*తీర్థయాత్రలు.....*
తీర్థయాత్రలకు బయలుదేరుముందు పఠించవలసిన శ్లోకాలు.....
1) యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!
2) ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!
3) తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!!
4) యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!
5) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!
ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. (యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతినిత్యము ఉదయం ఇంట్లోనుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటినుండి బయలుదేరినా అంతటా జయం కలుగుతుంది).
మరికొని ధర్మాలు.....
ధర్మమార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్థయాత్రలు చేయవలెనని శాస్త్రం నిర్ధేశించింది.
ఇంటినుండి బయలుదేరునప్పుడు ఇలవేల్పును, కులదేవతలను గ్రామదేవతల అనుమతి తీసుకొని, తల్లిదండ్రుల పెద్దల అనుమతి తీసుకొని బయలుదేరాలి(శ్రీరామచంద్ర స్వామి వారు అరణ్యవాసానికి బయలుదేరునప్పుడు కూడా అయోధ్యానగరి దేవత అనుమతి తీసుకొనే బయలుదేరి సనాతన ధర్మాచరణ విషయంలో ఆచరించవలసిన ఆదర్శాన్ని మనకు చూపించారు.
తీర్థయాత్రలయందు అసత్య భాషణము, దంబ భాషణము చేయరాదు. బ్రహ్మచర్యవ్రతులై క్షేత్రాలను సేవించాలి.
యాత్రలకు బయలుదేరి వెళ్ళి మరల ఇంటికి తిరిగివచ్చునంతవరకును కూడా తలనీలాలు సమర్పించే విషయంలో తప్ప, అన్యప్రదేశాలలో క్షౌరాది కర్మలు చేసుకొనరాదు.
తీర్థాలయందు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి, అవకాశం లేని సమయంలో భగవన్నామాన్ని తలుస్తూ చేయవలెను.
పుష్కరిణులయందును, నదులయందును, సరోవరాలయందును, సముద్రాలయందును, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానమాచరించడం మహాపరాధం. అంతేకాక వాటియందు మల,మూత్ర,వీర్య విసర్జనం చేయడం చాలా పెద్ద దోషం.
అంతేకాకుండా చీరలు-జాకెట్లు, పంచెలు-ఉత్తరీయాలు వంటివాటిని నదీదేవతలకు సమర్పించదలుచుకొంటే మానసికంగా నదీమతల్లికి అర్పిస్తూ దగ్గరలోని ముత్తయిదువులకో, బ్రాహ్మణోత్తములకో, లేక అభాగ్యులకో ఇవ్వడం వలన పుణ్యము మరియు పురుషార్థము సిద్ధిస్తాయి.
స్త్రీలు జడముడి విడతీసుకొని క్రిందభాగమున ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. జుట్టు విరబూసుకొని నిత్యజీవితంలోనే ఉండరాదు. అటువంటిది పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అసలు ఉండకూడదు. దంపతులు వెళ్ళినప్పుడు ఇరువురు కూడా ఉత్తరీయ్యానికి చీరకు కలిపి ముడివేసుకొని సంకల్ప స్నానం చేయాలి. స్త్రీలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి.
వీలయినంతవరకు అల్ప భాషణము చేస్తూ, మనస్సునందు ఎల్లప్పుడు భగవన్నామము జపిస్తూ ఉండాలి.
తీర్థస్థాలాలలోను, క్షేత్రాలలోను మనం ఆచరించిన జప, తప, స్నాన, హోమ, అనుష్ఠాన, ధర్మాచరణ, దానాదుల పుణ్యము ఒకటికి వందలరెట్లు, వేలరెట్లు కలుగుతుంది. అదేవిధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే పలితము కలుగుతుంది. కావున జాగరూకులమై వర్తించాలి.
పుణ్య తీర్థాలయందు గతించిన తల్లిదండ్రులకు పెద్దలకు పిండప్రధాన, తర్పణాదులు తప్పకుండా చేయవలెను. వారి ఆశీస్సులే మనకు మన కుటుంబాలకీ శ్రీరామరక్ష.
No comments:
Post a Comment