Vedantha panchadasi:
మేఘాకాశమహాకాశౌ వివిచ్యేతే న పామరైః ౹
తద్వద్ర్బహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాత దర్శినః ౹౹195౹౹
194.మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము అసలు ఆకాశము ఒకటే అని పామరజనులు భావింతురు. అట్లే పైపైన మాత్రము చూచేవారు బ్రహ్మము ఈశ్వరుడు ఒకటే అని చూతురు.
వ్యాఖ్య:- ఈ అజ్ఞానమును సావధానముగా నిశితముగా పరిశీలించినప్పుడు
అది కనిపించదు
అది అదృశ్యమగును.
అసత్యమయినది అసత్యత్వములో నెలకొనియున్నది.ఎండమావిలోని నీరు అసత్యము గనుక ఎప్పుడును ఎంత మాత్రము నీరు కాదు.సత్యసహాయముతో అన్ని విషయముల సత్యత్వము అభివ్యక్తమయి భ్రాంతి లేక మాయామయ దర్శనము(దృష్టి)
అదృశ్యమగును.
ఆత్మ సత్యము.
చైతన్యము జీవస్వభావమును ధరించినట్లుగానుండి తన నిజ స్వభావమును విస్మరించి ఉన్నదని తాను తలచుదానినంతటిని అనుభవగోచరము గావించుకొనును.
జీవుడు పంచభూతములను తనకు వెలుపలనున్నట్లు జూచును.
కొన్ని తన లోపలనున్నట్లు మరికొన్ని వెలుపలనున్నట్లు భావించును.అందువలన వానిని అనుభవించును.
జడమగు ఆకాశము(అంతఃకరణ) తన లోపల తనను ప్రతిఫలించజేయజాలదు.
చైతన్యము తన అంతర్గత జ్ఞానముతో నానావిధ ప్రాణులను ఊహించును.దాని శక్తి అట్టిది.దానిని ఎవ్వరు కాదన జాలరు(ఆక్షేపింపజాలరు).
తన స్వభావము అపరిచ్ఛిన్న చైతన్యము,దేహరహితమయినను తనలోపల తనను ప్రతిఫలింపజేసి తనను ద్వైతముగా ఊహించును. తలచిన దానినంతటినీ ఉన్నదానినిగా చూచును.
బంగరుకడియమునందు బంగారము,కడియము రెండున్నవి.వీనిలో
బంగారము సత్యము,రెండవది కడియ రూపము.అదేవిధముగా ఆత్మయందు చైతన్యము, భౌతిక(జడ)పదార్థత్వభావన గూడా ఉన్నవి.
నిన్నటి తప్పును నేటి స్వప్రయత్నముతో సరిదిద్ది మంచి కార్యముగా మార్చుకొనగలిగినట్లే, పూర్వాభ్యాసములను గూడ తగిన స్వప్రయత్నముతో అతిక్రమింపగలము.
ఈ సంసారము(ప్రపంచదృశ్యము)
అనునది జీవుని
(ప్రథమవ్యక్తి-హిరణ్యగర్భుని) ఆద్యస్వప్నమే.
ఎక్కడ ప్రపంచము కనిపించిననూ అది మాయామయమయిన ప్రపంచదృశ్యము.ఈ భ్రాంతి మానసిక పరిమితితో(వాసనతో)
పోషింపబడుతున్నది.
దాని పరిత్యాగము "విముక్తి".
సమస్త విశ్వము చైతన్యశక్తియొక్క ఆవిర్భావమే.
ఉపక్రమాదిభిర్లిజ్గైస్తాత్పర్యస్య
విచారణాత్ ౹
అసఙ్గం బ్రహ్మ మాయావీ సృజత్యేష మహేశ్వరః ౹౹195౹౹
195. శ్రుతివాఖ్యముల తాత్పర్య నిర్ణయమునకు సూచింపబడిన ఆరు నియమములను ఉపయోగించి విచారించినచో బ్రహ్మము అసంగమనీ మాయతో కూడిన మహేశ్వరుడు సృష్టికర్తయనీ తేటపడును.
వ్యాఖ్య:- ఉపక్రమ ఉపసంహారములు, అభ్యాసము,
అపూర్వత, ఫలము, అర్థవాదము ఉపపత్తి అనునవి షడ్లింగములు.
1. ఆదియందూ అంతమునందూ ఛాందోగ్యపనిషత్తు బ్రహ్మమును గూర్చి చెప్పును
2. అభ్యాసమనగా మరలమరల చెప్పుట.
"తత్త్వమసి"అనే వాక్యము తొమ్మిది పర్యాయములు చెప్పబడినది.
3. అపూర్వత అనగా ఇతర ప్రమాణముల వలన తెలియకుండుట.బ్రహ్మము యొక్క లక్షణములు శ్రుతి ప్రమాణముచే తప్ప ప్రత్యక్షానుమానాది ఇతర ప్రమాణముల వలన తెలియబడవు.
4. శ్రుతివాక్యములు ఫలవంతముగ ఉండాలి. బ్రహ్మజ్ఞానము యొక్క ఫలము ఆత్యంతిక దుఃఖనివృత్తి పరమానంద ప్రాప్తి.
5. అర్థవాదము అనగా ప్రశంస,బ్రహ్మేతరముల నింద,ఇదీ శ్రుతి వాక్యాలలో లభించును.
6 . ఉపపత్తి అనగా తగిన హేతువాదములు ఉదాహరణములు.ఇవి కూడా ఉపనిషత్తులలో విస్తారముగ లభించును.
ఇట్లు ఈ ఆరు నియమములను అనుసరించి శ్రుతివాక్యములను సమన్వయించి విచారించినచో బ్రహ్మము ఈశ్వరుల తత్త్వము చక్కగా అర్థమగును.
అన్యోన్యా ధ్యాస తేటపడును.
No comments:
Post a Comment