాణశక్తి), తాపసులు చేసే తపస్సు, అన్ని నేనే అయి ఉన్నాను.”
```
పైశ్లోకంలో చెప్పిన విధంగానే ఈ శ్లోకంలో కూడా మరి కొన్నిట్లో కూడా నేను ఉన్నాను అని చెబుతూ ఈ భూమిలో ఉన్న సువాసన నేనే, అగ్నిలో వెలుగు, తపస్సు చేసే వారిలో తపశక్తి, సమస్త జీవరాసులలో జీవము నేనే, అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ చైతన్యం. పరమాత్మ దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలగు పనులకు, ఎటువంటి బాటరీ శక్తి అవసరం లేకుండా, కావలసిన శక్తి, చైతన్యం, నిలకడగా శరీర ఉష్ణోగ్రత, లభిస్తున్నాయి అంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే.

కాని మనం మాత్రం అన్నీ నేనే, 
నా వల్లె జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవడం పొరపాటు. లోపల ఉన్న ఆ చైతన్యం లేకపోతే అమెరికా ప్రెసిడెంటు అయినా అమలాపురం అప్పలస్వామి అయినా కాటికి పోవలసిన వాడే. ఆ చైతన్యం లేకపోతే, ఒక్కక్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేస్తారు. ఘనంగా సమాధులు కట్టిస్తారు. కాబట్టి మనిషికి అహంకారము పనికిరాదు. వినయం ముఖ్యం. అన్నిటిలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే తనలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం.

ఈ శ్లోకంలో అగ్ని యందు ప్రకాశం మనకు తెలుసు. మనిషిలోని జీవం మనకు తెలుసు కాని భూమి నుండి వచ్చే సువాసన మనకు తెలియదు. ఎందుకంటే నగరాలలో అంతా తారు రోడ్లు, సిమెంటు రోడ్లు, మట్టి నేల కనపడదు. కాని పల్లెలకు వెళితే, ఎండా కాలం తరువాత తొలకరి వానలు పడినపుడు ఒక విధమైన ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. అది భూమి నుండి వస్తుంది. అది భూమి సహజగుణము. ఇంతెందుకు భూమిలోనుండి పూలమొక్కలు వస్తాయి. ఆ మొక్కలకు పూచే పూలకు ఉన్న సువాసన భూమి నుండి వచ్చేదే. కాబట్టి భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. అదీ కూడా పుణ్యోగంధః అంటే చక్కటి సువాసన. మనం భూమి మీద అన్ని వ్యర్థాలు వేసి మురికిచేస్తున్నాము కానీ, భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. ఆ సువాసనలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే.

ఈ శ్లోకంలో ఆఖరున తపశ్చాస్మి, తపస్విషు అని కూడా అన్నాడు పరమాత్మ. తాపసులలో తపశ్శక్తిని నేనే. తపస్సు అంటే ఇదివరకే చెప్పుకున్నాము, ఏకాగ్రతతో, భక్తి, శ్రద్ధతో చేసే ఏ పని అయినా తపస్సే. ఆ ఏకాగ్రత, శ్రద్ధ నేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, ఏకాగ్రతతో చేస్తే, పరమాత్మ ఆ పని సఫలం చేస్తాడు. ముఖ్యంగా విద్యార్థులు సంవత్సరం అంతా ఏకాగ్రతతో, శ్రద్ధతో చదివితే, క్వశ్చన్ బాంకుల పని ఉండదు. ప్రశ్నాపత్రాలలో ఉన్న ప్రశ్నలు అన్నీ తెలిసినట్టే కనిపిస్తాయి. అలా కాకుండా, కేవలం పరీక్షల సమయంలో ముక్కున పెట్టి చదివితే, ఆ ప్రశ్నలు రాకపోతే, అబ్బా పేపర్ చాలా హార్డ్ గా ఇచ్చారండీ అని ఇతరుల మీదికి తప్పు నెట్టేస్తాము. మనలో శ్రద్ధ ఏకాగ్రత లేదని ఒప్పుకోము. మన అజ్ఞానానికి నవ్వుకోడం తప్ప పరమాత్మ కూడా ఏం చేయలేడు. ఒక్క విద్యార్థులకే కాదు. ఉద్యోగస్థులకు, వాపారస్థులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి పరమాత్మ స్వరూపాలైన ఏకాగ్రత, శ్రద్ధ, తపశ్శక్తి అందరూ అలవరచుకోవాలి.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment