*ధ్యాన😌మార్గ*
బ్రహ్మానుభూతి పొందే ముందు కూడా ప్రతి ఒక్కరూ బ్రహ్మముగానే ఉన్నారు. కాబట్టి అతను అందరిలోనూ ఉన్నాడు. 'తత్త్వమసి', 'తత్త్వమసి' ' అదే నీవు, ' అదే నీవు' అని వేదాంతం చెబుతుంది. ఎప్పుడైనా అనారోగ్యంశరీరానికి, మనస్సుకే వస్తుంది కానీ ఆత్మకు రాదు. ఆత్మకు ఏదీ అంటదు. కాబట్టి అనారోగ్యం మనస్సు వరకే కాబట్టి దానివరకు నీవు జాగ్రత్తగా ఉండు. ఆంత
రంగికంగా నీవు స్వేచ్ఛా జీవివే. ఆ దివ్యత్వాన్నే నీవు ప్రకటితం చెయ్యి. దానినుంచే పవిత్రమైన ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమవల్ల నీవు ఇతరులకు స్వేచ్ఛను ఇవ్వగలుగుతావు. నీవు ఇతరులకు స్వేచ్ఛను ఇవ్వలేనప్పుడు, నీవు చేస్తున్న పనిలో బంధంతో ఉన్నట్లుగా భావించవచ్చు. నీవు ఏది తలిస్తే అది జరగాలని అనుకోవడం బంధం అవుతుంది. ఎవరికీ ఎవరూ బానిసలుగా ఉండరు. మనం ప్రపంచంతో ప్రవర్తించాలన్నా, ఆధ్యాత్మికంగా ఉండాలన్నా మనకు ఉపకరించే ఒకే ఒక్క పరికరం మనలో
ఉన్న మనస్సు, దానికి ఎల్లప్పుడూ ఏ మలినమూ అంటకుండా పవిత్రంగా
ఉంచుకోవాలి. మనస్సుని దృఢంగా, స్వచ్చంగా, బలీయంగా ఉంచమని వేదాంతం
నొక్కి చెబుతుంది. జీవితం అంతిమ దశకు వచ్చే వేళకు మనం రసం పిండి వేయబడిన కమలా ఫలంలా కాక , మనం పూర్తి రసమయంగా ఉన్న ఫలంలా ఉండాలి.
***
దేహంలో ఉండేది ' దేహీ' నేను శరీరాన్ని కాదు. శరీరంలో ఉంటాను. అంటే, నేను ఇంట్లో ఉంటాను కానీ, ఇంటిని కాదు. శరీరం ఇల్లు లాంటిది. దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శరీరాన్ని పట్టించుకోక పోవడాన్ని వేదాంతం ఒప్పుకోదు. ఇంటిని పరిశుభ్రం చేసుకోకుండా, పట్టించుకోకుండా ఉంటే ఎలా పాడయిపోతుందో శరీరం కూడా పట్టించుకోకుంటే పాడయిపోతుంది. ఇంటిని శుభ్రం చెయ్యికానీ దానిలో బందీవి కావద్దు. ఇంటికి బందీవి అయితే ఇల్లు జైలు అవుతుంది. రాక, పోకలకు స్వతంత్రం లేనిది జైలు, సంతోషం లేకుంటే శరీరం
కూడా జైలు లాంటిదే. స్వేచ్ఛగా ఉండు. రావడానికి, పోవడానికి స్వేచ్ఛను కలిగి ఉండు.
***
ముందూ, వెనుకా, దక్షిణ, ఉత్తరాల్లో, పైన, క్రింద అంతా బ్రహ్మమే. బ్రహ్మమే వేదం, అదే విశ్వమంతా ఆవరించి ఉంది. బ్రహ్మమునకు మరణం లేదు, మార్పూలేదు. ఎల్లవేళలా పవిత్రమై ఎప్పుడూ నిండుగా ఉందని బ్రహ్మమును గురించి చెప్పబడింది. సత్యాన్ని తెలుసుకున్నాక ఇక వ్యత్యాసం ఏమి లేదని
గ్రహించి స్థిర మనస్కులై ఉంటారు.
***
బాహ్యమయిన వాటిని వదలివేసి ఆంతరంగికంగా అవధులు లేని
ఆనందానుభూతిలో ఉండడం అన్నదేమీ అర్థం లేని పిచ్చి వేదాంతం కాదు. అది
పరిపూర్ణమైన వేదాంతం. ఉత్తమమైన దానికొరకు అల్పమైన దానిని వదలివేసావు.
మన ఆత్మ కన్నా గొప్పది ఏదీ లేదు. దానిని మనం ఎప్పుడూ మర్చిపోతున్నాం.
No comments:
Post a Comment