Wednesday, January 1, 2025

 ~ తపస్సు ~

పెద్దగా
ఆశలేమీ లేవు 
సమాజాన్ని సమూలంగా
క్షాళన చేసేస్తయ్ నా అక్షరాలని

అంతటి 
ఊహలేమీ లేవు
పాషాణ హృదయాలను సైతం
కరిగించేస్తయ్ నా భావాలని

దురాశ 
లేదెంత మాత్రం  
ఆవరించిన తిమిరాలను 
కాల్చేస్తయ్ నా అనుభూతులని

అచంచలమైన
విశ్వాసమేమీ లేదు
పురోగమనానికి చోదక శక్తులౌతై 
పరుగులెత్తించేస్తై నా అనుభవాలని

కోరికా లేదు
ఘన సత్కారాలు సన్మానాలూ
అవార్డులూ రివార్డులూ పదవులూ 
బిరుదులూ కట్టబెట్టేస్తాయని


********

మరెందుకూ
రాస్తున్నావ్ అంటే ...

నాలో పేరుకుపోతున్న 
అహాన్నీ స్వార్థాన్నీ నిర్లిప్తతనీ 
తుత్తునియలు చేసుకోవడానికే.

నాలోని మృగత్వాన్ని 
సంహరించుకోవడానికీ
నన్ను నేనే క్షాళన చేసుకోవడానికి

మరి ఏం ఆశించి 
కూరుస్తున్నవ్ అంటే

లోలో అలముకుంటున్న 
అజ్ఞానాన్నీ మూఢత్వాన్నీ 
నిరాశా నిస్పృహలనీ దహనం చేసుకోవడానికే

నన్ను నేనే 
పుటం పెట్టుకోవడానికీ
శూన్యమై దూది పింజెలా తేలిపోవడానికీ

అచ్చమైన 
ఓ మనిషిలా 
పునర్జన్మించాడానికే
రాస్తున్నాను అవిరామంగా

- రత్నాజయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment