Friday, December 27, 2024

 *మంచితనము.....*

*రామాయణంలో రావణుని చర్యలను పరిశీలిస్తే ఈవిషయం స్పష్టమవుతుంది. రాముని భార్య పతివ్రతా శిరోమణి యైన సీతమ్మని రావణుడు అపహరించి లంకలో బందీగా ఉంచాడు. రాముని దూతగా హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను రామునికి అప్పచెప్పటం అతని మంచికే అని రావణుడికి హితవును బోధించాడు.*

*ఈ సలహా రావణుడికి నచ్చలేదు. తనకు ఉచితమైన సలహాను ఇచ్చిన హనుమంతునికి హానిచేయ తలపెట్టి ఆయన తోకకు నిప్పంట్టించమన్నాడు. అయితే ఆ అగ్ని హనుమంతునికి హాని కలిగించకుండా లంకనే కాల్చింది.*

*దిధక్షన్మారుతేర్వాలం తమాదీప్యధశాసనః |*
*ఆత్మీయస్య పురస్త్వైవ సద్యో దహనమన్వభూత్ ||*

*అందువలన ఇతరులకు ఎవరూ హానికలిగించరాదు. శ్రీ శంకరభగవత్పాదులు తనకు హానికలిగించిన వారిపట్ల కూడా సౌజన్యాన్నే ప్రదర్శించారు. అది మహాత్ముల లక్షణం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇదే విషయాన్ని చెప్పారు.*

*యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |*
*హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః ||*

*ఇతరులకు ఆటంకం కలిగించని వారంటే భగవంతునికి చాలా ప్రీతి. అటువంటి వ్యక్తి ఎవరంటే ఇతరులకు హాని జరగాలని కోరుకోనివాడు. వాడే భగవంతునికి నిజమైన భక్తుడు.*

*మహాభారత కధలో కూడా దుర్యోధనుడు వనవాసంలో ఉన్న యుధిష్ఠిరునికి హాని కలిగించబోయి తానే అవమాన పాలవ్వడం సర్వవిదితమే.*

*అందువలన ప్రతియొక్కరూ ఈ విషయాన్ని తెలుసుకుని, ఇతరులకు హాని తలపెట్టకుండా సహాయపడే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.*

          *అధ్యాత్మికం ఆనందం*
🪷🦚🪷 🙏🕉️🙏 🪷🦚🪷

No comments:

Post a Comment