*అనంత మద్భుత మాశ్చర్యం బిది..*
తాళ్లపాక పెదతిరుమలాచార్య అధ్యాత్మ సంకీర్తన
అనంత మద్భుత మాశ్చర్యం బిది
సనాతనుఁడ నను సరవిఁ గావవే
బలిమి నసురలకు భయంకరుఁడవు
అలరి అమరులకు ఆనందకరుఁడవు
తలకొని ఋషులకు తపఃఫలదుఁడవు
పలు నీ మహిమలు పలుకఁగ వశమా
అరయ వేదముల కాధారంబవు
పరగఁగ జీవుల ప్రాణనాథుఁడవు
పరమయోగులకు పరబ్రహ్మమవు
తిరముగ నీమూర్తి తెలియఁగ వశమా
జగముల కెల్లను సర్వబంధుఁడవు
తగిలిన శ్రీకాంతకు నివాసమవు
జిగి శ్రీవైష్ణువులకు శ్రీవేంకటపతివి
తగు నీ కత లివి తలఁచఁగ వశమా
*అనంత మద్భుత మాశ్చర్యం బిది*
👆భావము :
- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు
తండ్రి అన్నమాచార్యులవారికి సమవుజ్జీ అయిన కొడుకు ఈ పెద తిరుమలాచార్యులు. ఈయన కూడ తండ్రివలెనే లెక్కకు మిక్కుటమైన సంకీర్తనలను శ్రీవేంకటేశ్వర మకుటంతో రచించి తరించాడు. ఈ కీర్తనలో పెద తిరుమల శ్రీవేంకటేశ్వరుని *"ప్రభూ! ఇది (నీ మహిమ) అనంతము.... ఇది (నీమూర్తి) అద్భుతము... ఇది (నీ కథలు) ఆశ్చర్యకరము. ఓ సనాతనుడ! (ఆదికి ననాదియైన వాడా) నన్ను సరవి (క్రమముగా) రక్షించువయ్యా!"* అంటున్నారు. ఈయనా వైష్ణవుడై ఆ మతప్రచారం చేసి తరించాడు. స్వామి యెవరెవరికి ఏమిటో వివరిస్తున్నారు.
సనాతనుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు అనంతమైన మహిమలు కలవాడవు. నీవు అద్భుతమైన మూర్తివి. నీ ఆశ్చర్యకరమైన కథలు తలచిన వారి జన్మ ధన్యము. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది అనంతమద్భుతమాశ్చర్యంబు... అందుచేత నన్ను రక్షించవయ్యా!
1. దేవా! నీవు ఎంతో బలవంతులైన అసురులకు కూడా భయంకరమైన వాడవు. వారిని వెదకి మరీ... సంహరించావు. అమరులైన (మరణంలేని) దేవతల కందరికీ ఆనందము నొసగువాడవు. తలకొని (పూనుకొని) మునులకు వారి తపస్సులకు తగిన ఫలితముల నొసగు పరమాత్మవు. అటువంటి నీ మహిమ యెట్టిదో పలుకుట నా వశమా! నీవు అనంతమైన మహిమలు కలవాడవు.
2. ప్రభూ! నీవు చూడబోతే, వేదములన్నింటికీ ఆధారభూతుడవు... (వేద రక్షకుడవు, వేద నుతుడవు, వేదవేద్యుడవు). జీవులందరికీ - చీమ అయినా తిమింగిలమైనా, తీతువు పిట్ట అయినా, గండ భేరుండమైనా, అమ్మకడుపులో పెరుగుతున్న బిడ్డ అయినా, పర్వతాకారుడైన రాక్షసుడకైనా ప్రాణనాథుడవు. ప్రాణం రూపంలో వున్న అంతర్యామివి నీవే. పరమయోగులందరూ పరబ్రహ్మగా భావించి ఆరాధించేది నిన్నే. అట్టి నీ మూర్తి (స్వరూపం) ఇది... అని తిరముగ (స్థిరంగా) తెలుసుకోవటం, మా వల్ల అవుతుందా?
3. ఓ దేవదేవా! జగములకెల్ల (పదునాల్గు భువనాలకు) నీవు సర్వబంధుడవు. తగిలిన (నిన్ను వలచి వలపించుకొన్న) శ్రీకాంతకు (లక్ష్మీదేవికి) నివాసమవు (హృదయంలోనే నివాసమై వున్నవాడవు). శ్రీవైష్ణవులందరికీ నీవు శ్రీవేంకటేశ్వరుడవు. ఓ శ్రీమన్నారాయణా! నీ భాగవత కథలు ఆశ్చర్యకరమై విన్నవారిని పావనులను చేస్తాయి. ఆ కథలనన్నింటిని తలచి నీ ఘనత నెరుగుట నావల్ల అయ్యే పనేనా? అది నేను సాధించగలనా ప్రభూ!
No comments:
Post a Comment