Sunday, December 29, 2024

 అమ్మను
నిజంగా ప్రేమించే వారు
ఏం జేస్తారు 

నిత్యం ఆమెతో మాట్లాడతారు
ఆమె చెప్పేది శ్రద్దాసక్తులతో వింటారు
అనునిత్యం ఆమెకు అందుబాటులో ఉంటూ
ఆమె బాగోగులు జాగురుకతతో పట్టించుకుంటారు 
అంతేనా 

లేక ...
ఏడాదికోమారు 
ఆమె జన్మదినం నాడు
ఆమె మెడలో పూలమాలలు వేసి
మంగళ హారతులు పట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి
ఆ ఒక్కరోజూ ఆర్భాటం చేసి ప్రేమను చాటుకుంటారా

వీటిలో ఏది నిజమైన ప్రేమా గౌరవం భక్తీ 

********

భాషను
నిజంగా ప్రేమించేవాడు 
సత్యంగా అభిమానించే వాడూ
ఏం జేస్తారు

తన బిడ్డను
ఒడిలో కూర్చుండ బెట్టుకుని
అ ఆ ... ఇ ఈ .... ఉ ఊ ... లు దిద్దిస్తాడు 
గుణింతాలూ ఒత్తులూ పదాలు పంక్తులూ నేర్పిస్తాడు
నుడులూ నానుడులూ జాతీయాలూ సామెతలూ పొడుపు కథలూ మనస్సుకు పట్టిస్తాడు 
కవులను రచయితలను కళాకారులను ఆత్మబంధువులను చేస్తాడు
తన భాష అందచందాలనూ వన్నెచిన్నెలనూ ప్రత్యేకతలనూ విసదీకరిస్తాడు 
అంతేనా....

లేక... అదిగదిగో 
ఆమే మన తెలుగు తల్లి
అని ఓ విగ్రహాన్ని చూపి చేతులు జోడించమనీ 

మా తెలుగు తల్లికీ....
అంటూ మెడలో మల్లె పూదండ వేయమనీ 

మా కన్న తల్లికి....
అంటూ కర్పూర హారతి పట్టమనీ 

కడుపులో బంగారు
కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు అని
పరవశించిపోతూ పొర్లు దండాలు పెట్టమనీ

ఇదే ఇదే మాతృ భాషను సంరక్షించుకునే ఎఫెక్టివ్ పద్ధతి... అని మీ బిడ్డలకు నూరిపోస్తారా 

************

వివేకంతో నూ
విచక్షణతో నూ
తరచి తరచి చూసినపుడు
ఒక విషయం సుస్పష్టంగా బోధపడుతుంది

ఎవరైనా 
జన సామాన్యానికి
భాషను దూరం చేయాలనుకున్నపుడూ
భాషను మృత భాషగా మార్చేయాలనుకున్నపుడూ

ముందుగా 
భాషకు పవిత్రతను అంటగడతారు
అటు తరువాత మాతృమూర్తి అంటూ విగ్రహాన్ని చేస్తారు
ఆమె చుట్టూ పూజాదికాది క్రతువులను చక్కగా అల్లేస్తారు

తద్వారా
భాషకు అలౌకికతను చేకూరుస్తారు 
'భాష్యతి ఇతి భాష (భాషింపబడేది భాష) అనే వాస్తవాన్ని మెరుగుపరిచే సత్తారు
'పూజ్యతి ఇతి భాష (పూజింపదగినది భాష) అని
జనాన్ని భ్రమింపజేస్తారు

*********

భాషాభిమాని అయిన వాడు

గిడుగు పిడుగులా 
జనసామాన్యపు భాషను అందలమెక్కిస్తారు

అడుగుజాడ గురజాడలా 
జనసామాన్యపు భాషతో మానవీయతను చాటుతాడు 

సంస్కరణ కేతనం కందుకూరిలా 
జనసామాన్యపు భాషతో మూఢచారాల వెన్ను విరుస్తాడు 

అంతే తప్ప తిరోగమనాన్నీ మూఢత్వాన్నీ మూర్ఖత్వాన్నీ మహోన్నత ఆదర్శంగా నమ్మబలకడు

కాబట్టి ....
భాష పట్ల నిజమైన ప్రేమ
ఉన్న వారంతా
అటువంటి భ్రమల్లో కొట్టుకుపోవద్దని మనవి

*******

PS... భాష స్థానంలో సంస్కృతి, విలువలు, దేశం, సమాజం ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. లాజిక్ మాత్రం ఇదే.l

- రత్నాజేయ్ (పెద్దాపురం)

('ఎవరు సంరక్షకులు? భాషకు' అన్న నా పోస్ట్ కు మనోభావాలు గాయ పరచుకున్న ఓ సున్నిత మనస్కుడైన మాతృ భాషా ప్రేమికుడైన మిత్రునికి .... ప్రేమతో)

No comments:

Post a Comment