Vedantha panchadasi: ప్రత్యూషే వా మగ్నో మందే తమస్యయమ్ ౹
లోకోభాతి యథా తద్వదస్పష్టం జగదీక్ష్యతే ౹౹201౹౹
201. ఉదయసంధ్య సాయంసంధ్యల యందూ, మందాంధ కారము నందూ ఈ లోకము అస్పష్టముగ కన్పించినట్లే హిరణ్యగర్భావస్థయందు సృష్టి అస్పష్టముగ గోచరించును.
సర్వతో లాంఛితో మష్యా యథా స్యాద్ఘట్టితః పటః ౹
సూక్ష్మాకారైస్త థేశస్య వపుః సర్వత్ర లాంఛితమ్ ౹౹202౹౹
202. గంజితో బిగువెక్కిన వస్త్రముపై చిత్రపు రేఖలు రంగుతో దిద్దినట్లే హిరణ్యగర్భుని యందు సూక్ష్మశరీరములు రేఖామాత్రముగ కనిపించును.
నస్యం వా శాకజాతం వా సర్వతోంకురితం యథా ౹
కోమలం తద్వదేవైష పేలవో జగదఙ్కురః ౹౹203౹౹
203. ధాన్యపు లేక చిన్న మొక్కల యొక్క అంకురము ఎట్లు సుకుమారముగ ఉండునో అట్లే ఈ జగదంకురము పేలవముగ ఉండును.
వ్యాఖ్య:- అపంచీకృత మహాభూతములచే ఏర్పడిన సూక్ష్మశరీరములు మాయయగు ఈశ్వరుని శరీరము నందు రేఖల వలె అంకురములవలె ప్రారంభదశయందు ఉండును.
వస్త్రంలో దారం(సూత్ర) అనుస్యూతంగా ఉన్నట్లే,జగత్తులో హిరణ్యగర్భ స్వరూపం "అనుస్యూతాత్మ"గా ఉంది.ఆ సూత్రాత్మే సూక్ష్మ శరీరంగా స్థూల,సూక్ష్మ శరీరధారులందరిలోనూ అహంభావాన్ని-నేను అనే భావాన్ని-పొంది ఉన్నందున అన్ని జీవులకు అది సమిష్టి రూపం.
సాయంకాల సమయంలోను,ప్రాతఃకాలంలోను ఈ విశ్వమంతా మసక చీకటిలో వ్యక్తావ్యక్తంగా-కనిపించీ కనిపించనట్లుగా ఉన్నట్లే హిరణ్య గర్భావస్థలో కూడా ఈ సృష్టి స్పష్టంగా కనిపించదు.
మాయయైన ఈశ్వరుని కున్నట్టి లాంఛితత్వం లాంఛితవస్త్ర దృష్టాంతమే.
మాయ అనేది అనిర్వచనీయ స్వరూపం కలది.
అచిన్త్య రచనాశక్తికి బీజం(కారణం)మాయయే!
ఈ విధమైన కారణం సుషుప్తికాలంలో మాత్రమే ఆ మాయా బీజం యొక్క అనుభవం కలుగుతుంది.
గంజిపెట్టిన వస్త్రంమీద రంగులతో వేరువేరు రేఖలతో ఆకృతులు రచింపబడినట్లుగానే మాయావియైన ఈశ్వరుని దేహం అంతటా అపంచీకృత భూతాలతో నిర్మితమైన లింగశరీరాలతో లాంఛితమై ఉంటుంది.
హిరణ్యగర్భ స్వరూపం మన బుద్ధియందు చొరటానికిగాను వేరొక దృష్టాంతం,
ధాన్యపు మొక్కలుగాని, కూరగాయలు మొక్కలుగాని అన్నివైపులనుండి కోమలమైన చిగురుటాకుల రూపంలో ఉత్పన్నమైనట్లుగానే ఈ హిరణ్యగర్భుని యొక్క అంకురాలు మృదువుగా,కోమలంగా ఉంటాయి.
మాయాధిపతియైన ఈశ్వరుడు జగత్కారణమంటున్నా కానీ సురేశ్వరాచార్యులు పరమాత్మనే జగత్కారణంగా పేర్కొన్నారు.
శ్రుతియందు ఉపక్రమం మొదలుకొని సత్యజ్ఞానాది లక్షణాలుగల బ్రహ్మము ఈ జగత్తకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది.అలాగే మాయకు వశమైన చిదాభాసం సత్యంలాగా గోచరిస్తోంది.అన్యోన్యాధ్యాసం కారణంగా సంభవమవటంవల్ల కాదనటానికి వీలులేదు.
ఈశ్వరుడైన పరమాత్మ సమస్త పదార్థాలయందు ఉంటూ శాశిస్తూ,నియమిస్తూ వుంటాడని బృహదారణ్యక శ్రుతిలోని
"యః పృథివ్యాం తిష్ఠన్ పథివీమన్తరో యమయతి" పృథివి లోపల ఉంటూ శాశిస్తూ ఉంటాడని అంతర్యామిగా నియమిస్తూ ఉంటాడని గ్రహించాలి.
శ్రుతివాక్యాల్లో ప్రయోగింపబడిన"యమయతి"
అనే శబ్దానికి ఇదే అర్థం.
సర్వస్వమూ"సర్వేశ్వరాధీనమే"
ఆతపాభాతలోకో వా పటో వా వర్ణపూరితః ౹
సస్యం వా ఫలితం యద్వత్తథా స్పష్టవపుర్విరాట్ ౹౹204౹౹
204.పట్టపగలున ఈ లోకము కన్పించినట్లు,పూర్తిగా రంగులు దిద్దిన వర్ణచిత్రము వలె,పంటకు వచ్చిన ధాన్యము వలె విరాట్టు దశయందు జగత్తు పరిపూర్ణమై కన్పించును.స్థూల శరీరములన్నీ స్పష్టముగ ఈ దశయందు ఏర్పడును.
విశ్వరూపాధ్యాయ ఏష ఉక్తః సూక్తేఽ పి పౌరుషే ౹
ధాత్రాదిస్తంబ పర్యంతానేతస్యావయవాన్విదుః
౹౹205౹౹
205. ఈ విషయము,
అనగా విరాట్టు,
భగవద్గీతయందలి విశ్వరూప దర్శనాధ్యాయములో,పురుష సూక్తములో వర్ణింపబడినది....
బ్రహ్మ మొదలు గడ్డిపోచవరకు ప్రపంచమునందలి అన్ని వస్తువులు విరాడాంశములే.
ఈశ సూత్ర విరాడ్ వేధో విష్ణు రుద్రేంద్ర వహ్నాయః ౹
విఘ్నభైరవమైరాల మారికా యక్షరాక్షసాః ౹౹206౹౹
206.విరాడ్రూపములైన ఈశ్వరుడు హిరణ్యగర్భుడు విరాట్టు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు అగ్ని గణేశుడు భైరవుడు మైరాలుడు మారికుడు యక్షులు రాక్షసులు.
విప్రక్షత్రియవిట్ శూద్రా గవాశ్వమృగ పక్షిణః ౹
అశ్వత్థపటచూతాద్యా యవవ్రీహితృణాదయః ౹౹207౹౹
207. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆవులు గుఱ్ఱములు జంతువులు పక్షులు రావి మర్రి మామిడి మొదలైన చెట్లు యవలు వడ్లు గడ్డి మొదలగునవి.
జలపాషాణ మృత్కష్ఠవాప్యాకుద్దాలకాదయః ౹
ఈశ్వరాః సర్వ ఏవైతే పూజితా ఫలదాయినః ౹౹208౹౹
208. జలము రాళ్ళు మట్టి కర్ర ఉలి గడ్డపార మొదలైనవన్నీ ఈశ్వర రూపములే.ఈశ్వరుడని భావించి పూజించినచో అన్నీ ఫలము నిచ్చునవే.
యథా యథాపాసతే తం ఫలమీయుస్తథా తథా ౹
ఫలోత్కర్షాపకవ్షా తు పూజ్యపూజానుసారతః ౹౹209౹౹
209. ఎట్లేట్లు పూజింతురో,ఏయే రూపమున పూజింతురో అట్లే ఫలమును పొందుదురు. ఫలమునందలి హెచ్చుతగ్గులు పూజ్యవిషయపు శ్రేష్ఠతపైనను పూజా విధానముపైనను ఆధారపడును.
చూ.భగవద్గీత 4.11.
ముక్తిస్తు బ్రహ్మతత్త్వస్య జ్ఞానాదేవ న చాన్యథా ౹
స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా ౹౹210౹౹
210. కాని బ్రహ్మతత్త్వము తెలిసికొనిన మాత్రమే ముక్తి లభించును.వేరు దారి లేదు.తన స్వప్నములు తాను మేలుకొననిదే అంతము కావు కదా.
వ్యాఖ్య:- సూర్యోదయమైన పిమ్మట,బంగారు కిరణాల కాంతితో ప్రపంచమంతా ఆభాసితమైనట్లుగా
చిత్ర చిత్ర వర్ణాలతో రంజితమైన వస్త్రంలాగా రంగులు దిద్దిన వర్ణచిత్రము వలె గుత్తులతో ఫలించిన వృక్షాలు లేదా సస్యంలా పంటకు వచ్చిన ధాన్యము వలె ఈ విరాట్ దశయందు విరాట్ పురుషుని విశాల దేహం కూడా స్పష్టంగా పరిపూర్ణంగా కన్పించును. స్థూలశరీరములన్నీ ఈ దశయందు
స్పష్టముగా ఏర్పడును.
మనం దారపుపోగుల్ని అటూ ఇటూ కదలించినా,చుట్టచుట్టినా వస్త్రంకూడా అట్లాగే కదులుతుంది. చుట్ట అవుతుంది.అంటే,వస్త్రానికి ఏ మాత్రమూ స్వాతంత్ర్యము అనేది లేదన్నమాట.
అంటే,నూలుపోగులను అపేక్షించకుండా ఉండే స్వాతంత్ర్యము వస్త్రానికి లేదు.
అట్లాగే ఈ అంతర్యామియైన పరమేశ్వరుడు ఎక్కడ ఎప్పుడు ఏవిధమైన వాసనలతో ఏవిధమైన ఘటపటాది వికారాన్ని పొందుతాడో ఆ విధమైన
కార్యమే-రూపమే మనకు కనిపిస్తుంది.
ఈ అంతర్యామి తత్త్వం యజుర్వేదాంతర్గతమైన పురుష సూక్తంలోనూ భగవద్గీయందలి విశ్వరూపాధ్యాయంలోనూ విరాట్పురుషుని యొక్క రూపం వర్ణింపబడినది.
వీటినిబట్టి బ్రహ్మ మొదలు స్తంబపర్యంతమ(స్తంబము= సూక్ష్మతమైన ఒక కీటకం)అన్నీ కూడా విరాట్పురుషుని అవయవములే ! అని గమనించాలి.
ఈశ్వరుడు,సూత్రాత్మ,
విరాట్పురుషుడు,చతుర్ముఖబ్రహ్మ,విష్ణువు,శివుడు,ఇంద్రుడు,అగ్ని,
గణపతి,భైరవుడు,మైరాలుడు
(యముడు),మారిక(మహామారి అనే క్షుద్ర దేవత), యక్షులు, రాక్షసులు,బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు,ఆవులు,గుఱ్ఱాలు,
మృగాలు,పక్షులు,రావి,మఱ్ఱి,
మామిడి మొదలైన వృక్షాలు,
యవ వ్రీహి తృణ ధాన్యాలు, నీరు,రాళ్ళు,మట్టి,కట్టెలు,
బాడిస(కఱ్ఱలు చెక్కే సాధనము), కుద్దాల(గడ్డపార)మొదలైనవన్నీ ఈశ్వరాంగాలే!
౼"తే యథాయథోపాసతే తదేవ భవతి"...అనే శ్రుతిని అనుసరించి అన్నింటా ఏభావంతో ఈశ్వరుని పూజిస్తే ఆవిధమైన ఫలితమే కలుగుతుంది.
పరమాత్మను ఏ ఏ విధముగా ఉపాసిస్తే ఆయా విధమైన ఫలితాన్నే పొందుతారు.
అయితే ఫలం విషయంలో ఉత్కర్షాకర్షలు - ఎక్కువ తక్కువలు ఎట్లా వస్తునన్నాయి?
ఫలంలో ఆ విధమైన హెచ్చుతగ్గులు పూజా విధానమునుబట్టి, ఉపాసననుబట్టి, శ్రేష్ఠతపైన ఆధారపడి ఫలప్రాప్తి ఉంటుందని భావం.
అయితే మోక్షమనేది మాత్రం జ్ఞానంలేనిదే లభించదు.
మోక్షమనేది బ్రహ్మతత్త్వజ్ఞానం లేనిదే లభించదు,
ఇతరేతర ఏ సాధనాలవలన లభించదు.
మేల్కొంటే తప్ప కల్పితమైన తనస్వప్నం అనేది ఎట్లా తొలగిపోదో,
అట్లాగే ప్రత్యగభిన్నమైన బ్రహ్మతత్త్వజ్ఞానం లేనిదే జీవగతమైనట్టి,అజ్ఞాన కల్పితమైనట్టి సంసార నివృత్తి కలగదు.
No comments:
Post a Comment