Thursday, December 19, 2024

 సర్వజ్ఞత్వాదికే తస్యనైవ విప్రతిపద్యతామ్ ౹
శ్రౌతార్థస్యావితర్కత్వాన్మాయాయాం సర్వసంభవాత్ ౹౹159౹౹

159.  ఆనందమయకోశమున సర్వజ్ఞత్వము మొదలైన గుణములున్నవా లేవా అని తర్కింపవలదు.శ్రుతి వాక్యములు తర్కమునకు విషయములు కావు గనుకను,మాయయందు సర్వమును సంభవమే అగుటచేతను తర్కమునకు అవకాశము లేదు.

అయం యత్సృజతే విశ్వం తదన్యథయితుం పుతీరితః ౹౹160౹౹

160.  ఆనందమయకోశము నుండి
సృష్టింపబడుచున్న స్వప్నజాగ్రదవస్థ లనుమార్చుటకు ఎవరిగాని శక్తి లేనందున దానిని సర్వేశ్వరుడనుట తగియున్నది.

అశేష ప్రాణిబుద్ధీనాం వాసనాస్తత్ర సంస్థితాః ౹
తాభిః కోడీకృతం సర్వం తేన సర్వజ్ఞ ఈరితః ౹౹161౹౹

161.  సకల ప్రాణికోటి యొక్క విషయవాసనలు ఆనందమయకోశమున ఉన్నవి. అవి అన్నీ దానియందు క్రోడీకరింపబడుట వలన అది సర్వజ్ఞుడనబడినది.
వ్యాఖ్య:- జీవుడు జాగ్రదవస్థలో విశ్వుడనీ స్పప్నావస్థలో తైజసుడనీ సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడనీ చెప్పబడుచున్నాడు.

అట్లే ఈశ్వరుడు కూడా క్రమముగా వైశ్వానరుడు,హిరణ్యగర్భుడు,
ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు.మూడవస్థలయందున్న జీవుడు మూడు జీవులు కానట్లే ఈశ్వరుని మూడు భేదములు కూడా ఒక ఈశ్వరుణ్ణే సూచించును.

కారణావస్థ యగు సుషుప్తావస్థ యందలి ఈశ్వరునిలో మిగిలిన రెండవస్థలును గ్రహింపబడును.ఈ విధముగ సర్వగతుడగు ఈశ్వరుడు అంతర్యామియై మూలకారణమై జగన్నియామకుడగుచున్నాడు.

సుషుప్తిలో ఆనందమయకోశమున కారణావస్థ యందున్న జీవుడు విస్తృతార్థమున ఈశ్వరుడనీ చెప్పవచ్చు.

ఒక నగరము ఫలానా దేశమునకు మాత్రమేగాక అనంత విశ్వమునకు కూడా చెందును.
జీవుని ఆనందమయ కోశము ఈశ్వరుని ఆనందమయకోశములోని అంశమే అగుటచే జీవేశ్వరుల ఐక్యత నిలుచుచున్నది.

తత్త్వమును విస్మరించుట వలననే శ్రుతి వాక్యములు తర్కమునకు విషయములవును.
సర్వజీవుల యొక్క ఆత్మ జాగ్రత్,స్వప్న,సుషుప్తులను మూడు అవస్థలను అనుభవించును.వానికి దేహముతో సంబంధము లేదు.నానాత్వము కేవలము ఆ భాసమే.

శ్రుతిని మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలెను.
బ్రహ్మము నామరహితము, రూపరహితమునగు తత్త్వము.

ఆత్మతత్త్వవిచారణయందు నిమగ్నుడయినప్పుడు భ్రాంతి జనకమగు ప్రపంచదృశ్యము భ్రాంతి అస్తమించును.
సకలావస్థలు అనంతమగు చైతన్యజ్యోతి ఒక్కటే ఏకైక సత్యము(సత్త) అని గ్రహించిన వ్యక్తి తత్త్వమును తెలిసికొనును.      

No comments:

Post a Comment