Sunday, December 29, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

58. శివా నః సన్తు వార్షికీః

ప్రతి ఏడాది కురిసే వర్షములు మనకు శుభములుగా నగుగాక (అథర్వవేదం)

ఋతుచక్రం ఏడాది కొకమారు మారుతూంటుంది. ఒకొక్క ఋతువుకీ ఒక్కో ప్రత్యేకత. ఈ మార్పులన్నీ ప్రకృతి ద్వారా పరమేశ్వరుడు ప్రసరించే కరుణకు
ప్రతిరూపాలే. ఆ మార్పులు మనకు క్షేమం కలిగించాలని పై శ్రుతివాక్యంలోని భావన.

'వార్షికం' అంటే ఏడాదికి (సంవత్సరాది) సంబంధించినది, 'వర్షం' అంటేనే సంవత్సరమని అర్థం.

ఋతుపవనాల కారణంగానూ, తదితర హేతువుల ద్వారాను భూమికి వృష్టి లభిస్తుంది. ఇది సకాలంలో, సమృద్ధిగా లభించాలని అందరూ కోరుకుంటారు.

అనావృష్టి, అతివృష్టీ - - రెండూ బాధా హేతువులే. ఈ అవస్థలు లేకుండా సస్యకారిణిగా,నదీ తటాకాదులు జలసమృద్ధిగా ఉండే విధంగా వృష్టి అనుగ్రహించాలనే శుభాకాంక్ష
వైదికధర్మంలో గోచరిస్తుంది.

ఏడాదిలో కొంతకాలం ప్రకృతిధర్మంగా కురిసే వానల్ని ఎలా పదిలపరచుకోవాలో,ఎలా వినియోగించుకోవాలో ప్రాచీన శాస్త్రగ్రంథాలు వివరించాయి. తటాక నిర్మాణాలు, సరస్సుల వ్యవస్థ, కాలువలు ఇవన్నీ జల వినియోగంలోని మెలకువల్ని
తెలియజేస్తాయి.
-
కురిసిన వర్షం భూగర్భంలో పదిలపడే విధంగా నగరాదులలో అభివృద్ధి
కార్యక్రమాలుండాలి. తత్కాల ప్రయోజనాలను నెరవెర్చుకొనే తొందరలో, దీర్ఘకాలిక
ప్రయోజనాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృక్షసమృద్ధి, వాపీకూపతటాక నిర్మాణం- ఇవన్నీ పుణ్యకార్యాలుగా ప్రాచీన పాలకులు చేపట్టేవారు. వీటి
ద్వారా ఏడాదికి నియమితంగా కురిసే వానలు ఏడాది పొడుగునా
అందుబాటులో ఉండేలా చేయడమే కాక, సక్రమ వినియోగం ఉండేది.

వర్ష సమృద్ధిని కోరుకొనడమే కాక, అది లభించే ప్రయత్నాలు కూడా చిత్తశుద్ధితో చేయాలి. అందుకు వృక్షారోపణల్ని (చెట్లను నాటుట) ప్రోత్సహించారు. వృక్షాలను నరకడం ప్రాణివధతో సమాన పాపంగానే భావించారు. తప్పనిసరై ఒక వృక్షాన్ని
నరికితే ప్రత్యామ్నాయంగా ఇంకొన్నిటిని నాటి, మరికొన్ని ప్రాయశ్చిత్త క్రియలు చెప్పారు. అలాగే యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్దేశించారు.

ఇవి ఏవో నమ్మకాల క్రింద మనం కొట్టిపారేస్తాం. ప్రకృతిని జడపదార్థంగా భావించే ఆధునిక అజ్ఞానం వల్ల వచ్చిన వైపరీత్యమిది. ప్రకృతిలోని సూక్ష్మశక్తుల్ని గమనించిన
మన ప్రాచీన తపస్వులు వాటిలోని దేవతాస్వరూపాల్ని దర్శించారు. ప్రకృతి చైతన్యవంతమైనదని, భావస్పందనల్ని గ్రహించి స్పందించే లక్షణమున్నదని ప్రాచీన
ఋషిభావన.

శబ్ద ప్రకంపనలతో ప్రకృతిని స్పందింపజేయడం వేదమంత్రాల పనియైతే, ఆ మంత్రశక్తితో అనుసంధానించే యజ్ఞాది ప్రక్రియలలోని వినియోగ ద్రవ్యాలు, అవి వాయుమండలంలో కలిశాక జరిగే పరిణామాలు, వర్షాదుల్ని పృథ్వికి సమృద్ధిగా అందజేస్తాయని వైదిక విజ్ఞానం. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, ప్రాచీన భారత విజ్ఞానాన్ని ఔన్నత్యాన్ని అంగీకరించక తప్పనిస్థితికి వస్తున్న ఆధునికత కూడా వాటిని కాదనలేకపోతోంది.

‘వార్షికీః' - అనే మాట వర్షాలను ప్రత్యేకంగా పేర్కొన్నా, ఏడాదిలో వచ్చే ఋతువుల మార్పులన్నీ మనకు మంగళకరములుగా పరిణమించాలనే అర్థాన్ని కూడా గ్రహించాలి.

వర్షకారక మార్గాలలో 'ధర్మాన్ని' ప్రధానంగా పేర్కొన్నాయి సనాతన గ్రంథాలు. ధర్మపాలన వల్లనే చక్కని వృష్టి లభిస్తుందని ప్రధాన సిద్ధాంతం. భగవచ్చైతన్యభరితమైన
ప్రకృతిలో ప్రత్యణువూ ధర్మం వలన సంతోషించి శాంతమై, శుభకరంగా పరిణమిస్తుంది.అధర్మం వల్ల సంక్షోభాలు కలుగుతాయి.

వర్షకారకమైన ధర్మపాలన ఆ కురిసే వర్షం కూడా శుభంగా పరిణమించేలా
చేయగలదు.

“కాలే వర్షతు పర్జన్యః” అని మనసారా వేదమార్గాన్ని అనుసరించి పరమేశ్వరుని ప్రార్థిద్దాం.             

No comments:

Post a Comment