☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
49. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి
నన్ను సర్వభూతములకు స్నేహితునిగా గ్రహించువాడు శాంతిని
పొందుతున్నాడు(భగవద్గీత)
దీనిని అర్థం చేసుకుంటే పై ఆప్తవాక్యంలోని 'మధురిమ' అనుభూతికి లభిస్తుంది.
భగవంతునికి మించిన స్నేహితుడు లేడు. మన దేహంకన్నా మనకు దగ్గరున్నవాడు దైవమే. అతి దగ్గరున్న దానిని గుర్తించడం కష్టమే.
మనల్ని నిత్యం కనిపెట్టుకొనే ఆత్మబంధువు ఆ సర్వేశ్వరుడొక్కడే. జన్మలు దాటుతున్నా జీవుని వదలని బంధం భగవంతునిదే. ఈ సత్యం గుర్తించక మథన పడుతుంటారు.
స్నేహితుడు ఏది చేసినా మన క్షేమం కోసమేనన్న నమ్మకం ఉన్నప్పుడు నిబ్బరంగా ఉంటాం. అందునా, సామాన్య మిత్రుడా ఆయన! మన ముందు వెనుకలు తెలిసినవాడు!
గతాగతాలు ఎరిగినవాడు! మనకన్నా మనగురించి స్పష్టంగా తెలుసుకున్నవాడు!
ఏ ఒక్కరికో మాత్రమే స్నేహితుడు కాదు. “సర్వభూతానాం సుహృత్” సర్వప్రాణి కోటికీ మిత్రుడే! ఆ నిత్య నేస్తాన్ని గుర్తించేవాడు భక్తుడు.
అతనికి జగమంతా భగవంతుని స్నేహమే కనిపిస్తుంది. కష్టమూ, సుఖమూ కూడా ఆ జగన్నియామకుని అనుగ్రహంగా అనుభవానికి వస్తుంది! అందుకే అతనికి అనుక్షణం ఆనందమే.
భగవంతుని స్నేహాన్ని గుర్తించేవాడు మాత్రమే శాంతిని పొందుతాడు. ఆ పరమేశ్వరుని నెయ్యాన్ని “పొందడం” కాదు- “గుర్తించడం”. ఆ గుర్తింపే శాంతి సాధనం.
నదిలో ఎన్నో పడవలు వెళుతుంటాయి. గాలి వీస్తూ ఉంటుంది. కానీ తెరచాప ఎత్తిన పడవ మాత్రమే గాలిని గ్రహించి పయనిస్తుంది. తలుపు తెరచిన వానికే
వెలుగు పలకరింపు దక్కుతుంది. కన్ను మూసుకున్నవాడు కాంతి కనికరించలేదని నిందించడం తగదు కదా!
ఈ గుర్తింపు పొందాలంటే ఏం చెయ్యాలి?
అహంకార త్యాగం, సర్వసమర్పణా భావం ఉండాలి. అందుకే ఈ వాక్యానికి ముందు “భోక్తారం యజ్ఞతపసా సర్వలోక మహేశ్వరమ్" అని సెలవిచ్చాడు జగదాచార్యుడు. మన కర్మలు యజ్ఞం, తపస్సు కావాలి. యజ్ఞం అంటే భగవదారాధన.
తపస్సు అంటే జ్ఞానసాధన. ఈ రెండిటిగా మన కర్మలు మారాలి. మనం చేసే పని విధ్యుక్త ధర్మమై భగవదర్పణం కావాలి. నిరంతర చింతనతో సాధన సాగాలి. ఈ
కర్మలను గ్రహించేవాడు భగవానుడేనని గమనిక ఉండాలి. ఆ భగవానుడు సామాన్యుడు
కాదు- సర్వలోక మహేశ్వరుడు. విశ్వాన్ని అంతటినీ శాసించగలడు. విశ్వమంతా వ్యాపించిన ప్రభువు. కనుక ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనల్ని గమనించే మనవాడు.
ఈ ఎరుకను పొందడమే - భగవానుని ప్రేమను గుర్తించడం. ఈ విశ్వమంతా ఆ ప్రేమ మాధుర్యం పొంగిపొరలుతోంది. ఉదయం, సాయంత్రం, ఎండా, వెన్నెలా,
వానా, చెట్టూ, పుట్టా, గాలీ, ఏరూ, నదీ, సముద్రం, కొండా, కోనా అంతా ఆ ప్రేమమయుని అనుగ్రహ మాధురి ప్రవహిస్తోంది.
ఆ మాధుర్యాన్ని అనుభవించమని ప్రబోధిస్తోంది ఈశ్వరవాణి అయిన వేదనాదం.
జగమంతా ప్రేమనీ, మాధుర్యాన్నీ సందర్శించే సంస్కారాన్ని అలవరచుకుంటే ద్వేషపు జాడలుండవు. వైషమ్యాల నీలినీడలు కానరావు. మనలోకూడా ఆ ప్రేమ
ఉజ్వలమవుతుంది. ప్రపంచంపై ప్రసరిస్తుంది. ఆ ప్రేమను సాధించాలి.
ప్రపంచాన్ని ప్రేమమయంగా దర్శించాలనే సవ్యమైన ధోరణిని(positive approach) బోధిస్తోంది వేదం. విపరీత వైఖరులను(negative attitudes)
కొనసాగించే వానికి విశ్వంలోని ప్రేమ మాధురి అస్వాదనకి అందదు.
No comments:
Post a Comment