☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
63. యథా చిత్తం తథా వాక్చ యథా వాక్చ తథా క్రియా
చిత్తము, వాక్కు, క్రియ ఒకేలా ఉండాలి (వేదవాక్యం)
శుద్ధత కోసం వేదమతం అనేక భావనలను ప్రసరించింది. వాక్కు వ్యక్తి సంస్కారానికి ప్రతీక. వ్యక్తిత్వం వాక్కులో ప్రతిఫలిస్తుంది. అందుకే వాక్కును శుద్ధం చేసుకోవడంప్రధానం.
అయితే వాక్కు వేరుగా, మనస్సు వేరుగా కాకుండా మనోవాక్కులు ఏకం కావాలి. మనస్సులోని సంకల్పం, భావన పటిష్ఠంగా వాక్కులో నెలకొనాలి. అలాగే అన్నమాట
పదిలంగా మనస్సులో నిలవాలి. ఇదే నిజమైన సత్యవ్రతం.
వేదం ఈ మాటలను పలికి 'ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి' అని ప్రతిన పలికించింది. శాశ్వతమైన పరమాత్మయే 'ఋతం' - ఆయన నుండి ప్రసరించిన చైతన్యమే 'సత్యం'. వాటిని మననం చేయడం, వాక్కుతో అర్చించడం యథార్థమైన వ్రతం.
అధ్యయన సందర్భంగా ఈ మంత్రాన్ని చెబుతూ, అధ్యయనం చేసిన దివ్య విషయాలు వాక్కునందు, మనస్సు నందు సుప్రతిష్ఠితం కావాలని బోధిస్తున్నది వేదమాత. కేవలం
మాటలతో అధ్యయనం చేయడమే కాక - ఆ విద్య మనస్సులో నిలవాలి. అధ్యయన కాలంలో మనస్సు, వాక్కునందు నిలవాలి. ఇది ఏకాగ్రతకు, శ్రద్ధకు ఉన్న ప్రాధాన్యాన్ని
తెలియజేయడం.
అలా పలికిన సత్యం పలికిన వానిని, అధ్యయనం చేయించిన గురువును కూడా రక్షిస్తుంది. అందుకే ‘తన్మామవతు- తద్వక్తారమవతు- అవతు మామ్... అని శాంతి
మంత్రం పూర్తవుతుంది.
మనోవాక్కుల ఏకత్వం సిద్ధించి తరువాత క్రియరూపంగా పరిణమిస్తే ఆ జీవితం ధన్యం. దీనినే 'ఆర్జవత్వం' అంటారు. 'ఋజుత్వ'మే ఆర్జవత్వం. మనోవాక్కాయ కర్మల ఐక్యత, శుద్ధతలే ఋజుత్వం. ఈ ఆర్జవ శక్తి ఆత్మను కాపాడుతుంది.
అసత్యాలతో, వంచనలతో తనను కాపాడుకోగలననుకోవడం భ్రమ మాత్రమే.అది ఆత్మను క్షోభింపజేసి, పతనానికి తీసుకువెళుతుంది.
యథా చిత్తం తథా వాక్చ
యథా వాక్చ తథా క్రియా యి
చిత్తమేదో మాట అదే, మాట ఏదో క్రియ అదే. ఇదే త్రికరణ శుద్ధి. ఈ త్రికరణాలలో 'సత్యం' నిండితే ఆ జీవితం పరిపూర్ణం. వాక్కు వెలికి వచ్చేటప్పుడు - అది సత్యమో,
కాదో మనస్సుకి తెలుస్తుంది. మనస్సు వెనుక సత్యం ఉంటుంది. అది మాటగా రాకపోతే, ఆ సత్యం మనస్సును హెచ్చరిస్తూనే ఉంటుంది. తాను పలికేది సత్యమో,అసత్యమో ఆ అంతరంగానికి తెలుసు. అంతరంగ స్వరమే వెలికివస్తే సత్యం. అది
లేకుండా అంతరంగమొకటీ, అనేదొకటీ అయితే మాట సగం ముక్కలైనట్లే. వాక్కు, అంతరంగం ఒకటైన నాడు ఆ వాక్కుకి బలం వస్తుంది.
అలాగే అన్న వాక్కును నిలబెట్టుకున్నప్పుడు బాహ్యమూ, భావమూ ఒకటై మనస్సుకి
పటిష్ఠత చేకూరుతుంది. ఆ కారణంచేత సత్యం వాగ్విషయమే కాదు, మనోవిషయం కూడా.
సత్యమే నారాయణుడు. సర్వజ్ఞుడైన విష్ణువే వెలుపలా, బైటా ఉన్నవాడు. ఆ స్పృహ ఉన్నప్పుడు అసత్య జీవనమే ఉండదు. సత్యం లేని అర్చన, ఉపాసన, యజ్ఞం,
తపస్సు వ్యర్థం. సత్యంతో కూడిన యజ్ఞం సర్వాంగీనమవుతుంది.
మనస్సుకి భిన్నంగా మాట్లాడినా, మాటకు భిన్నంగా ప్రవర్తించినా చేసిన తపస్సు క్షీణిస్తుంది. మనోవాక్కుల ఏకత్వమే మహాతపస్సు. ఆ తపోమయ జీవనాన్ని
సాధించడమే జీవన పరమార్థం. భారతీయ తాత్విక చింతనకి మూలభూమిక ఇదే.
No comments:
Post a Comment