Monday, December 5, 2022

మనసు అంటే ఏమిటి ? ఆ మనసును నాశనం చేయడం ఎలాగో తెలుసుకుందాం ?

 ఈరోజు మనసు అంటే ఏమిటి ? ఆ మనసును నాశనం చేయడం ఎలాగో తెలుసుకుందాం ?

ఎవరండీ ఈయన మనసును నాశనం చేయమంటున్నాడు. ముందు ఈయన అడ్రస్ కనుక్కోండి అంటారేమో!

 ప్రతి ఒక్కరూ నా మనసు బాగోలేదు నా మనసు ఇలా ,నా మనసు అలా అంటూ ఉంటారు .అసలు ఈ మనసు అంటే ఏమిటి .
మనకు నిరంతరం వచ్చే ఆలోచనలు సంకల్పాలే మనసు .మనసు అనేది ఒక అవయవం కాదు ఒక వస్తువు కాదు. నిరంతరం కదులుతూ ఉన్న ఆలోచనలే మనసు .ఇది దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది .మర్రిచెట్టుపై భేతాళుడు లా ఎప్పుడు సందేహాలే .క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు .
 మనిషిని నిద్రపోనివ్వదు .

ప్రపంచ దేశాల సమస్యలు అన్ని దీనికే. పక్కింటి పంకజాక్షి నుంచి పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాల వరకు ఒకటే ఆలోచనలు .పోనీ ఈ ఆలోచనలతో ఏదైనా సాధిస్తావా అంటే ఏమీ లేదు .దీన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటే అద్భుతాలు నీ ముంగిటే ఉంటాయి.

అసలు ఈ మనసు అనేది ఉన్నదా ?ఉంటే ఈ మనసు శాశ్వతమా ?అంటే కాదు. ఏదైనా వస్తువు ఉన్నది అంటే అది అన్ని కాలాల్లో ఉండాలి (సత్) అసలు ఎప్పుడూ ఏ కాలంలో లేనిది అసత్. అంటే నేను మెలకువగా ఉన్నాను అన్నప్పుడు మనసు ఉన్నది .నిద్రపోతున్న (స్వప్నంలో) అక్కడా మనసు ఉన్నది. దీర్ఘ నిద్ర అంటే సుశిప్త ఈ అవస్థలో మనసు లేదు . అంటే మనస్సు  శాశ్వతం కాదు అలా అని అశాశ్వతం కాదు ఈ రెండు కాని వాటిని వేదాంత భాషలో మిద్య అంటారు .అన్నిటినీ భ్రమింప చేస్తుంది .

అదేనండి ఓ రచయిత గారు చెప్పారు కదా .కోర్కెల ఎడ నీవు ఊహల ఉయ్యాలవే మనసా !తెగిన పతంగానివే మనసా అంటూ మనిషిని సునామిలా గందరగోళం చేస్తుంది .ఎండమావులే గోదావరి గలగలలు అంటుంది.

 మరి నేను సత్యం తెలుసుకోవడం ఎలా ?
మీరు చిమ్మ చీకటిలో అజ్ఞాన ప్రయాణం చేస్తున్నారు .ఓ పెద్ద పామును చూసి పాము పాము అని అరచి కేకలు పెట్టి హార్ట్ బీటింగ్ పెరిగిపోయి వారు వీరు వచ్చి పంచాయతీ చేసి ఓ దీపం తెచ్చి ఇది తాడు అని తేల్చేశారు .అమ్మయ్య తాడేనా అంటూ ఎంత రిలాక్స్ గా ఉన్నారు.

 ఇక్కడ తాడు మిద్య .ఈ బ్రహ్మాత్మకమైన మనసుకు ఆధారం ఎవరూ అంటే సత్యం అయిన తాడే .తాడు లేకపోతే పాము అనే భ్రమ పడే అవకాశం లేదు .మరి మనసును అదుపులో పెట్టడం ఎలా .పూజ సత్సంగం జపం ధ్యానం వీటిద్వారా మనసును నీ అదుపులో తెచ్చుకుంటావు .

ఏమండీ ఏమి అనుకోకండి .ఇవన్నీ చేస్తూ ఉంటే ఓకే .కానీ బయటకు రాగానే ఆలోచనలు ఈగలు ముసిరినట్లు ముసురుతున్నాయండీ.

హిమాలయాల్లో ఉన్నా అయ్యో వాడు ధ్యానం ఎక్కువసేపు చేస్తున్నట్లు ఉన్నాడు వాడి దగ్గరికి విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు వాడికి ఉన్న పేరు నాకు రావడం లేదు నన్ను ఎవరూ గుర్తించడం లేదే .ఓ ఆశ్రమం కడదాం అంటే డబ్బులు లేవు . ఇదండీ సంగతి .అక్కడ శాంతి లేదు మరి దీనికి మార్గం ఒకే ఒక్క మార్గం .మనోనాశనం అంటే ఆత్మ విచారణ.

అంటే నేను ఎవర్ని. దేహాన్నా మనసునా బుద్ధినా పంచేంద్రియాలనా అహంకారమా పంచకోశాలనా ద్వేషాన్నా రాగన్నా మోహాన్నా పుణ్యాన్నా పాపాన్నా మంత్రాన్నా .కాదు ఇదేదీ నేను కాదు . ఆంటే ఈ సత్యం ఎరుక అయిన క్షణం మనోనాశనమే.

ఆ క్షణమే నువ్వు మహాయోగివి .నా సస్వరూపం ఇది అని తెలుసాక ఇంకేముంది ఆలోచనలు లేవు కోరికలు లేవు ముక్తస్థితితో మనో నాశనం జరింగింది. అంటే  అతడు మహనీయుడైన యోగి. ఈ స్థితి  పొందాలి అంటే మనసును గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment