Monday, June 2, 2025

 నలుగాలివాన అంటే ఏమిటి?
ప్రౌఢ వ్యాకరణంలో చూపిన ఉదాహరణలలో ఇదొకటి.

దువ్వూరి వేంకట రమణశాస్త్రి గారి స్వీయచరిత్ర చదువుతూ ఉంటే ఎపుడో 60సంవత్సరాల కింద చదివిన ప్రౌఢవ్యాకరణం ప్రస్తావన వచ్చింది.

దువ్వూరి వేంకట రమణశాస్త్రి గారు తమకు కొవ్వూరు సంస్కృత కళాశాలలో అధ్యాపక వర్గంలో ఒక గొప్ప పండితుడుగా గుర్తింపు తెచ్చిన సన్నివేశం ఇది అంటూ ఈ వ్యాకరణాంశ ప్రస్తావన చేశారు.

ఆ కళాశాలలో చేరిన కొత్తల్లో సూర్యనారాయణ శాస్త్రి గారు సీనియర్ పండితులు ఈయన సత్తా ఏమిటో చూద్దాం అని మాటల సందడిలో "ప్రౌఢవ్యాకరణంలో నలుగాలి వాన" అని ఉంది గదా! దానినెట్లా అన్వయిస్తారు? అని ప్రశ్నించారట.

దువ్వూరి వారికది ఎరుకలో ఉన్నా ఈయన ఆంతర్యం ఏమిటి నన్ను పరీక్షింపదలచారో? లేక ఊరికే అడిగారో? తెలియలేదు. చూద్దాం అని అందులో అర్థం కానిదేముంది? అన్నారట .

ఆ శాస్త్రులు గారు ఏదేదో అన్వయించుకొని మాట్లాడడంలో తనకు తెలియకే అలా అడిగినట్టు అర్థమయింది.

ఆ రోజుల్లో సంస్కృత వ్యాకరణాలకూ శాస్త్రాలకు చేసేటంత కృషి తెలుగు విషయం లో జరిగేది కాదు. అందుచేత నేను చెప్పిన సమాధానానికి సూర్యనారాయణ శాస్త్రి గారు ఆనందపరవశులైపోయి నలుగురిలో మన రమణశాస్త్రి గారు గట్టి వారని శ్లాఘించారట.

ఆ పాఠం విషయానికి వస్తే

నలుగాలివి — అంటే నాల్గు కాళ్ళవి..(చతుష్పాత్తులు అని సంస్కృత వ్యవహారం.)

వానన్ అంటే వానిలో .

నాలుగు కాళ్ళ జంతువులలో — గోవు ప్రశస్తమైనది అని దువ్వూరి వారు చెప్పారట. చాలా మంది ఉపాధ్యాయులను అడిగాను. ఎవరూ ఇంత చక్కగా చెప్పారు కాదు అని అన్నారట ఆ శాస్త్రి గారు.

నాలుగుకు 'నలు 'అని గూడా సమాసంలో ప్రయోగం ఉంది. ఉదా:—నలుదెసలు , నలుదిక్కులు .

అవి— అనేది ద్వితీయాది విభక్తులలో 'వాని' ఔతుంది . ఉదా:— వానిని, వానిచేత …

నాలుగు కాళ్ళు కలవానిలో అనడానికి 'నలుగాలి వానన్' అన్నాడు తిక్కన.

ఆ భారత ప్రయోగం ఇది. .

అనిన — నలుగాలివాన గోవును, నశేషశబ్దముల మంత్రమును, లోహజాతిఁ గాంచనమును, మనుజుల విప్రుండును, సమధికత్వ భాజనములండ్రు వేదప్రపంచ విదులు —అని .

బహుజనపల్లి వారు తమ ప్రౌఢవ్యాకరణంలో దీన్ని ఉదహరించారని వివరంగా చెప్పారట సూర్యనారాయణ శాస్త్రి గారు.
జంతువులలో ఆవు, శబ్ద జాలంలో మంత్రమూ, లోహాలలో బంగారమూ, మనుషులలో బ్రాహ్మణుడూ ఆధిక్యత గలవాళ్ళు అని దీని భావం.

No comments:

Post a Comment