నిరుక్తావభిమానం యే దధతే తార్కికాదయః ౹
హర్ష మిశ్రాదిభిస్తే తు ఖండనాదౌ సుశిక్షితాః ౹౹149౹౹
149. నిర్వచనమునందే అభిమానమునుంచు తార్కికులు మొదలగు వారు తమ తమ వాదములతో తామే సంతసింపవచ్చును.కాని వారి వాదములందలి దోషములు హర మిశ్రుడు తన ఖండనఖండ ఖాద్యము(140)నందు విశదము చేసెను.
అచింన్త్యాం ఖలుయే భావా న తాంస్తర్కేషు యోజయేత్ ౹
అచింత్యరచనారూపం మనసాఽ పి జగత్ఖలు ౹౹150౹౹
150. మనస్సు గ్రహింపజాలని విషయములకు తార్కిక నియమములను తగిలింపరాదు. ఈ జగత్తు అట్టిది. ఏలన అది ఎట్లు సృష్టింపబడినదో ఊహింపనే సాధ్యము కాదు.
అచింత్యరచనాశక్తిబీజం మాయేతి నిశ్చను ౹
మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే ౹౹151౹౹
151. ఊహాతీతమైన ఆ కల్పనాశక్తి బీజమే మాయయని నిశ్చయింపుము.సుషుప్తియందు ఆ మాయాశక్తి బీజమే మనకు అల్పముగ అనుభవమునకు వచ్చును.
వ్యాఖ్య :- అవిద్య వల్ల తను సృష్టించుకున్న ద్వైతప్రపంచంలో పురుషుడు స్వప్న-జాగ్రదవస్థలలో శ్రమతో దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు.
అదే జీవుడు,దేహేంద్రియాలతో దూరమైన సుషుప్తిలో
సుఖ-దుఃఖాల నుండి విముక్తి పొంది పరబ్రహ్మను చేరి ఆనందంగా శాంతిని పొందుతుంది.
ఆ అనుభవము మనకు అనుభవములో వుండనే వుంది.
అలాగే కర్తకత్వం నుంచి ముక్తి పొందిన జీవుడు కైవల్యావస్థలో కేవల ఆత్మ స్వరూపుడై పరమానంద స్వరూపుడౌతాడు.
అందువలన
"అహంబ్రహ్మస్మి"(నేను బ్రహ్మమే) అను ప్రయత్న పూర్వకమగు భావనతో అన్యభావనలను మనస్సులో అనుసంధానము చేయని వ్యక్తి శాంతిని అనుభవించును.ఏల అనగ ఆ బ్రహ్మము "శాంతియే".
భావనలు,ఆలోచనలే జగత్తు. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
మాయ ఉందా?లేని మాయా?ఊహాతీతమైన కల్పనాశక్తి బీజమే మాయయని నిశ్చయింపుము.
ద్వైతదర్శనమునకు ఏకైకమూలమగు మానసిక పరిమితిని పరిత్యజించవలెను.
మనస్సు గ్రహింపజాలని విషయములకు తార్కిక నియమములు తగిలింపరాదు. జ్ఞానహీనమగు మనస్సే బాధపడును.
(నిద్రవంటి)అజ్ఞాన దశలో మాత్రమే మనస్సు స్వప్నములో ప్రపంచదృశ్యమును జూచునుగానీ,అది జాగృతమైనప్పుడు లేక జ్ఞానవంతమైనప్పుడు చూడదు.
కావున ఈ ప్రపంచమున దుఃఖముననుభవించు దేహధారియగు వ్యక్తినే మనస్సనియు,అజ్ఞానమనియు,
జీవుడనియు,మానసిక పరిమితి అనియు,వ్యక్తిగత చైతన్యమనియు చెప్పుదురు.
ఈ దేహము అచేతనముగావున సుఖమును గానీ దుఃఖమునుగానీ పొందజాలదు.అవిద్యయే అజాగ్రత్తను అజ్ఞానమును కలిగించును.
మాయే బ్రహ్మం,బ్రహ్మమే మాయయను శుద్ధ జ్ఞానోదయ ఫలితముగా వ్యక్తి చైతన్యసత్యము (తత్త్వము) నందు చరించును.
తాను నిద్రించినాడా అన్నట్లు చేయవలసిన దానిని చేయును.
జీవించి యుండగనే ముక్తుడగును(జీవన్ముక్తుడగును).
No comments:
Post a Comment