Sunday, November 15, 2026

*🧘‍♂️మహాప్రజ్ఞ ఏ విద్యను నేర్చుకుంటే మానవుడు మరి దేన్నీ నేర్చుకోనక్కరలేని విద్య🧘‍♀️*

 *🧘‍♂️మహాప్రజ్ఞ     ఏ విద్యను నేర్చుకుంటే మానవుడు మరి దేన్నీ నేర్చుకోనక్కరలేని  విద్య🧘‍♀️*
🔥🔥🧘‍♂️🧘‍♀️🔥🔥

*శ్వేతకేతుడనే పడుచువాడు ఒకడు ఉండేవాడు. ఆ కుర్రవాడి తండ్రి ఉద్దాలకుడు. తన కుమారుణ్ణి విద్యాభ్యాసం కోసం ఓ గురుకులానికి ఓ సంప్రజ్ఞుని సంతతిలోకి పంపించాడు. శ్వేతకేతుడు సమస్త శాస్త్రాలూ, వేదాలూ, అన్ని విజ్ఞానాలూ నేర్చుకున్నాడు. నేర్చుకోవడానికి ఏమేం ఉన్నాయో ఆ అన్నిట్నీ నేర్చుకున్నాడు.*

 *ఆ విద్యల్లో మహా ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు.* *శాస్త్రకోవిదుడూ, అన్ని పరిజ్ఞానాల్లో పండితుడూ అయ్యాడు.* *ఓ ప్రముఖ విద్యావేత్త అయిపోయాడు. శ్వేతకేతుడి కీర్తి అన్నిదిక్కుల్లో మారుమోగింది.* *శ్వేతకేతుడు నేర్చుకోవాల్సింది మరేమీ మిగల్లేదు.* *కాబట్టి గురువు శ్వేతకేతుణ్ణి దగ్గరకు పిలిచి “నేర్పగలిగిన జ్ఞానసర్వస్వాన్నీ నువ్వు నేర్చుకున్నావు.* *ఇక నువ్వు ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవచ్చు” అన్నాడు.*

తనకు విద్యలన్నీ వచ్చేశాయనీ, నేర్చుకునేందుకు ఇంకేమీ లేదని శ్వేతకేతుడు అనుకున్నాడు. గురువు వద్ద ఉన్న విద్య అంతా తన వద్ద కూడా ఉందని గురువు తనకు మొత్తం నేర్పించేశాడని అనుకుని గురువు వద్ద శలవు తీసుకుని ఇంటిదారి పట్టాడు. గర్వంతో విర్రవీగుతూ, అహంకరిస్తూ తండ్రిని సమీపించాడు.

విద్యను అలా పూర్తిచేసుకుని ఊళ్ళోకి అడుగుపెడుతున్న శ్వేతకేతుడిని ఇంట్లో అతని తండ్రి కిటికీలోనుంచి చూసి గమనించాడు - ఎంతో దర్పాన్ని ప్రదర్శిస్తూ తన కుమారుడు నడచి రావడం చూశాడు. ఎంత పొగరుగా నిల్చుంటున్నాడో, ఎంత ఠీవీతో తలెత్తి చూస్తున్నాడో, ఎంత అహంకారాన్ని ప్రకటిస్తున్నాడో చూశాడు. అటూ ఇటూ ఎలా తిరిగి చూస్తున్నాడో గమనించాడు. తనకంతా తెలిసిపోయిందని అనుకుంటున్నట్లు శ్వేతకేతుడు చూస్తున్న చూపులే చెబుతున్నాయి. ఆ తండ్రి హృదయం తల్లడిల్లింది. దుఃఖంతో క్రుంగిపోయాడు. విద్యను నిజంగా నేర్చుకున్నవాడు ఈ విధంగా ప్రవర్తించడు.

 మహాప్రజ్ఞ శ్రీ శ్వేతకేతుడిలో ఏర్పడలేదని అతని తండ్రికి అతడి ప్రవర్తన చూడగానే ఇట్టే అర్థమైపోయింది.

ఆ తండ్రి అడిగాడు “ఒక్క ప్రశ్న అడుగుతాను నిన్ను. దేన్ని నేర్చుకుంటే మానవుడు మరి దేన్నీ నేర్చుకోనక్కరలేదో దాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేన్ని నేర్చుకుంటే మానవుడి అన్ని దుఃఖాలూ అంతమైపోతాయో దాన్ని నువ్వు నేర్చుకున్నావా? బోధించడానికి ఏది అసాధ్యమో అది నీకు నేర్పించబడిందా?”

ఆ ప్రశ్న వినేసరికి శ్వేతకేతుడికి కూడా దుఃఖం కలిగింది. “నా వద్ద ఇప్పుడున్న జ్ఞానం అంతా నాకు బోధింపబడిందే. వివరేం నేర్చుకోవాలనుకుంటున్నా సులభంగా నేర్పగలను నేను” అన్నాడు.

“వెంటనే నువ్వు మళ్ళీ మీ గురువు వద్దకు వెళ్ళి నేర్పించడానికి వీల్లేని జ్ఞానాన్ని నేర్పించమని ప్రార్థించు పో!” అన్నాడు తండ్రి.

"ఎంత పిచ్చి ప్రశ్న అది! అర్థం ఉందా దానికి? బోధించడానికే వీల్లేని దాన్ని ఎలా నేర్పగలుగుతాడు ఏ గురువైనా?” అని అడిగాడు శ్వేతకేతుడు.

"దాన్ని నేర్పించడం గురువు కళ. నేర్పించడానికి వీల్లేని జ్ఞానాన్ని ఆయనే ఎలాగో నేర్పిస్తాడు వెళ్ళిరా”.

శ్వేతకేతుడు మళ్ళీ గురువు వద్దకు తిరిగివచ్చాడు. గురువుకు సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు. “నా తండ్రి మళ్ళీ నన్నిక్కడికి పంపించేశాడు ఓ అసంగతమైన కోరికను కోరుతూ. ప్రస్తుతం నేనెక్కడున్నానో మిమ్మల్నెలా అడగాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. నేర్పించడానికి వీలేలేని జ్ఞానాన్ని నేర్చుకునేవరకూ నన్ను ఇంటికి తిరిగొచ్చి నా మొహం చూపించవద్దని నా తండ్రి నన్ను ఇంట్లోంచి గెంటేశాడు.

నేర్పడానికి వీల్లేనిదీ, నేను నేర్చుకోవాల్సిందీ అయిన ఆ విద్య ఏది? ఏమిటా జ్ఞానం? మిరెప్పుడూ దాని గురించైనా ప్రస్తావించలేదేం?" అని గురువును ప్రశ్నించాడు.

"అర్దిస్తే తప్ప దాన్ని తెలుపకూడదు. నువ్వెప్పుడూ ఆ జ్ఞానం కోసం అడగనే లేదు కదా! ఇప్పుడు నువ్వొక కొత్త విభిన్నమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నావు. బాగా గుర్తుంచుకో. ఆ జ్ఞానాన్ని నేర్పించగలగడం అసాధ్యం. మహాసూక్ష్మ, మహానిశిత జ్ఞానం అది. పరోక్షంగా మాత్రమే నేను సహాయపడగలుగుతాను నీకు. ఆ సహాయాన్ని నేను తప్పకుండా చేస్తాను. నువ్వొక పని చెయ్యి. ఈ గురుకులంలో ఉన్న అన్ని గోవుల్ని, పశువుల్ని, బర్రెల్ని అన్ని జంతువుల్నీ నీతో తీసుకుపో - ఇక్కడ సుమారు నాలుగువందల పశుగణం ఉంది - వీటన్నిటినీ వెంటబెట్టుకుని నరసంచారం ఏ మాత్రం ఉండని అరణ్యంలోకి వెళ్ళిపో. నిశ్శబ్దంగా ఉంటూ ఈ జంతువులతో బాటే జీవించు. ఏ మాటలూ మాట్లాడకు - ఆ పశువులకు ఏ భాషా రాదు కాబట్టి. కాబట్టి పూర్తి నిశ్శబ్దంతోనే ఉంటూ ఈ పశువులు వెయ్యి సంఖ్యవరకూ వృద్ధి చెందిన తరువాత మళ్ళీ వాటిని తోలుకుని నా వద్దకు తిరిగిరా”.

ఎంతోకాలం పడుతుంది అది జరగడానికి నాలుగువందల పశు వులు వెయ్యి కావాలి. మరో మాట మాట్లాడకుండా శ్వేతకేతుడు ఆ గురుకులంలోంచి వెళ్ళిపోవాలి, ఏ వాదనా పెట్టుకోకుండా - "ఏమంటున్నారు. మీరు. ఆ అరణ్యవాసం నన్నెక్కడికి తీసుకెళ్తుంది?" అని సైతం అడగడానికి లేదు. అప్పటినుంచి జంతువులతోనే బ్రతుకు అయిపోతుంది. చెట్టూ చేమల్తోనే రాళ్ళూ రప్పలతోనే బ్రతుకు ఈడ్చాలి. జనావాసాల్ని పూర్తిగా మరచిపోవాలి.

మీ మస్తిష్కం మానవకల్పితమే కాబట్టి మనుషుల మధ్య జీవిస్తూ ఉంటే నిరంతర పోషణ ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. వాళ్ళొకటి అంటారు, మీరొకటి అంటారు. ఆగకుండా మీ మనస్సు నేర్చుకుంటూనే ఉంటుంది. ఎప్పుడూ పరిభ్రమిస్తూనే ఉంటుందది.

“కాబట్టి నువ్వు కొండల్లోకీ, కోనల్లోకీ వెళ్ళిపో ఏకాంతవాసం చెయ్యి. ఏమీ మాట్లాడకు. ఆలోచనలు చేస్తే ఏ ప్రయోజనమూ ఉండదు, మీ ఆలోచనల పశువులకు అర్థం కాదు. నీ పాండిత్యాన్నంతా కట్టిపెట్టెయ్, ఇక్కడే వదిలిపెట్టెయ్ అన్నాడు గురువు బయల్దేరబోతున్న శ్వేతకేతుడితో... 

గురువు ఆజ్ఞను శిష్యుడు శిరసావహించాడు. తోడుగా నాలుగువందల పశువుల, పక్షుల మంద, అడవులూ, పర్వతాలూ, సెలయేళ్ళూ పచ్చికబీళ్ళు, రాళ్ళూరప్పల మధ్య నిశ్శబ్ద జీవితం ఎన్నో సంవత్సరాల పర్యంతమూ కొనసాగింది. మొదట్లో కొన్ని ఆలోచనలు అవే సదా పునరావృతమవుతూ ఉండేవి. ఏ ఆలోచనో మళ్ళీ మళ్ళీ తిరిగొచ్చేది ఆగకుండా. కొంతకాలానికి విసుగు వచ్చేసింది. కొత్త ఆలోచన ఏదీ రేగకపోతే పాత ఆలోచనే మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతూ ఉంటుంది. మీ మనస్సు అప్పుడు జరిగిందాన్నే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుందన్న ఎరుక కలిగింది శ్వేతకేతుడికి. యాంత్రికంగా అవి జరుగుతూ ఉన్నాయని గ్రహించాడు. కొత్త జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశమే, మార్గమే లేదు. కొత్తజ్ఞానం కలుగుతూ ఉంటే మనస్సు సంతోషంగా తుళ్ళుతూ ఉంటుంది - దేన్నో మళ్ళీ రుబ్బవచ్చనీ, ఏ పనినో చెయ్యవచ్చనీ ఉత్సహిస్తూ ఉంటుంది. యంత్రం పనిచేస్తునే ఉంటుంది.

శ్వేతకేతుడికి గమనించే గుణం పెరిగింది. ఎరుక పెరిగింది. నాలుగువందల జంతువులూ, పక్షులూ, వృక్షాలూ, బండలూ, రాళ్ళూ, నదులు, పిల్లకాలువలు. మనిషి మాత్రం కనిపించడు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఉండదు. అహంకారం ఎందుకూ పనికిరాదు - ఆ గోగణానికీ, పశువులకూ తనెంతటి పండితుడో ఎలా తెలుస్తుంది? అసలు ఆ జంతువులు శ్వేతకేతుణ్ణి కనీసం పట్టించుకోవు. గౌరవంతో చూడవు. కాబట్టి అచిరకాలంలోనే అతడి అహంకారం, అతిశయం అణగారిపోయాయి, మాయమైపోయాయి. అహంకారంతో చరించడం ఆ పశువుల ముందు ఓ నిరర్ధక ప్రదర్శన మాత్రమే అనీ, పైగా ఓ పిచ్చితనం అని శ్వేతకేతుడు తెలుసుకున్నాడు. “నేను ఇలాంటి వెర్రివేషాలు వేస్తే ఈ జంతువులు కూడా నవ్వుకుంటాయి. నేను చేస్తున్నదేమిటి? అన్న ఆత్మవిమర్శ కూడా కలిగి అందువల్ల తను ఎలా ఉండాలో కూడా తెలిసొచ్చింది. చెట్లక్రింద కూర్చుంటూ, సెలయేళ్ళ సమీపంలో నిద్రపోతూ క్రమేపీ అతడి మనస్సు నిశ్శబ్దమైపోయింది.

ఎంతో అందమైన కథ ఇది. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మదిలో నిశ్శబ్దం ఎంత ప్రగాఢమయిందంటే గురువు వద్దకు ఎప్పుడు తిరిగివెళ్ళాలో కూడా శ్వేతకేతుడు ఎప్పుడో మరచిపోయాడు. ఎదలో ఎంత నిస్సద్దు నిండిందంటే తిరిగివెళ్ళాలన్న ఆలోచన కూడా రానంత! గతమంతా మాయమైపోయింది. గతం మాయమైపోయిన వెంటనే భవిష్యత్తు కూడా లేకుండా పోయింది గతం పొడిగింపే భవిష్యత్తు కాబట్టి, అయిపోయిన అనుభవమే ముందుకు కొనసాగి భవిష్యత్తు అవుతుంది కాబట్టి. కాబట్టి గురువు మాటా మళ్ళి ఆయన వద్దకు వెళ్ళాలన్న విషయం సైతం శ్వేతకేతుడికి తోచలేదు. శ్వేతకేతుడిలో ‘ఎప్పుడు' - ‘ఎక్కడ' అన్నవి మాయమైపోయి ‘ఇప్పుడు' - ‘ఇక్కడ’లు మాత్రమే మిగిలాయి. ఇక్కడే ఈ జంతువుల్తో ఇప్పుడే జీవిస్తూ శ్వేతకేతుడు కూడా ఓ గోవే అయిపోయాడు.

ఉపనిషత్తు కథ ఏం అంటుందంటే పశుసంపద ప్రవృద్ధమై వెయ్యి పశువులు అక్కడ తయారైపోయిన తరువాత ఆ జంతువులకే ఓ అసౌకర్యం అనుభవంలోకి వచ్చిందట. ఆశ్రమానికి తమని ఇంకా తోలుకుపోకుండా ఆ విషయాన్నే మరచిపోయాడే అని పశువులు ఎదురుచూస్తూ వేచి ఉన్నాయట. చివరికి ఆ మనిషికి చెప్తే తప్ప ప్రయోజనం లేదని నిశ్చయించుకుని పశువులే శ్వేతకేతుడితో ఆ మాటను అనేశాయట - “మా సంఖ్య వెయ్యి అయిన తరువాత అశ్రమానికి తిరిగిరావాలని మమ్మల్ని అక్కడికి చేర్చాలని అన్నారు ఆ గురువు గారు. నువ్వేమో మరచిపోయావు. ఇక మనం ఇక్కణ్ణుంచి మళ్ళాల్సిన సమయం వచ్చేసింది. మనం వెయ్యి అయిపోయాం!” అన్నాయట.

ఇక పశువుల్తో బాటూ శ్వేతకేతుడు కూడా ఆశ్రమం దారి పట్టాడు. కుటీర ద్వారం వద్ద నిలబడి గురువు ఆ ఆలమందనూ, శిష్యుణ్ణి చూశాడు. ప్రక్కన నిలబడి చూస్తున్న శిష్యులతో “అదో చూడండి. వెయ్యిన్నొక్క పశువులు వచ్చేస్తున్నాయి!” అన్నాడు.

శ్వేతకేతుడు పూర్తిగా మారిపోయాడు నిశ్శబ్దతే నిండి తను అక్కడున్నాడన్న స్పృహ కూడా లేకుండా నెట్టుకుంటూ నడుస్తున్న గోవులతో బాటు తానూ ఓ గోవే అయిపోయి.

ఎగిరి గంతులు వేస్తూ ఒళ్ళు తెలియని నాట్యం చేస్తూ, అవధులు లేని ఆనందంలో గురువు శ్వేతకేతుడి వద్దకు ఆతురతతో ఎదురొచ్చాడు, ఆనందంతో

ఆయన మునిగి ఉన్నాడు. ఆప్యాయంగా శిష్యుణ్ణి కౌగలించుకుని ఒళ్ళంతా నిమిరాడు. గద్గద స్వరంతో "ఇక నేను నీకు చెప్పేదేముంది? అంతా నువ్వే తెలుసుకున్నావు. ఎందుకొచ్చావురా మళ్ళీ ఇక్కడికీ! రాకుండా ఉండాల్సింది. నీకు నేర్పించాల్సింది ఇంకేదీ లేదు. ఆ ప్రజ్ఞ నువ్వే!”

శ్వేతకేతు అప్పుడు నోరుతెరిచాడు -"మీకు ప్రణామాలను అర్పించడానికి, మీ పాదాలను ముట్టుకోడానికి. నా కృతజ్ఞతను ప్రకటించుకోవడానికి. తెలుసుకున్నాను. నేర్పించలేని విద్యను నాకు నేర్పించారు మీరు.”

ఓ గురువు చెయ్యాల్సింది దీన్నే. ఆ ప్రజ్ఞ సంభవించగల ఓ పరిస్థితిని ఆయన సృష్టించాలి. పరోక్షంగా మాత్రమే ఆ ప్రయత్నాన్ని చెయ్యవచ్చు, పరోక్షంగా మాత్రమే ఆ సహాయాన్ని అందించవచ్చు, పరోక్షంగా మాత్రమే ఆ దారిలో నడిపించవచ్చు. మరి ఎక్కడెక్కడ ప్రత్యక్ష మార్గదర్శకత్వం జరుగుతూ ఉంటుందో, ఎక్కడెక్కడ మీ మనస్సుకు నేర్పించడం జరుగుతూ ఉంటుందో అది కాదు మతం. ఓ మతతత్వాన్ని నేర్పించడం తప్ప అదే కాదు మతం. అదో వేదాంతం కావచ్చు తప్ప అది కాదు మతం.

*నేర్పించడానికి కుదిరేది కానిదే మహాప్రజ్ఞ.*

🔥🔥🧘‍♂️🧘‍♀️🔥.     ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment