Saturday, November 28, 2026

 కార్తీక మాసం అనగానే సాధారణంగా మనకు గుర్తుకొచ్చేవి- నదీ స్నానాలు, ఉపవాసాలు, పూజలు, జపాలు, దానాలు, దీపారాధన మరియు వనభోజనాలు. శరదృతువులో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీక మాసం" అని పేరు. కార్తీకమాసం పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు, అందువల్ల అన్ని శివాలయాలు భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తాయి. 

కార్తీక మాసం సందర్భంగా ద్రవిడ దేశంలో నెలకొన్న కొన్ని ప్రముఖ, పురాతన శివాలయాలు అలా దర్శనం చేసుకుని వద్దాం, పదండి..!!!

*పంచభూత శివలింగ క్షేత్రాలు, తమిళనాడు/ఆంధ్రప్రదేశ్:* భూమి - నీరు - అగ్ని - గాలి - ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్ అంతా నిండివున్నది. వాటిని ప్రతిబింభించే విధంగా పంచభూత శివలింగాలు కాంచీపురం, జంబుకేశ్వరం, తిరువన్నామలై, శ్రీకాళహస్తి మరియు చిదంబరంలలో నెలకొన్నాయి. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే- శ్రీకాళహస్తి, కాంచీపురం మరియు చిదంబరంలోని మహిమాన్విత శివాలయాలు ఒకే రేఖాంశంపై (79.69) ఉండేడట్లుగా మన పూర్వీకులు వేయ్యేళ్ళ క్రితం నిర్మించారు.

*శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం, తిరువణ్ణామలై (అరుణాచలం):* తమిళనాడులో ఉన్న తిరువణ్ణామలై పరమ పవిత్రమైన పంచభూతలింగక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న అరుణాచలం స్థూలరూపంలో ఉన్న శివుడిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈ అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం చేసినట్లే. తెలుగులో గిరిప్రదక్షిణం లేదా తమిళంలో గిరివాలం అని చెప్పబడే ఈ అరుణాచల ప్రదక్షిణం ఏరోజైనా చేయవచ్చు. పౌర్ణమి రోజున కానీ, విశేష పర్వదినాన చేసే ప్రదక్షిణం మరింత ఫలితాలను ఇస్తుంది. అరుణాచల క్షేత్రం ఎన్నో ఆలయాలతో, ఉపాలయాలతో, ఆశ్రమాలతో, దశలింగాలతో, తీర్థాలతో విరాజిల్లుతోంది. సూర్య చంద్రులచే ప్రతిష్టించబడిన రెండు లింగాలతో పాటు, అష్టదిక్పాలకులచే ప్రతిష్టింపబడిన 8 శివలింగాలను దర్శించడం వల్ల ఒక్కొక్క ప్రత్యేక ఫలితం, అనుగ్రహం కలుగుతాయి.

*శ్రీ వైద్యనాథ స్వామి ఆలయం, వైదీశ్వరన్ కోయిల్:* తమిళనాడు రాష్ట్రంలోని వైదీశ్వరన్ కోయిల్ చెన్నైకి 235 కిలోమీటర్లు, తంజావూరుకి 110 కిలోమీటర్లు మరియు చిదంబరానికి 10 కిలోమీటర్లు దూరములో ఉన్నది. కుజగ్రహం అంటే అంగారకుడు ఒకసారి కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఆ పరమశివుడే స్వయంగా వైద్యుడిగా అవతారమెత్తి చికిత్స చెయ్యడంతో అంగారకుడుకి కుష్టు వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. అందుకే ఈ ప్రాంతానికి “వైదీశ్వరన్ కోయిల్” అనే పేరు వచ్చింది. వైదీశ్వరన్ కోయిల్ క్షేత్రంలో ప్రధాన దైవం- వైద్యనాథ స్వామి. అమ్మవారి పేరు- తైయల్ నాయకి. అలాగే ఇక్కడ ఉన్న “సిద్ధామృతం” అనే పవిత్ర పుష్కరిణిలోని నీటికి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే మహత్తు ఉందని నమ్ముతారు.


*శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి / శ్రీ వేదగిరీశ్వర స్వామి ఆలయం, తిరుక్కలికుండ్రం (పక్షితీర్థం):* పక్షితీర్థం అని పిలవబడే ప్రముఖ శైవక్షేత్రం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాకు చెందిన తిరుక్కలికుండ్రంలో ఉంది. కొండ క్రింద ఉన్న క్షేత్రంలో ప్రధాన దైవం- స్వయంభువుగా వెలసిన శ్రీ భక్తవత్సలేశ్వరస్వామి. అమ్మ వారి పేరు- త్రిపుర సుందరి. అష్టగంధ పరిమళాలు వెదజల్లే మూలికలతో ఏర్పడిన ఈ మూలమూర్తికి సంవత్సరంలో మూడు పర్వదినాల్లో మాత్రమే అభిషేకం, మిగతా రోజుల్లో పాదాలకు అభిషేకం చేస్తారు. పక్షితీర్థం కన్యారాశి వారికి పరిహార స్థలంగా కూడా ప్రసిద్ధికెక్కింది. మార్కండేయ మహర్షి ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు, ఇక్కడున్న పుష్కరిణి నుంచి ఒక శంఖాన్ని తీసి దానితో శివుడికి పూజ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ శంఖుతీర్థం నుంచి 12 ఏళ్లకొకసారి శంఖాలు బయట పడుతూనే ఉన్నాయి.
తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, కళుగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అని అర్థం. భరద్వాజ మహర్షి తపస్సుకి మెచ్చి శివుడు నాలుగు వేదాలకు ప్రతిరూపంగా నాలుగు పర్వతాలను సృష్టిస్తాడు. అంతే కాకుండా ఉత్తరం దిక్కులో ఉన్న అధర్వణ శిఖరంపై పరమశివుడు స్వయంభువుగా వెలుస్తాడు. అందువల్లే ఇక్కడ వెలసిన శివ స్వరూపానికి “వేదగిరీశ్వరస్వామి” అని పేరు. కొండపై ఉన్న వేదగిరీశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్థంభం తప్ప నంది కనిపించదు. సాక్షాత్తూ ఈ కొండనే ఈశ్వర స్వరూపంగా భావించి పైకి అధిరోహించడం ఇష్టం లేక నంది కిందనే వృషభ తీర్థం ప్రక్కన ఉండిపోయాడు. ఎన్నో శతాబ్దాలుగా ఒక జత గరుడ పక్షులు ఈ ఆలయ ప్రాంతానికి వచ్చేవని, ఇక్కడ ఆలయపూజారులు పెట్టే చక్కెరపొంగళి నైవేద్యము తినివెళ్ళేవనీ చెబుతారు. త్రేతాయుగంలో జటాయువు - సంపాతి కూడా ఈ కొండపైకి వచ్చాయని స్థలపురాణం చెబుతోంది.

*శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం, మైలాపూర్, చెన్నై:* తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో చెన్నై నగరంలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి. మైలాపూర్ కి తిరుమయిలై అని కూడా పేరు. ఇక్కడ ఉన్న పుష్కరిణి చెన్నై మహానగరానికి ఒక ముఖ్యమైన లాండ్ మార్క్. ఈ ఆలయంలో ప్రధాన దైవం పేరు- కపాలీశ్వరుడు, అమ్మవారి పేరు కర్పగాంబాళ్. నెమలి రూపంలో పార్వతి దేవి శివుని గురించి ఘోర తపస్సు చేసిన ఈ ప్రాంతానికి ‘మైలాపురం’ అని పేరు. అందుకే “మైలైయే కైలై - కైలైయే మైలై” అని హితోక్తి, అంటే “మైలాపురమే కైలాసం - కైలాసమే మైలాపురం” అని అర్థం.

మార్చ్-ఏప్రిల్ నెలల (ఫాల్గుణ / పంగుణి మాసం) మధ్యలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవం మైలాపూర్ లో ఉండేవారికి ఒక అతి పెద్ద పండగ. 10వ రోజున జరిగే కళ్యాణోత్సవం మరియు ఉత్సవమూర్తుల ఊరేగింపు చాలా విశేషంగా జరుగుతుంది.

*శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం, తిరువొట్రియూర్, చెన్నై:* చెన్నై లోని తిరువొట్రియూర్ లో నెలకొన్న శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆలయం తిరువారూరులోని త్యాగరాజ స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం- ఆదిపురీశ్వర స్వామి మరియు తిరువొట్రీశ్వర స్వామి; అమ్మవార్లు- వడివుడై అమ్మన్ మరియు వట్టపరై అమ్మన్. ఈ ఆలయానికి 2 ధ్వజస్థంబాలు, 2 స్థలవృక్షాలు మరియు 2 పుష్కరిణిలు ఉండడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో నంది కొంచెం ఎత్తులో ఉండి, ఒక కంటితో అయ్యవారి ఆలయాన్ని మరొక కంటితో అమ్మవారి ఆలయాన్ని చూస్తున్నట్లు వాలుగా ఉంటుంది. 27 నక్షత్రాలు తమ పాపాలను నివృత్తి చేసుకోవడానికి ఇక్కడకి వచ్చి స్వామివారిని పూజించినట్లుగా స్థలపురాణం చెబుతోంది. అందుకు సంబంధించిన 27 శివలింగాలను ఈ ఆలయంలో ఉత్తరం వైపు ఒక వరుసలో చూడవచ్చు. ఇక్కడ వెలసిన ఆదిపురీశ్వర స్వామి చాలా పెద్దగా, పీటం లేకుండా బాణలింగ రూపంలో ఉంటాడు. స్వామి వారికి ఎల్లప్పుడూ ఒక తొడుగు వేసి ఉంటుంది, అర్చకులు కూడా ఎప్పుడూ నేరుగా తాకరు. వడివుడై అమ్మన్ గా పిలవబడే త్రిపుర సుందరి దేవి జ్ఞానశక్తికి ప్రతిరూపం మరియు ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.

*శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం, ప్రణవమలై, తిరుపోరూర్, చెన్నై:* ప్రణవం (ఓంకారం) ఒక కొండగా మారి తిరుపోరూర్ లో స్వయంభువుగా వెలసిన సుబ్రమణ్యేశ్వరస్వామిని పూజించింది. తిరుపోరూర్ పట్టణం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై మరియు మహాబలిపురం మధ్యలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి తిరుపోరూర్ అని పేరు వచ్చింది. కొండపైనున్న ఆలయంలో ప్రధాన దైవం- కైలాసనాథ స్వామి మరియు బాలాంబిక అమ్మ వారు. వీరిని విష్ణుమూర్తి మరియు లక్ష్మిదేవి ఎంతో భక్తితో పూజించి, కణ్వ మహర్షి ఇచ్చిన శాపం నుండి విమోచనం పొందారు. 


*శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం, పరమేశ్వర మంగళం, ECR చెన్నై:* తమిళనాడులో చెన్నై – పాండిచ్చేరి నగరాలను కలుపుతున్న ఈస్ట్ కోస్ట్ రహదారి (ECR) మార్గంలో కనిపించే పలర్ నది వంతెన నుంచి 2-3 కిలోమీటర్లు లోపలకి వెళితే, పరమేశ్వర మంగళం అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామ శివార్లలో పలర్ నదీ తీరంలోని ఒక చిన్న దీవిలో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కైలాసనాథ స్వామి వారి పురాతన ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఫలపుష్ప వృక్షాల సొగసుతో కడు రమణీయంగా ఉంటుంది.
*ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment