Thursday, December 26, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


55. ఏకో దేవః సర్వభూతేషు గూఢః

సర్వప్రాణికోట్లయందున్నది ఒకే దైవము (ఉపనిషద్వాక్యం)

భారతీయ సనాతన సిద్ధాంతమిది. 'ప్రకాశస్వరూపుడు' అనే అర్థం దైవశబ్దానికి ఉంది. ఏది మూలమో అది రహస్యంగా ఉంటుంది. స్థూలదృష్టికి గోచరించదు.
వృక్షం కంటికి కనబడుతుంది. వేరు కనబడదు. భవనం దృశ్యమౌతుంది. పునాది ప్రత్యక్షం కాదు. భవన నిర్మాణ పద్ధతి తెలియని మూర్ఖుడు పునాది లేదని వాదించినా,ఉంటే చూపించమని ఘోషించినా వీలుపడదు.

అలాగే విద్యుత్తు సైతం కంటికి కనబడనిదే. కాని బల్బు, పంకాల వంటి వాటి ద్వారా దాని ఉనికిని గుర్తించగలం. భౌతిక జగత్తుకి సంబంధించిన అంశాలలోనే
ఇన్ని అప్రత్యక్షాలు ఉన్నాయి. వాటికి తగిన విజ్ఞాన శోధనతో గుర్తించగలం.

(గంగానదిలో కడవతో నీరుపట్టి తెస్తే 'కడివెడు నీళ్ళు' అంటాం. అదే
జీవభావం. ఆ నీళ్ళనే “ఇది గంగాజలం" అనవచ్చు. అంటే దేహాదులలో ప్రకాశించే దైవం. ఈ దర్శనం సమగ్రం.భారతీయ వేదాంత దర్శనాలకు మూలసూత్రం ఈ ఏకత్వమే. ఈ సూత్రంతో ఈ దేశపు దర్శనాలన్నిటినీ సమన్వయించే మహోదాత్త ఉపనిషన్మతాన్ని విశ్వానికి అందించారు మహర్షులు.)

అలాగే పంచభూతాలకీ, వాటితో కూడిన స్థావర జంగమాలకీ కూడా ఒకే చైతన్యం ఆధారం.

భిన్నత్వమంతా జగత్తులో ఉన్నా చైతన్యంలో మాత్రం ఏకత్వమే. ఒకే విద్యుత్తు -పంకాల్లో గాలిగా, బల్బులో వెలుగుగా, మరో పరికరంలో శబ్దంగా వ్యక్తమైనట్లు, ఒకే చైతన్యం వివిధ ఉపాధులలో వివిధ విధాలుగా వ్యక్తమౌతుంది.

ఈ దైవం ఒక్కటే. కానీ శక్తులు అనేకంగా ప్రకృతిలో వ్యాపించి ఉన్నాయి. వాటన్నిటి అంతర్యామి మాత్రం ఆ ఏకదైవమే. 'ఏక' అనే శబ్దమే భారతీయ ఉపాసనా
సంప్రదాయాలకు, తాత్త్విక జ్ఞాన యోగాది మార్గాలకు సమన్వయాన్ని సూచిస్తుంది. ఎవరు, ఎలా సాగినా ఆ ఏకదేవతోపాసకులే.

ఈ దేశంలో నిరక్షరాస్యుని సైతం “దేవుడెక్కడున్నాడని” అడిగితే “అంతటా ఉన్నాడ”ని వెంటనే సమాధానమిస్తాడు. అంతగా వేదాంతసత్యం ఈ భారతజాతి నరనరాల్లో జీర్ణించుకుపోయింది.

మయి సర్వమిదం ప్రోతం
సూత్రేమణిగణా ఇవ॥

“మణులలో, హారంలో దారంలా ఈ సర్వజగత్తుకీ నేనే ఆధారం" అని శ్రీకృష్ణుని వచనం.

అత్యంత శక్తి ఎప్పుడూ నిగూఢంగానే ఉంటుంది. సూక్ష్మంగానే భాసిస్తుంది.

భూమికంటే నీరు సూక్ష్మం - దానికన్నా అగ్ని సూక్ష్మం. అలా క్రమంగా వాయువు,ఆకాశం,ప్రాణం..ఒకదానికంటే ఒకటి సూక్ష్మాలు. వాటికంటే సూక్ష్మాతి సూక్ష్మం -దైవం. దానినే 'ఆత్మ' అని అన్నారు. ఇది దేశ కాల వస్తు పరిమితులలో ఇమిడినట్లుగా
చూస్తే జీవభావం. ఆ పరిమితిని దాటి దర్శిస్తే పరమాత్మభావం.

గంగానదిలో కడవతో నీరుపట్టి తెస్తే 'కడివెడు నీళ్ళు' అంటాం. అదే జీవభావం.

ఆ నీళ్ళనే “ఇది గంగాజలం” అనవచ్చు. అంటే దేహాదులలో ప్రకాశించే దైవభావం.
ఈ దర్శనం సమగ్రం.

భారతీయ వేదాంత దర్శనాలకు మూలసూత్రం ఈ ఏకత్వమే. ఈ సూత్రంతో ఈ దేశపు దర్శనాలన్నిటినీ సమన్వయించే మహోదాత్త ఉపనిషన్మతాన్ని విశ్వానికి
అందించారు మహర్షులు.     

No comments:

Post a Comment