☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
75. అలక్ష్మీః మే నశ్యతామ్
నాకు అలక్ష్మి నశించుగాక (ఋగ్వేదం)
ఈ వాక్యం శ్రీసూక్తం (ఋగ్వేదం) లోనిది.
జీవులకు కావలసిన సకలైశ్వర్యాలు లభించాలని వేదమాత ఆకాంక్ష. అందువల్లనే శ్రీసూక్తం వంటి మంత్రగుచ్చాల ద్వారా మనకు కావలసిన బహుప్రయోజనాలను
సిద్ధింపజేసుకొనే సాధనలను ప్రసాదించింది.
శోభ, కాంతి, ఉత్సాహం, ఉల్లాసం, సంపద, ధర్మం, కీర్తి, శుచి, అభయం -
వంటి దివ్యగుణాల సమాహారమే శ్రీలక్ష్మీస్వరూపం. వాటికి విరుద్ధమైనవి అలక్ష్మీ.ఆ అలక్ష్మి మనకు తొలగుగాక అని కోరుకోవాలి.
మన సంప్రదాయాలలో లక్ష్మీకళను ఒంటిలో, ఇంటిలో సుస్థిరం చేయడానికి తగిన సదాచారాల నెన్నిటినో ప్రాచీన గ్రంథాలలో తెలియబరచారు. పరంపరగా
మనవారు అనుసరిస్తూ వచ్చారు.
సూర్యోదయానికి మునుపే నిద్రలేవడం, ఇళ్ళూ వాకిళ్ళూ శుభ్ర పరచుకోవడం,ముగ్గు వేయడం, తాను శుచిగా స్నానాదులు చేయడం, శుభ్ర వస్త్రాలను ధరించడం,వంట పాత్రల శుద్ధి, శుచిగా వండిన ఆహారాన్ని దేవతకు నివేదించడం, ఉభయ
సంధ్యలలో దీపారాధన, కఠినంగా కరకుగా మాట్లాడకపోవడం, ఇంట్లో స్నేహమయ వాతావరణాన్ని నెలకొల్పడం, చిరునవ్వు చెదరకుండా ప్రసన్నంగా ఉండడం, సుగంధ
కుసుమం, పసుపు, కుంకుమ వంటివి దాల్చడం, వస్తువులను దుర్వినియోగపరచకుండా
ఉపయోగించడం - వంటివన్నీ గృహకృత్యాలలో ప్రధానాలు. వీటిని నిర్వహించడం సామాన్య విషయం కాదు.
వీటిని సమర్థవంతంగా సాగించగలిగే గృహిణికి పూజ్య స్థానాన్నిచ్చింది.
భారతీయసంస్కృతి. ఇందుకు గృహస్థు, పిల్లలు కూడా సహకరించాలి. 'గృహిణీ
గృహముచ్యతే', 'ఇయం గేహే లక్ష్మీః' - వంటి సంస్కృతసూక్తులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ పాత్రను నిర్వహించడానికి పూర్తికాలం వినియోగించే బాధ్యత తక్కువేమీ కాదు. ఇలా కాలం గడిపే ఇల్లాలిలో లక్ష్మీకళ సహజంగా దీపిస్తుంది. ఆమె ప్రభావం చేత ఎలాంటి దుఃస్వభావమైనా మార్పు చెంది ప్రసన్నమవుతుంది.
ఇల్లు బాగుంటే సమాజం బాగున్నట్లే. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే
కాదు. ధన, ధాన్య, వీర, ధైర్య, దయా, క్షమ, తృప్తి, సత్సంతానం, సిద్ధి, బుద్ధి,
జ్ఞానం... ఇవన్నీ లక్ష్మీస్వరూపాలని వైదికసంస్కృతి సంభావించింది. ఇవి వృద్ధి చెంది, అలక్ష్మి తొలగాలని నిత్యం కాంక్షించాలి.
'అభూతిం అసమృద్ధిం చ సర్వాన్నిర్ణుద మే గృహాత్' - ఎదుగుదలలేని లక్షణం,దారిద్య్రం, లోటు మొదలైనవన్నీ మా ఇంటి నుండి తొలగు గాక! అని కూడా
శ్రీసూక్తం చెబుతోంది. ఇక్కడ ఇల్లు అంటే జీవుని నివాస భూమియైన దేహాన్ని కూడా... అని అర్థం చేసుకోవాలి. ఇంటా, ఒంటా కూడా దారిద్ర్యం ఉండరాదు.
సంపద సమృద్ధిగా ఉండాలని ప్రతివారి ఆకాంక్ష, దానికి ముఖ్యమైన సంప్రదాయ సదాచార సమృద్ధిని సమకూర్చుకోవాలి.
"అశౌచం, అనాచారం, హింస వంటి ప్రవృత్తుల వలన రాక్షసులను విడిచిపెట్టాను.సాత్వికత, శౌచం, సదాచారం, సర్వ భూతహిత బుద్ధి - వంటి సులక్షణాల వలన
దేవతలను కరుణించాను” అని శ్రీ మహాలక్ష్మి స్వయంగా పలికింది (మహాభారతం).
చక్కగా, తృప్తిగా ఉన్న ఇంట ధనసమృద్ధి గోచరించక పోయినా, ధనం వల్ల కలిగే ఆరోగ్యం, సుఖశాంతులు వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. కావలసిన ఫలితాలే లభించాక - ఇంకా ధనసమృద్ధి లేదే... అనే విచారం అక్కరలేదు. కొందరు ధనమే లక్ష్మి అనుకొని దానిని సంపాదించడంలో అన్యాయాన్ని, అనాచారాన్ని పాటిస్తారు. అలా
గడించిన లక్ష్మి శాంతినీ, సంతోషాన్నీ ప్రదానం చేయదు.
తాత్వికంగా సంభావిస్తే... అజ్ఞానమే అసలు దరిద్రం. దానిని సైతం తొలగించి జ్ఞాన సమృద్ధిని పొందడమే మహాలక్ష్మి ఉపాసనలోని ప్రధాన తాత్పర్యం.
No comments:
Post a Comment