Thursday, December 19, 2024

 నేడు (19/12/24) సంకట హర చతుర్థి.సంకట హర చతుర్థి మంగళవారం వస్తే , దాన్ని అంగారక చతుర్థి అంటారు.ఈ రోజు సంకట హర గణేశ స్తోత్రమ్ కనీసం 4 సార్లు అయినా పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది🙏

మనం ఏ కార్యం తలపెట్టినా , అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా , విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము.సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే , శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.ఎవరికి వారు స్వయంగా , అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి , గణేశ అనుగ్రహం పొందుదాం🙏

ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🙏

సంకట నాశ గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము🙏

నారద ఉవాచ🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||

దేవతలందరికంటే  ముందుగా పూజిపబడేవాడు , గౌరీ తనయుడు , విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||

ప్రధమ నామం: వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు)
ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు)
తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు)
చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)🙏

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||3 ||

పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు) షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు)
సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు)
అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)🙏

నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||

నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు)
దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు)
ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)🙏

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||

ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము , ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి , పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును🙏

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||

ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాల పాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును.ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు🙏

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||

ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏

అందరం భక్తితో " ఓం గం గణపతయే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం.ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు.


No comments:

Post a Comment