☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
46. మర్తా అమర్తస్య తే భూరి నామ మనామహే
నాశన రహితుడవైన నీ మహిమాన్విత నామాలను మేము శ్రద్ధతో జపించుతాం,కీర్తించుతాము (ఋగ్వేదం)
భగవన్నామాలలో ఎంతో శక్తి దాగి ఉంది. అందుకే నామస్మరణకు ప్రాధాన్యం..
'నామస్మరణాధన్యోపాయం నహిపశ్యామో భవతరణే॥'
మోక్షానికి నామస్మరణకన్నా గొప్ప ఉపాయం లేదు. నామంలో భగవంతుని గుణ, మహిమ, తత్త్వాలు దాగి ఉంటాయి. అందువల్ల స్మరించిన వెంటనే స్వామి భావన మనస్సులో స్ఫురించి ఆనందమయం అవుతుంది. ఇది 'అర్ధ' పరమైన శక్తి.
ఇదేకాక 'శబ్ద పరమైన శక్తికూడా మంత్రంలో దాగి ఉంటుంది. ఒకొక్క పేరులోనున్న అక్షరాల కూర్పులో ఉత్పన్నమయ్యే శబ్దం అద్భుతమైన దేవతా చైతన్యాన్ని జాగృతం
చేస్తుంది. ఆ కారణంగానే నామోచ్చారణ మనలో దివ్యశక్తుల్ని మేల్కొలిపి పాపాలను పోగొట్టి, చిత్తాన్ని శుద్ధం చేసి భక్తినీ, జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది.
నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిః
తత్రార్వితానియమితా స్మరణేన కాలః॥
“కృష్ణా! అనేక నామాలను ఏర్పరచి, అందులో నీ సర్వశక్తులు ఉంచావు. వాటిని స్మరించడానికి నియమాలేవీ అవసరంలేదు. అటువంటిది నీ కృప!" - అని చైతన్య మహాప్రభువు కీర్తించాడు.
ఒకొక్క నామంలో శక్తినీ, మాధుర్యాన్నీ భక్తుడు ఎప్పుడూఅనుభవిస్తుంటాడు.
అందుకే “శ్రీరామా! నీ నామమేమి రుచిరా!" అని తన్మయుడయ్యాడు భక్తరామదాసు.
“దధి నవనీత క్షీరములు రుచో!
దాశరథీ ధ్యాన సుధారసము రుచో-నిజముగ బల్కు మనసా!” అని పరవశించి రామనామ కీర్తనలో ధన్యుడయ్యాడు త్యాగరాజస్వామి.
'శివనామతరీం ప్రాప్య
సంసారాబ్ధిం తరంతి తే' - 'శివ' నామమనే నావ దొరికితే సంసార సముద్రాన్ని సులభంగా దాటగలం- అని పురాణం చెస్తోంది. శివ, విష్ణు, రామ, కృష్ణ, దేవీ...నామాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నీ ఒకే పరమాత్మ యొక్క పలువైభవాలను
తెలియజేసేవే. ప్రతిదీ శక్తిమంతమైనదే. అవి 'భూరి' నామాలు. అనంతనామాలు.
నామస్మరణ అనేది భక్తి మార్గంలో పురాణాల్లో చెప్పారు గానీ వేదాలలో ఆ ప్రసక్తి లేదు అనేవారు ఉన్నారు. కానీ వారు సరిగ్గా వేదాల్ని పరిశీలించక సనాతన వైదిక
ధర్మాన్ని విభజించే ప్రయత్నంలో అంటున్న మాటలివి.
వేదాలలోనే భగవద్భక్తి, నామస్మరణ మహిమ అనేకచోట్లప్రస్తావించబడింది.
అనడానికి ఇలాంటి ప్రమాణ వాక్యాలు కోకొల్లలు.
'శివేన వచసాత్వా గిరిశాచ్ఛ వదామసి"
-
స్వామీ! శుభంకరమైన శబ్దాలతో నిన్ను పలుకుతాము - అని యజుర్వేదం చెస్తోంది.
రామ నామమనే మణిదీపం, నాలుక అనే గడప మీద ఉంటే లోపలి, వెలుపలి చీకట్లు తొలగుతాయి... అని తులసీదాసు కీర్తించాడు.
'ప్రేమ ముప్పిరి గొను వేళ నామము పలికేవారు. ఎందరో మహానుభావులు'-
అని త్యాగరాజుగారి వచనం. “చాలదా హరినామ సౌఖ్యామృతము మనకు" అని కీర్తించిన అన్నమాచార్య ఆ నామసంకీర్తన మార్గంలోనే తరించాడు.
ప్రేమతో నామ సంకీర్తన చేసి పరవశించడం ఒక పుణ్యవిశేషం. భగవంతుని నామం వినగానే పులకించి, భగవదనుభూతిలో లీనమవడమే భక్తి - అని రామకృష్ణ
పరమహంస వాక్కు
అయితే అలా నామం పట్ల ప్రేమ కలిగే పుణ్యం రావాలంటే పాపాలు తొలగాలి.ఆ పాపాలను తొలగించాలన్నా నామమే దిక్కు, ముందు స్మరించడం, కీర్తించడం
అలవాటైతే క్రమంగా చిత్తం శుద్ధమై ప్రేమగా స్మరించడం, తన్మయమవడం
సాధ్యమవుతుంది. ఆ స్థితి మోక్షం కన్నా గొప్పదిగా భావిస్తాడు భక్తుడు.
నామ మాధుర్యాన్ని అనుభవించడం కన్నా భాగ్యం ఏముంటుంది!
No comments:
Post a Comment