Friday, December 20, 2024

 *శంబల - 1*
💮

*రచన : శ్రీ శార్వరి* 


*ఛాంగు భలా!*

టిబెట్ బౌద్ధానికి గుండెకాయ శంబల! శంబల గురించి ప్రపంచానికి పరిచయం అయింది నిన్న మొన్న. చరిత్రలో నిన్న, మొన్న అంటే ఒకటి రెండు శతాబ్దాల క్రితం అని. అయినా శంబల చరిత్ర ఇంకా పరిశోధన వలయంలోనే ఉంది. వాటి చారిత్రక విశేషాలు, అవశేషాలు ఎక్కడా కనిపించవు. శంబల కొత్తగా చరిత్ర పుటల్లోకి రాలేదు. ఊహాపోహలే తప్ప భూగోళంపైన ఫలానా చోట శంబల అని ఎవరూ గుర్తుపెట్టరు. శంబలకు రెండు వేల సంవత్సరాల ప్రాచీనత ఉంది. అదే ఆధారం.

శంబల అంటే ఒక తపోలోకం అనుకుందాం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తపోలోకాల కోవలోనిది అనుకుందాం. అప్పుడు దానికి హిస్టరి, జాగ్రఫీ ఉండవు. అది ధ్యానుల లోకం అవుతుంది. ఆత్మల ఆవాసమవుతుంది. సూక్ష్మ శరీరాల కదలిక తెలుస్తుంది. అక్కడ ఎవరూ సమాధిలో ఉండరు. ఎరుకతో ఉంటారు. ఎప్పుడు చైతన్యంగా ఉంటారు. మనకూ వారికీ ఉండే సంబంధం ఆత్మ ప్రకరణం.

19వ శతాబ్దం చివరన శ్వేతయోగిని మాడం బ్లవట్ స్కీ ఒక తేనె తుట్టెను కదిలించింది. టిబెట్ లో పరమ గురువు లైన మాస్టర్లు ఉన్నారని, స్వయంగా టిబెట్ వెళ్లి, లామాలతో సంధానపడి దివ్యజ్ఞానం బయటకు లాగింది. ఆ తర్వాత లోకానికి మాస్టర్లపై శ్రద్ధ పెరిగింది. మాస్టర్ మోర్య, కుత్ హోమి, జ్వాల్ కుల్ దివ్యజ్ఞానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడంతో శంబల రహస్యం కాస్త బయటపడ్డది.

భౌగోళికంగా శంబల స్థానం ఏది? తెలియదు. దాని చరిత్ర ఏమిటి? తెలియదు. హిమాలయాలకు ఆవల గోబి ఎడారి మధ్యన అని ఒక నమ్మకం. టిబెట్ అని మరొక నమ్మకం. హిమాలయాల పైన, మానస సరోవరం దిగువన అని మరొక విశ్వాసం. అసలు శంబల అన్నదే లేకపోతే దాని గురించిన కధలు పుట్టవు. కేవలం కల్పన అనలేం కదా! లేనిదాన్ని ఉన్నదనుకోవడం, ఆ సంస్కృతిని గొప్పగా అభిమానించి, ఆరాధించడం ఎలా సాధ్యం? కేవలం బ్రహ్మ జ్ఞానులకో, ఆత్మ విదులకో అందుబాటులో ఉంటే సామాన్యులకేం ప్రయోజనం? శంబల మన స్వర్గం వంటి మరొక భూమిక అందామా? భావన అందామా!

అది లేదంటే లేదు - ఉన్నదంటే ఉన్నది. అది ఎట్లా? విశ్వాసం, నమ్మకం. విశ్వాసం ఉన్నంత మాత్రాన శంబల ఉన్నట్లా? చూద్దాం. విశ్వాసం వెన్నంటి సందేహం ఉంటుంది. అది సహజం. ఉన్నది. లేదు అనే సందిగ్ధ స్థితిని scepticism అంటాం. రెండు వైపుల వాదించ వీలుండేది స్కెప్టిసిజం. సదసత్ అన్నది ఒక విధంగా అవకాశ వాదం. నమ్మకం అనే కత్తితో విశ్వాసాన్ని ఖండించనూ వచ్చు, పదును పెట్టనూ వచ్చు.


1838లో పారిస్ లో 'డగురే' అనే వ్యక్తికి పిచ్చి పట్టింది. పిచ్చి అంటే నిజం పిచ్చి కాదు. నమ్మకం పిచ్చి. పిచ్చి నమ్మకం. ఆయన గారి భార్య అతన్ని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్లింది. ఆయనొక పిచ్చి డాక్టరు. రోగిని క్రింద మీద, బయట లోపల పరీక్షించాడు. అతని పిచ్చి మనిషి నీడను రాగిరేకు పైన పట్టుకోవచ్చు అన్నది. అతన్ని పారిస్ లోని పెద్ద పిచ్చాసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు అతని మానసిక స్థితుల్ని విశ్లేషించి, పరిశోధించి ఫొటోగ్రఫీ కనిపెట్టారు. ఒక పిచ్చివాడి పిచ్చి ఎంత పరిశోధనకు ఆకరమైంది.

మనిషి నీడను ముద్రించడం అన్నది వాస్తవం అయింది గదా! శంబల కధ కూడా అలాంటి నీడ. యుగయుగాల మానవ నాగరికత, సంస్కారం, శంబలలో దాచి పెట్టబడిందట. చరిత్రకు నిధి శంబల, సంస్కృతికి కేంద్ర బిందువు శంబల. ఒక్క మాటలో చెప్పాలంటే భూగ్రహవాసుల వారసత్వ సంపద శంబల. మృత్యువును జయించిన మహా ఋషుల నెలవు శంబల. వారికి జరా మృత్యు భయం లేదు కనుక వారు శాశ్వతులు, అమరులు, మృత్యుంజయు లు. అక్కడ ప్రాంతీయ భేదం లేదు. ప్రతి మనిషికి అక్కడ ప్రవేశార్హత ఉంది.

ప్రతి మనిషి ఆత్మ బయలుదేరేది అక్కడి నుండే, తిరిగి చేరేది అక్కడికే. భూగోళం చుట్టూ అనేక పొరలున్నాయి, గాలి తెరలున్నాయి. మనుషుల భావాలు, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతుంటాయి. అవి ఏవీ అంతరించిపోవు. భావాల మేఘాలు చుట్టూ ఆవరించి ఉంటాయి. ఆ పొరల్ని ఛేదించగల శక్తి ఆత్మది. తపస్సుచే ఆత్మ శక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి కలవారు భూగోళాన్ని దాటిపోగలరు. శంబల లోని పరమగురువులు కేవలం టిబెట్ కి చెందినవారు కాదు. అక్కడ అన్ని దేశాల వాళ్లు ఉంటారు. అందరు ఆత్మ స్వరూపులు, ఆత్మశరీరులు. వారంతా ఏకమై సమష్టిగా మానవ వికాసానికి కృషి చేస్తుంటారు. తపస్సు చేస్తుంటారు.


*అసలింతకీ శంబల ఉన్నట్లా? లేనట్లా?*

ఏమో! ఉన్నదేమో! లేదేమో! ఉండీ లేని భావన కలిగిస్తోందా? లేకుండా ఉన్న భ్రమ కలిగిస్తోందా? అంతా తికమక. టిబెట్ వెళ్లి పరిశోధిస్తే తప్ప నిజం బయటపడదు. టిబెట్ వెళ్లడం అంటే టిబెట్ చరిత్రను శోధించడం. చరిత్ర గనుల్లో అట్టడుగున శంబల ఉండవచ్చే మో. యోగులు, మహర్షులు ట్రాన్స్ లో వెళ్లగలరు. మరి సామాన్యులకు అది అసాధ్యం కదా. ఐతే సమాధి అనుభవం ఉన్నవారు శంబల వెళ్లగలరు అని అనుకుందాం. అప్పుడు అది అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది.బౌద్ధ సాహిత్యంలో తరచు శంబల పేరు వినిపిస్తుంది, కనిపిస్తుంది. భూగోళం పైన లేని దేశం గురించి ఎట్లా ప్రస్థావించారు. ఏడవ శతాబ్దంలో బౌద్ధం టిబెట్ కిచేరింది. అయితే అంతకు ముందే టిబెటన్లకు శంబల తెలుసు. శంబల అంటే వజ్ర వైఢూర్య (కాంజూర్, టాంజూర్) శోభితం అని అర్థం. The Route of Shambala, The Sphere of Shambala అనే గ్రంధాలలో శంబల ప్రస్తావన చాలానే ఉంది. మహాయాన బౌద్ధంలో శంబల కనిపిస్తుంది. 'చాంగ్ భలా - చాంగ్ శంబల' అన్నది అంత సులభమైన వ్యవహారం అనిపించదు.

చాలా సత్యాలను కాలం చరిత్ర పుటల్లో దాచి పెట్టింది అనడం కంటే పరమ సత్యాలు కొన్ని వెలుగులోకి రాలేదు అనడం భావ్యం. అందరికీ అన్నీ తెలియవు. తెలిసే అవకాశం ఉండదు. తెలుసుకొనే ప్రయత్నం చేయరు. మేరు పర్వత ప్రాంతంలో మహర్షులు ఇప్పటికీ ఉంటారన్న నమ్మకం మనకుంది. అది కేవలం విశ్వాసం కాదు, నిజం. పర్వత గుహల్లో మహర్షులు వేల సంవత్సరాలు గా తపస్సు చేస్తుంటారని మన నమ్మకం. ఆనాటి జ్ఞానులే నేటి పరమ గురువులు. వారే మాస్టర్లు. వారంతా అమృత మూర్తులు. మహా యోగులు. గ్రీస్, రోమ్ చరిత్రకారులకు ఈ తత్వవేత్తల గురించి ఎప్పటి నుండో తెలుసు.

ఆ కాలంలోనే పైథాగరస్ భారతదేశం వచ్చి వెళ్లాడు. అపోలోనియన్ హిమాలయాలు దాటి వెళ్లి టిబెట్ దర్శించినట్లు ఫిలో స్ట్రాటస్ వర్ణించాడు. ఆనాడే పైధాగరస్ కి, అపోలోనియన్ కి మన మహర్షుల గురించి తెలుసు. మన సనాతన విజ్ఞానం, అతీంద్రియ శక్తులు వారిని ఆకర్షించాయి. అలరించాయి. సిద్ధ పురుషులు, సిద్ధయోగులు జనబాహు ళ్యానికి అందనంత ఎత్తులో, అందనంత దూరంగా ఉంటారు. మహర్షులు, పరమ గురువులు, మహాయోగుల రహస్యాలు తెలియాలంటే పవిత్ర జీవనం అవసరం. తపస్సు అవసరం. మొత్తం మీద విశ్వ విజ్ఞానం మహర్షుల అధీనంలో ఉంటుందన్నది నిర్వివాదాంశం. అలాంటి వారు ఉండేది శంబలలో అన్నది చెరగని సత్యం.

మాడం బ్లవట్ స్కీ తన దివ్యదృష్టితో గత చరిత్రను తవ్వి తీసింది. కాలగర్భంలో కలిసి కరిగిపోయిన సంఘటనల్ని ఆమె దివ్యదృష్టితో చూడగలిగింది. శిధిలమైన చరిత్రనే కాదు. ఆకాశపుటంచుల్లో దాగిన రహస్యాలను అతీంద్రియ శక్తితో అందుకో గలిగింది. మహాభారతం లాంటి కధ ఇలియడ్, కురుక్షేత్ర సంగ్రామం లాంటిది ట్రాయ్ సంగ్రామం. ట్రాయ్ నగరం చుట్టూ అల్లుకున్న కధల్ని కొట్టి పారేయలేం. స్కిల్మన్ అనే పురాతత్వవేత్త ట్రాయ్ ఒకటి కాదు ..తొమ్మిది ట్రాయ్ లు ఉన్నాయన్నాడు. భూమిలో పూడుకు పోయిన అలనాటి ఆభరణాలను బైటకు తవ్వి తీసి ట్రాయ్ యదార్ధతను నిరూపించగలిగాడు. ట్రాయ్ నుండి గ్రీస్ వరకు త్రవ్వకాలు జరిపాడు. పరిశోధనా! మజాకా!

మన ఇతిహాసాలలోని ద్వారక, అయోధ్య హస్తినాపురం ఉన్నట్లే క్రీస్తు పురాణంలోని ఆడం, ఈవ్ లు ఉండేవారా? ఎవరూ నిరూపించలేని సత్యం. విశ్వాసానికి మాత్రమే అందే నిజం. అలాంటిదే శంబల. చైనా ప్రాచీన గాధల ప్రకారం ‘ను-కు' అనే వారు ఆది దంపతులు. అంటే వారి ఆడం ఈవ్ లు. వారి స్థావరం 'కులు' పర్వత ప్రాంతం. కులు పర్వతశ్రేణి మధ్య ఆసియాలోని నిర్జన ప్రాంతం. పైగా అది భయంకరమైన ఎడారి (గోబీ). ఆ ఎడారి చైనా వారి స్వర్గం (Garden of Eden). ఎడారి ప్రాంతం స్వర్గధామం కావడం ఏమిటి? అది నందనవనం కావడం ఏమిటి? అదే శంబల రహస్యం. ఒకప్పటి ఎడారి ప్రాంతం క్రమేణా సుక్షేత్రం అయి ఉండవచ్చు. అంచేత 'యంగ్ ట్సే ' ప్రాంతాన్ని తొలి మానవ నివాసం అంటారు చైనీయులు.

కులు పర్వతశ్రేణులు చాలా ఎత్తు. మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ ప్రవహించేవి హిమానీనదాలు. అక్కడ దేవతలు ఉంటారని చైనీయుల నమ్మకం. మనుషుల సంచారం లేని తావులే దేవతల ఆవాసాలు. అది శంబల ప్రాంతం.

సీవాంగ్యు రాజభవనం తొమ్మిది అంతస్తుల భవంతి. గోడలు వజ్రాలతో రత్నాలతో పొదగబడ్డాయి. ఆ భవనం చుట్టూ సుందరమైన ఉద్యానవనాలు ఉండేవి. ఆ వనంలో ఒక కల్పవృక్షం ఉండేది. ఆ చెట్టుకు ఆరువేల సంవత్స రాలకు ఒక పూవు పూస్తుంది. మహర్షులై న వారికి మాత్రమే ఆ చెట్టు ఫలాలు లభిస్తాయి. ఆ పళ్లు తిన్నవారు నిత్య యవ్వనంగా ఉండి మృత్యువును జయిస్తారని ప్రతీతి.

అటువంటి కధలకు మన దేశంలో కరువు లేదు. అన్ని దేశాల నమ్మకాలు అలాగే ఉంటాయి. అన్ని పురాణాల ప్రయోజనా లు ఒక్కటే. చైనా, జపాన్ వారి నమ్మకం ప్రకారం అక్కడెక్కడో ఒక అద్భుతమైన లోయ ఉంది. అది దేవ లోకం లాంటిది. మన స్వర్గం లాంటిది. అక్కడకు వెళ్లగలిగి న వారికి పునర్జన్మ ఉండదు. నిర్వాణం చెందుతారని బౌద్ధుల నమ్మకం. వారి దేవత పేరు 'కురన్ ఇన్'. ఆ దేవతకు వేయి కళ్లు. వేయి కళ్లతో తన వారిని కాపాడుతుందని నమ్మిక. ఆ దేవతను బౌద్ధులు 'అవలోకతేశ్వరుని' సహచరిగా భావిస్తారు.

‘ఓం మణి పద్మేహం' అనే ప్రార్థనను అందించినవారు అవలోకతేశ్వరుడు. (విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం సృష్టించినట్లు). టిబెట్ లో, నేపాల్లోనూ ఆ దేవతను 'తారాదేవి'గా ఆరాధిస్తారు. 'సీవాంగ్యు' పరిజనం మృత్యుంజయులు. వారికి జరా, మృత్యు బాధలుండవు. వారెవరూ ముసలివారు కారు, మరణించరు. వారంతా 'తారాదేవి' కి సహకరిస్తుంటారు.వీరంతా అమరులు (మరణం లేనివారు), మృత్యుంజయులు. వీరు ఒక చోటు నుండి మరొక చోటుకు సంకల్ప మాత్రం చేత ప్రయాణం చేస్తారు (సంకల్ప సిద్ధులు). అన్ని లోకాలు సంచరిస్తారు. అన్ని గ్రహాలకు, నక్షత్రాలకు పోతుంటారు. వీరు 'గోబీ' ఎడారి ప్రాంతంలో ఉంటారని రష్యన్ల నమ్మకం (అక్కడకు వెళ్లి విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనం చేసిన బ్లవట్ స్కీ, రోరిక్ ఇద్దరూ రష్యన్ లే). అది పౌరాణికంగా శ్వేత దీపం. చుట్టూ మంచు పర్వతాలు, నడుమ ద్వీపంలా ఉన్నదని భావం. కులు ప్రాంత వాసులు మనుషుల్లాగా కనిపిస్తారు గాని వారి శరీరాలు రక్త మాంస నిర్మితం కాదు. గాలి ఘనీభవించి మానవ రూపం ధరించినట్లు అనిపిస్తుంది. గాలిలో దయ్యాల్లా తేలి పోతుంటారు. వీరు నిజానికి యాస్ట్రల్ జీవులు. వీరు ఇష్టపడే ప్రాంతం మానస సరోవరం. మానస సరోవరంలో ప్రతి పున్నమికి దేవతలు స్నానం చేయడానికి వస్తుంటారని వారి నమ్మకం.

చైనా వారు మావోయిస్టులు కాకముందు అందరూ టావోయిస్టులే. వారి దృష్టిలో 'టెబు' ప్రాంతం ప్రపంచం మొత్తం మీద అత్యంత సుందరం. టెక్ వన్ - టిబెట్ల మధ్య ప్రాంతం చక్కగా సారవంతమైనది. జలపాతాలు హిమానీనదాలు, మంచు కప్పిన పర్వతాలు. అది దేవతలు, మానవులు ఇష్టపడి కలుసుకునే తావు. అక్కడి వారికి అటు స్వర్గం, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచం సమానమని అర్థం చేసుకోవచ్చు. అన్ని సుఖాలను అనుభవిస్తూనే దైవత్వం సంపాదిస్తారు.

ఆ రహస్య ప్రదేశం పేరు శంబల. అక్కడ ఉండే వారంతా ఒకప్పుడు మన ప్రాంతాల్లో మనుషులుగా జీవించినవారే. తపస్సుతో పండి, యోగంతో పునీతులై, దివ్యత్వం నింపుకుని, అమరత్వం సాధించినవారు మరణాన్ని జయించిన వారంతా అక్కడికి చేరుతుంటారని చైనా వారి విశ్వాసం. వారి విశ్వాసం ఈ మధ్య బీటలు వారింది. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, దివ్యజ్ఞానులు శ్రమల కోర్చి టిబెట్ వెళ్లి లామాలను కలుసుకుని శంబల రహస్యాలు బయటి ప్రపంచానికి తెలియచేస్తున్నారు. 

శంబల అందరిది. ప్రపంచంలోని ఏ దేశం వారైనా యోగులైతే, ధ్యానులైతే అక్కడికి చేరే అవకాశం ఉంది. శంబల గురించి తెలుసుకునే అర్హత ఉంటుంది. శంబల గురించి తెలుసుకోవడమే ఒక యోగం - ఆలోచించడం ఒక ప్రయోగం. అర్హులు కావడం పురాసుకృతం.
🪷
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*

No comments:

Post a Comment