Thursday, November 7, 2024

 నా ఆజ్ఞా చక్ర అనుభవాలు - 8

మూలం : కపాల మోక్షం

శీర్షిక : ఆజ్ఞాచక్ర ఆధీనం

అనుభవం, అనుభూతి : పవనానంద సరస్వతి



...ఇంతలో నాకు ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే నా మనోనేత్రం ముందు నేను సంకల్పించగానే దత్తాత్రేయుడి నిజరూప దర్శనం ఎలా కనపడింది. అంటే ఇప్పటి వరకు రాని దివ్యదృష్టి అనే సిద్ధి వచ్చినది. దీనివలన మనము ఎవరిని కలవాలని అనుకున్ననూ, ఎవరిని చూడాలి అనుకున్ననూ ఈ మనోనేత్రం ముందు చూడవచ్చును. ఇప్పటిదాకాఈ మనోనేత్రం ముందు చూపించిన దృశ్యాలే చూడటము జరిగినది. అంటే ఇప్పుడు కూడా మనకు కావలసిన సమాచారమును మనకి తగిన విధముగా ఈ మనోనేత్రం ద్వారా ఈ దివ్యదృష్టి సిద్ది ద్వారా చూడవచ్చునని నాకు అర్థమైనది.అంటే ఆజ్ఞా చక్ర సాధనలో వచ్చే జన్మాంతర జ్ఞానసిద్ధి అనగా ఎవరివైనా గత వర్తమాన పూర్వజన్మల వివరాలు అవలీలగా తెలియటం అలాగే ఈ దివ్యదృష్టి ద్వారా ఎవరినైనా ఏమైనా సమాచారం చూడవచ్చునని ఈ రెండు సిద్ధులు నాకు వచ్చిన తర్వాత తెలిసింది. అలా లెక్కన చూస్తే ఈ చక్రములో పంచభూతాలను ఆజ్ఞాపించే శక్తి కూడా రావాలి కదా ! అందుకే దీనిని "ఆజ్ఞా చక్రం" అని అన్నారని యోగశాస్త్రం చెబుతోంది. అంటే ఈ లెక్కన నాకు పంచ భూతాలు ఆధీనం అవుతాయా ? ఆధీనమైనాయా ? ఎవరికి తెలుసు ? ఒక చిన్న పరీక్ష పెడితే సరిపోదా ? బాబా సినిమాలో లాగా హీరో పెట్టినట్లు మంత్ర పరీక్షలు లాగా నేను కూడా ఈ పంచభూత పరీక్ష పెడితే తప్పు ఏమిటని అనుకుంటూ ఎండగా ఉన్న ఈ సమయంలో చిన్నపాటి వర్షం పడాలి అని సంకల్పించుకున్నాను. వర్షము కాదు కదా ! చిన్న మేఘము కూడా అగుపించలేదు ! ఇంకా ఎండవేడిమి ఎక్కువ అయింది.  లేనిపోని భ్రమలతో నేను నా సాధన గూర్చి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నానని నాకు ఏమిటి? నాకు ప్రకృతి ఆధీనమవ్వడమేమిటి? పంచభూతాలు ఆధీనమవ్వడము నమ్మటానికి హద్దులు ఉండాలి. అది అసాధ్యం. మాలాంటి వెర్రి వెంగళప్పకి కూడా ఈ పంచభూతాలు ఆధీనం అయితే ఇక ఈ ప్రకృతి గతి సంగతి ఏమి కాను. నాలో నేను నవ్వుకుంటూ అక్కడనుండి ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న నేను నివాసముగా ఉన్న హోటల్ వైపుకి ప్రయాణించటం మొదలు పెట్టినాను. నేను ఒక గంట తర్వాత ఇక్కడికి చేరుకుని లోపలికి వెళుతుంటే అప్పటిదాకా ప్రకృతిలో వచ్చే మార్పులు గమనించకపోవడం వలన వర్షం టప టపా అంటూ చిరు జల్లు పడేసరికి నేను గతుక్కుమన్నాను.  వర్షం ప్రారంభమయ్యింది. 

ఈ వర్షము నా వలన పడిందా లేక అది కావాలని పడిందా ? ఏమో ఎవరికి తెలుసు ? లేక పంచ భూత జయ సిద్ధియా? నా వలన పడి ఉంటే అప్పుడే పడాలి కదా ! సుమారు గంట సమయం తీసుకుంటుందా ? పోనీ దానంతట అది పడి ఉంటే అది వర్షాకాలం కాదు... పైగా ఎండాకాలం...! అది కూడా నేను కోరుకున్నట్లుగా చిన్నపాటి వర్షం పడి ఆగిపోయింది. అంటే నా వలన పడిందా! నాకు ఏమీ అర్థం కావడం లేదు...! నేను ఎవరో తెలిసీ తెలియని అయోమయ స్థితి. నాకు పంచభూత సిద్ధి వచ్చిందో రాలేదో తెలియని అయోమయం...! వామ్మో! ఈ సిద్ది ప్రయోగం ఇంతటితో ఆపివేయాలి. ఇంకా సిద్దులు పరీక్షించుకుంటూ పోతే సిద్దుల మాయలో పడి సాధన అదో గతి అవుతుంది. వస్తే సంతోషం! రాకపోయినా బాధ లేదు. వచ్చినా రాకపోయినా మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వర్షం పడిన పడకపోయినా ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఉపయోగం లేదు. దాంతో తెలుసుకోవాలని పరీక్షించాలని అనే ఆలోచనలు ఆపివేసి నాను. 


...దానితో నాకు చాలా అరుదుగా 12సంవత్సరాలకి ఒకసారే ఏర్పడే నేపాలి గుండ్రని ఏకముఖి రుద్రాక్ష వచ్చినది. ఒకరకముగా చెప్పాలంటే నాకు రుద్రాక్షలు అంటే మహా పిచ్చి ! కాని నేను ఎన్ని ప్రయత్నాలు  చేసిన కూడా భద్రాక్షలే దొరికేవి. నేను ఎపుడైతే ఈ చక్రస్ధితికి వచ్చినానో అపుడు నాకు నిజమైన రుద్రాక్షలు దొరకడం ఆరంభమైనాయి.అలాగే అరుదుగా దొరికే ఏకముఖి రుద్రాక్ష కూడ నాకు లభించేసరికి నా ఆనందానికి అవధులు లేవు. కాని నా సహచరుడు జిజ్ఞాసికి తన సాధన ప్రారంభించకముందే ఏక ముఖిరుద్రాక్ష వచ్చినది. కాని గాకపోతే నా రుద్రాక్షకి , వాడి రుద్రాక్షకి తేడాలున్నాయి.నాకు వచ్చిన దానిమీద ఎలాంటి రుద్రచిహ్నాలు అనగా శివలింగము, నాగపడగ, ఓంకారము, త్రిశూలము లాంటివి లేవు. వాడి దానిమీద ఇవి ఉన్నాయి. ఇందులో ఏది నిజమైన ఏకముఖి రుద్రాక్షయో నాకు అర్ధము కాలేదు ! వీటిమీద  పరిశోధనలు   చేసిన కూడా ఈ రెండు నిజమేనని తెలింది.

...కాని నేను ఈ చక్ర స్ధితికి వచ్చినపుడు  72 సంవత్సరాల ఒకసారి చాలా అరుదైన ఏకముఖి రుద్రాక్ష నేపాల్ ప్రాంతములో చాలా అరుదుగా ఏర్పడుతుందని...అది ఆ దేశ మహారాజుకి కానుకగా ఇస్తారని తెలిసినది. దీనివిలువ కోట్ల రూపాయలలో ఉంటుందని....తెలిసింది. చాలా ఆశ్చర్యమేసినది ! కాని జిజ్ఞాసికి వచ్చిన రుద్రాక్షమీద ఈ రుద్రచిహ్నాలు చెక్కినారని... అదే నిజ ఏకముఖి రుద్రాక్షమీద ఇవి సహజసిద్ధముగా ఏర్పడతాయని తెలిసినది. అంటే మాకు వచ్చిన ఈ రుద్రాక్షలు అసంపూర్ణ నిజ రుద్రాక్షలని తెలిసినది.           

No comments:

Post a Comment