Sunday, October 26, 2025

సహనం బలహీనత కాదు, గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. 'అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు'... అన్నారు. సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు. సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. సహనం ఉన్నవాడు అజాత శత్రువు. అంతే కాదు, అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. అసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.

No comments:

Post a Comment