Tuesday, October 14, 2025

 *ఎవరూ కోరని అలక్ష్మీ ఉంది.!* 

*లక్ష్మీ దేవి గురించి మనకందరకూ తెలుసు. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారి పూజల్లో మహాలక్ష్మిని కూడా ప్రధాన దైవంగా పూజిస్తారు. అయితే పురాణాల్లో లక్ష్మీదేవి సోదరిగా చెప్పే అలక్ష్మి గురించి కూడా ఉంది. ఈ అలక్ష్మి లక్ష్మీదేవికి పూర్తిగా విరుద్ధం. లక్ష్మీదేవి సకల శుభలక్షణాలకు ప్రతీక కాగా దారిద్య్రం, బద్ధకం, తామస గుణం వంటివి అలక్ష్మి లక్షణాలు. అందుకే ఆమెను ఎవరూ కోరుకోరు. అలక్ష్మి పోవాలని కోరే మంత్రాలున్నాయి.*

*దీనికి సంబంధించి ఒక చమత్కార కథ కూడా చాలా మందికి తెలిసిందే. ఇద్దరు లక్ష్ములూ ఒకసారి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని ఒకరిని అడిగారట. నిజం చెబితే అలక్ష్మికి కోపం వస్తుంది. అమె పట్టుకుందంటే ఇక దారిద్య్రమే. అందుచేత ఆ వ్యక్తి తెలివిగా వచ్చేటపుడు లక్ష్మి, వెళ్లేటపుడు అలక్ష్మి అందంగా ఉంటారని అన్నాడట. దానితో లక్ష్మీదేవిరాగా అలక్ష్మి* *వెడలిపోయిందని చెబుతారు. అంటే అందరూ లక్ష్మి రావాలని కోరుకుంటారు, అలక్ష్మిని వెళ్ళిపోవాలని కోరుకుంటారని దీని అర్ధం.*

*ఇక ధనానికి అధిదేవత ఉన్నట్టే దారిద్ర్యానికి ఒక అధి దేవత ఉందని చెప్పడానికి అలక్ష్మిని ఒక ప్రతీకగా సృష్టించారని కొందరి వాదన. ఎండిపోయిన శరీరంతో చెంపలు లోతుకు పోయి, చిన్ని కళ్ళతో, లావుపాటి పెదవులతో, గాడిద వాహనంగా ఆమె ఉంటుందని వర్ణన. ఆమె ఒక్కో సారి గుడ్లగూబ రూపం ధరిస్తుంటుందని చెబుతారు. ఆమె ఆవిర్భావానికి సంబంధించి వేర్వేరు కథలు ఉన్నాయి. కల్ప భేదం దీనికి కారణంగా భావించాలి. లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవిస్తే ఈ అలక్ష్మి ఒక సముద్రం ఇంకిపోగా దాని అడుగు భాగం నుంచి పుట్టిందని ఒక కథ. శరీరంపై రక్తంతో, వస్త్రంపై రక్తపు మరకలతో ఆమె పుట్టింది. భయంకరమైన రూపంలో ఉన్న ఆమెను వివాహం చేసుకోవడానికి రాక్షసులతో సహా ఎవరూ ముందుకు రాలేదు. తనను వివాహం చేసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆ సమయంలో మహా తపస్సంపన్నుడైన ఒక రుషి ఆమెను వివాహమాడేందుకు ముందుకు వచ్చారు. 'ఇతరులెవరూ చేయని పనిని చేయాలనేదే నా నైజం. ఎవరూ అలక్ష్మిని వివాహం చేసుకోక పోతే నేను చేసుకుంటాను. ఆమెపై ప్రేమతో కాదు. ఎవరూ ఆమెను వివాహం చేసుకునేందుకు సాహసించనందున' అని ఆ రుషి అన్నారు. ఆమెను ప్రేమించాలనిపిస్తే అదీ చేస్తాను అని ఆయన అన్నారు. ఆ రుషి అలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా సంతోషించింది.*

*ఆమె మాసిన, చిరిగిన బట్టలు ధరించి, ఇనుముతో చేసిన ఆభరణాలు ధరించేది. కుటుంబంలో జరిగే దురదృష్ట సంఘటనలకు ఆమే కారణం అయ్యేది. గులకరాళ్లు, రాళ్లు కలిసి ఉన్న చందనాన్ని ఆమె ఒళ్ళంతా పూసుకుని ఎప్పుడూ చేతిలో చీపురు కలిగి ఉండేది. ఆమె మూర్తీభవించిన వికృత రూపి. దానికి తగ్గట్టుగా ఎటువంటి కరుణ ఆమెలో ఉండేది కాదు. ఆమె చూపు దురదృష్టకారకంగా ఉండేది. అయితే కొంతకాలం తర్వాత ఆమె భర్త 'నేను ఎవరూ చేయని పనికి సిద్ధపడి మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. అయితే ఆమెను ప్రేమించాలన్న రెండో పరీక్షకు మాత్రం సిద్దపడేది లేదు' అని స్పష్టం చేశారు. ఆ తర్వాత, దేవుడిని ఉద్దేశించి, 'ఎప్పుడూ ప్రవాహానికి ఎదురీదడం నా వల్ల కాదు. ఇతరులు వెళ్లిన మంచి దారిలో కాక వారి మెప్పును పొందేందుకు, మరో దారిలో వెళ్లడం సరి కాదు. ఒక వేళ వెళితే అక్కడ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కో గలిగి ఉండాలి. నేను అది చేయలేకపోయాను. అందువల్ల నేను నా పూర్వ తాపస జీవనానికి వెళ్లి పరిశుద్దమైన దివ్యత్వాన్ని అనుభవిస్తాను. అందుకు అనుగ్రహించు' అని అన్నాడు. అతను అలక్ష్మిని తన ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దానితో ఆమె అతనిని నాశనం చేస్తానని అంది. చేతనైతే చేయమని అతను నిర్భయంగా చెప్పాడు.*

*అయితే ఆలక్ష్మి గురించి మరో కథ కూడా ఉంది. ఆమె కలి పురుషుని రెండో భార్య అని కొన్ని చోట్ల ఉన్నట్టు చెబుతారు. ఆమె దక్ష ప్రజాపతి వీపు నుంచి పుట్టిందని మరో కథనం. అలాగే క్షీర సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి కట్టిన వాసుకి నోటి నుంచి విషం జాలు వారిందని దాని నుంచి ఆమె ఉద్భవించిందని మరో చోట ఉన్నట్టు విజ్ఞులు చెబుతారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ క్షీర సముద్రం నుంచే పుట్టినందున వారిద్దరూ అక్క చెల్లెళ్ళయ్యారని చెబుతారు. దానిలో అలక్ష్మిని పెద్దదానిగా భావిస్తారు అందుకే ఆమెను జ్యేష్ఠా దేవి అని కూడా పిలుస్తారు. మరి కొందరు ఆమెను నిరృతి దేవతగా పేర్కొంటారు.*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁

No comments:

Post a Comment