Monday, December 30, 2024

 రమణ బోధ

🍁🍁🍁🍁

‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్యమైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు. ఆ అనంత మౌనంలో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించు’ అని భగవాన్‌ రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి దిశానిర్దేశం చేశారు.

‘నిన్ను నువ్వు తెలుసుకో’- ఆధ్యాత్మిక చింతనకు ఇదే ప్రథమ సోపానం. అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.’ అంటూ రమణులు ప్రబోధించారు. 

అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మహాయోగి భగవాన్‌ రమణ మహర్షి. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలలోని మార్మికతను, అంతర్లీన భావగరిమను రమణలు ఏకోన్ముఖంగా అందించారు.

‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనేది ఉపనిషద్వాక్యం. ప్రజ్ఞ ద్వారా అన్నింటినీ తెలుసుకునే నేర్పు అలవడుతుంది.

 ‘నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. 

‘ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. 

ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.

అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహంతో రమణులు అతులితమైన యోగశక్తిని అందుకున్నారు.

 అరుణాచలాన్ని తన ఆశ్రమంగా మార్చుకుని, అరుణగిరిపై జ్ఞాన భాస్కరుడై వెలుగొందారు. నమశ్శివాయ అనేది మహా యోగ పంచాక్షరీ మంత్రమైతే, ‘అరుణాచల’ అనేది దివ్యజీవన జ్ఞాన పంచాక్షరీ మంత్రంగా రమణులు అభివర్ణించారు. భగవంతుని సాన్నిధ్యానికి, ఆత్మ సామీప్యానికి ఏది తీసుకుని వెళ్తుందో అదే ఉపదేశం. దక్షిణామూర్తిగా రుషులకు బోధించిన జ్ఞానోపదేశాన్ని, తత్త్వమార్గాల్ని, యోగసూత్రాల్ని ‘ఉపదేశసారం’గా రమణులు ఆవిష్కరించారు.

‘ఆనందమే నా స్వరూపం’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ‘నేను దీనుణ్ని, నాకు ఆనందం లేదు. నా జీవితం నిస్సారం. నాకు ఉన్నతి లేదు’ అని భావించేవారికి ఆధ్యాత్మిక అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రతికూల భావాలనే చీకట్ల నుంచి సానుకూల భావాలే ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరోహించడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుంది.

 ‘ఒక్క ఆధ్యాత్మిక దీపశిఖ నీలో వెలుగుతుంటే చాలు- నువ్వు అఖండ తేజోపుంజమై వెలుగు పువ్వుల్ని వెదజల్లుతావు’ అని రమణులు పేర్కొన్నారు.

 ‘భగవంతుడనే సంపూర్ణ, సమున్నత స్థితికి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నంత వరకే! నేను, నాది, నాకు అనే వ్యక్తిగతమైన అహాల్ని నిర్మూలించుకుంటే పరమ పూజ్యుడైన పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశించారు. పరబ్రహ్మ  తత్త్వానికి మౌనమే భాష్యం. మౌనం మహా శక్తిమంతమైన ఆయుధం.

 శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయడమే నేనందించే ప్రబోధ సారాంశం- అని ప్రవచించిన రమణుల సందేశ వైభవం... స్ఫూర్తిమంతం... స్ఫూర్తి మంత్రం!




🍁🍁🍁🍁

No comments:

Post a Comment