☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
41. ప్రేష్ఠము ప్రియాణాం స్తుహి
ప్రియమైన వాటిలోకెల్లా ప్రియమైన వానిని స్తోత్రించు(ఋగ్వేదం)
ఋగ్వేదంలో భక్తిభావం పల్లవించే మంత్రాలలో ఇది ఒకటి. భాగవతాది
పురాణేతిహాసాలలో విస్తృతంగా ప్రతిపాదింపబడిన భాగవతధర్మం ఇందులో చెప్పబడింది.
'సాత్వస్మిన్ పరమ ప్రేమరూపా' - పరమాత్మునియందు పరమమైన ప్రేమయే భక్తి- అని నారదుడు నిర్వచించాడు.
'సా పరానురక్తిరీశ్వరే' - అని కూడా పూర్వాచార్యుల నిర్వచనం. పరమమైన అనురక్తి భక్తిగా చెప్పబడింది.
(బుద్ధికి సంబంధించినది జ్ఞానం. హృదయానికి సంబంధించినది ప్రేమ.
హృదయం అనుభవస్థానం. అదంతా ప్రేమమయమైతే జ్ఞానం కూడా
ప్రేమాన్వితమౌతుంది. భాగవతధర్మం అంతా ఈ జ్ఞాన-ప్రేమల
సమన్వయాన్నేబోధిస్తుంది.ధార్మికమైన నిబద్ధత బలపడాలంటే భక్తి
అనేది సహజమైన స్థితిని ఇస్తుంది.)
"అత్యంత ప్రియమైన విషయంగా పరమాత్మను భావించి, మనసా ధ్యానించడం,నోరారా కీర్తించడం, కర్మణా సర్వం సమర్పించడం - అనేది పై వేదవాక్యంలోని విషయం.
“యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయినీ"-
- అంటూ ప్రహ్లాదుడు, “అవివేకులకు అల్పమైన విషయాలపై ఎటువంటి ప్రీతి ఉంటుందో, భక్తులకు (వివేకవంతులకు ) భగవంతునిపై అటువంటి ప్రేమ ఉంటుంది”
అని ప్రతిపాదించాడు.
“పరమప్రేమ” - అనే మాటలోనే అందమంతా ఉంది.
భగవంతుని పట్ల అటువంటి 'ప్రేమ' అనేది కలిగి ఉంటే అతడి జీవితమే
ధన్యమౌతుంది.
ప్రేమను మాత్రమే కోరుతాడు భక్తుడు. ఏ ప్రేమను భగవంతునిపై పూని ఉన్నాడో దానిని కీర్తన ద్వారా, అర్చన ద్వారా, ధ్యానం ద్వారా వ్యక్తీకరిస్తూ నిరంతరం భగవదనుభవంలో మత్తుడై ఉంటాడు.
స్వచ్ఛం, సత్యం, ధర్మం, ప్రేమ - మూర్తీభవించిన భగవంతుని ప్రేమించగానే,ఆయనకు ఇష్టంగా ఆ గుణాలనే ఆచరిస్తాడు భక్తుడు. భగవంతుడు ధర్మప్రియుడు
గనుక భక్తుడు ధర్మాన్ని తప్పుడు, సత్యాన్ని వీడడు. లోభం, స్వార్థం దరిజేరనీయడు.సాత్త్వికమైన ప్రవృత్తి వృద్ధి చెందుతుంది. ప్రపంచాన్నే ప్రేమభావంతో దర్శిస్తాడు.
ప్రియమైన భగవంతుని ఆ విధంగా ప్రేమించేవాడు భగవంతునికే
ప్రియు(ప్రీతిపాత్రు)డౌతాడు.
యో మద్భక్తః స మే ప్రియః
అని గీతాచార్యుని వచనం.
బుద్ధికి సంబంధించినది జ్ఞానం. హృదయానికి సంబంధించినది ప్రేమ. హృదయం అనుభవస్థానం. అదంతా ప్రేమమయమైతే జ్ఞానం కూడా ప్రేమాన్వితమౌతుంది.
భాగవతధర్మం అంతా ఈ జ్ఞాన - ప్రేమల సమన్వయాన్నే బోధిస్తుంది. ధార్మికమైన నిబద్ధత బలపడాలంటే భక్తి అనేది సహజమైన స్థితిని ఇస్తుంది.
నిజానికి మన వైదిక సనాతనధర్మమంతా యజ్ఞయాగాది క్రతువులు వంటివి విలుప్తమైనా ఇంకా భావధారగా బలపడిందీ అంటే ఈ భక్తిభావన అనేది పరమాదర్శంగా ప్రస్తావించడం చేతనే.
ఇప్పటికీ మన సంస్కృతిలో స్ఫూర్తినిచ్చిన మహాత్ములంతా పరమభక్తులు.ఆదిశంకరులు, రామానుజులు, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద, అన్నమయ్య,త్యాగరాజు మొదలైన వారంతా ఈ భక్తి భావనకి పరమస్ఫూర్తిగా సాక్షాత్కరిస్తారు.
వ్యక్తి అధర్మాచరణకు దూరం కావాలన్నా, ధర్మంపై బలంగా నిలబడాలన్నా, సమస్త జనుల పట్ల సామరస్య ధోరణితో ప్రవర్తించాలన్నా అందుకు భగవద్భక్తి దోహద
పడినట్లుగా మరేదీ పనిచేయలేదు. ఇది చరిత్ర నిరూపిస్తున్న సత్యం. ఇది భక్తి వల్ల కలిగే సామాజిక ప్రయోజనం. భక్తి వ్యక్తికి ఇచ్చే పరమ ప్రయోజనం దివ్యమైన బ్రహ్మానందమైతే, అది సమాజానికి చేకూర్చే ప్రయోజనం ధార్మికమైన శాంతికి హేతువౌతుంది.
ఆదర్శంలో జన్మ పరిపూర్ణతనంతటినీ అనుయాయులుఅందుకోలేకపోయినాఅది మనస్సును హెచ్చరిస్తూ, అధర్మం వైపు మళ్ళకుండా కాపాడుతుంది.
చివరకు మన దేశపు విద్యలు మిగిలి ఉన్నది కూడా భక్తి యొక్క స్పర్శచేతనే.వైద్య, గణితాదులు కూడా భగవత్ శక్తిగా భావించి ఆ శాస్త్రవేత్తలు భగవదర్పణ బుద్ధితోనే కొనసాగించారు. ఆశ్చర్యకరమైన ప్రతిభతో దీవించే విద్యలన్నీ 'సంగీత
జ్ఞానము భక్తి వినా...' అన్నట్లుగా భక్తితో పరిపుష్ఠమై మనకు మిగిలి ఉన్నాయి.
ఈ కారణం చేతనే మన విద్యలు, ధర్మాలు, జీవనవిధానం పవిత్రతను
సంతరించుకున్నాయి.
స్వార్థరహితమైన భగవత్ ప్రేమను పరమమైన ఆదర్శంగా భావించడం వ్యక్తిని పునీతుని చేసి, ఆ వ్యక్తి యొక్క ప్రభావంచే సమాజానికి ఒక పవిత్రత చేకూరుతుంది.
No comments:
Post a Comment