Tuesday, December 17, 2024

 *దురాశకు దూరం జరుగు (సహరి అతర్జాల పత్రికలో వచ్చిన కథ)*
డా.ఎమ్.హరికిషన్-9441032212-కర్నూలు
*****************************
ఒక ఊరిలో ఇద్దరు ధనవంతులైన అన్నదమ్ములు వుండేవాళ్ళు. వాళ్ళలో అన్న చానా మంచోడు. తెలివైనవాడు. నిజాయితీ పరుడు. పదిమందికి మంచి చేయాలి, సాయపడాలి, పైకి తేవాలి అనుకునేవాడు. తమ్ముడు అలా కాదు. విపరీతమైన ఆశ. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి అనుకునేవాడు. ఇద్దరి ఇళ్ళు పక్కపక్కనే వుండేవి.
వాళ్ళకు ఒక పెద్ద మామిడి తోట వుంది. ఒకసారి పళ్ళు ఎలా కాసినాయో చూద్దామని ఇద్దరూ తోటకు పోయారు. మంచిగా కాసిన పళ్ళను చూసుకుంటూ పోతావుంటే... దారిలో ఒక చోట కాలికి ఏదో తగిలింది. ఏందబ్బా అని చూస్తే భూమిలో తళతళా మెరుస్తా పై భాగం కనబడింది. తవ్వి చూస్తే ఇంకేముంది. ఒక పెద్ద ఇత్తడి బిందె బైట పడింది. దానిలో ఒక రాగి రేకు వుంది. ఆ రాగి రేకు మీద “ఇది అలాంటిలాంటి మామూలు బిందె గాదు. మాయా బిందె. ఇందులో ఏది వేసినా వంద రెట్లు అవుతాయి" అని వుంది.
అన్న ఆశ్చర్యపోతూ అది నిజమా కాదా అని పరీక్షించాలనుకొని ఒక కమ్మని మాగిన మామిడి పండు తెంపి ఆ బిందెలో వేశాడు. అంతే... మరుక్షణంలో అందులోనుంచి వంద మామిడి పండ్లు జలజలజల రాలి కిందబడ్డాయి. అది చూసి తమ్ముడు సంబరంగా “ఇదేదో భలేగుందే. మనింట్లో వున్న బంగారమంతా ఇందులో వేస్తే... ఇళ్ళంతా బంగారంతో నిండి పోతుంది. రాత్రికి రాత్రి అందరికన్నా ధనవంతులుగా మారిపోవచ్చు" అన్నాడు.
ఆ మాటలకు అన్న చిరునవ్వు నవ్వి "చూడు తమ్ముడూ... ఆశ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే, దురాశ పాతాళానికి నెట్టేస్తుంది. ఇప్పటికే మనకు తిండికి, బట్టకు ఎటువంటి లోటు లేదు. నాలుగు తరాలు కాలు మీద కాలేసుకొని తిన్నా తరగనంత సంపద వుంది. కష్టపడకుండా వచ్చింది మనకెందుకు. కాబట్టి ఊరిలో ఒక ఉచిత భోజనశాల తెరుద్దాం. ఇందులోంచి రకరకాల రుచికరమైన ఆహారపదార్థాలు తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ కమ్మగా కడుపునిండా పెడదాం" అని చెప్పాడు.
తమ్ముడు అన్న మాటకు ఎదురు చెప్పలేక అప్పటికి 'సరే' అన్నాడు. కానీ వాని మనసంతా ఆ మాయాబిందె చుట్టూనే తిరగసాగింది.
“మా అన్న పెద్ద పిచ్చోడు. గడ్డివాము దగ్గరి కుక్క తాను తినదు. ఇతరులను తిననీయదు. బంగారంలాంటి అవకాశం చిక్కితే పది తరాలకు సరిపోయేటట్లు సంపాదించక దానాలు, ధర్మాలు అంటూ తిక్క తిక్క మాటలు మాట్లాడుతున్నాడు. వీడు ఎప్పటికీ బాగుపడడు" అనుకొని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక నెమ్మదిగా నిద్రలేచి అన్న ఇంట్లోకి దూరాడు. దేవుని గదిలో వున్న ఇత్తడి బిందెను మట్టసంగా చప్పుడు చేయకుండా తనింట్లోకి ఎత్తుకొచ్చాడు. తనకు కావలసినంత సంపాదించి పొద్దున ఎవరూ లేవకముందే ఆ బిందెను తీసుకొని పోయి మరలా ఎక్కడిదక్కడ పెట్టేయాలి అనుకున్నాడు.
ఇంట్లో చాలా విలువైన వజ్రాల హారం ఒకటి వుంది. దాన్ని బిందెలో వేస్తే వంద హారాలు బైటకు వస్తాయి. వాటిని అమ్మితే మొత్తం ఆ ఊరినే కొనేయ్యొచ్చు అనుకున్నాడు. సంబరంగా హారం కోసం ఇనుప బీరువా తెరిచాడు. అందులో ఒక ఎలుక వుంది. తలుపు తెరిచేసరికి అది అదిరిపడి బైటకు పరిగెత్తింది. ఆ కంగారులో అది ఇనుప బీరువా మీది నుంచి కాలు జారి సక్కగా పోయి కిందవున్న ఇత్తడి బిందెలో పడింది.
అంతే... ఇంకేముంది. ఒక్క ఎలుక కాస్తా వంద ఎలుకలుగా మారిపోయాయి. అవి ఒకదాని మీదకు మరొకటి ఎక్కుతా బిందెలోంచి బైటకు వచ్చేటప్పుడు కొన్ని కాలు జారి మరలా బిందెలో పడిపోసాగాయి. అలా పడిన వెంటనే కొత్తగా మరలా వంద ఎలుకలు తయారు కాసాగాయి. చూస్తుండగానే ఒకటి కాస్తా వందలు వేలయిపోయాయి. ఇళ్ళంతా ఎలుకలతో నిండిపోసాగింది. అవి దొరికిందాన్ని దొరికినట్లు కరకరకర కొరికి ముక్కలు చేయసాగాయి. మంచాలు, దుప్పట్లు, బట్టలు, నగలు, ధాన్యం బస్తాలు, అఖరికి ఇంటి తలుపులు, కిటికీలు, స్తంభాలు అన్నీ పిండి పిండి కాసాగాయి.
అంతటితో అవి ఆగలేదు. చుట్టుపక్కల ఇళ్ళ మీదకు గూడా దాడి చేశాయి. చూస్తుండగానే ఆ వీధంతా నిండిపోసాగాయి. చిన్నోనికి ఏమి చేయాలో తోచక లబోదిబోమంటూ కట్టుబట్టలతో వీధిలోకి వచ్చాడు. ఊరి వాళ్ళు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చినందుకు కోపంతో చిన్నోన్ని పట్టుకొని కిందామీద యేసి చావగొట్టి గుంజకు కట్టేశారు.
అది చూసి పెద్దోడు ఎలా ఈ ఆపద నుంచి చిన్నోన్ని, ఊరిని కాపాడాల అని తెగ ఆలోచించాడు. అలా ఆలోచిస్తావుంటే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఒక పిల్లిని పట్టుకొని చిన్నోని ఇంట్లోకి దూరాడు. పరుగెత్తుకొని పోయి ఆ ఇత్తడి బిందెలో పిల్లిని వేశాడు. వెంటనే పిల్లులు ఒకటి పోయి వందయినాయి. వెంటనే ఆ ఇత్తడి బిందెను బోర్లా పెట్టేశాడు. పిల్లులు ఎగిరి ఎలుకల మీదకు దుంకాయి.
దొరికిందాన్ని దొరికినట్లు పట్టుకొని టకటకటక తినేయసాగాయి. కొద్ది గంటలు గడిచేసరికి వీధిలోని ఎలుకలన్నీ అయిపోయాయి. పిల్లులు తినీ తినీ కడుపులు లావయి కదలకుండా ఎక్కడివక్కడ పడిపోయాయి. వాటిని పట్టుకొని ఊరికి దూరంగా వున్న అడవిలో వదిలేశాడు.
ఇంట్లో వుండే బంగారు వరహాలు తీసుకొచ్చి ఆ బిందెలో పోశాడు. వెంటనే జలజల రాలుతూ పెద్ద కుప్ప అయ్యాయి. అవన్నీ తీసుకుపోయి చుట్టుపక్కల నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చి తమ్మున్ని విడిపించాడు.
ఈ మొత్తం సమస్యకు కారణమయిన ఆ ఇత్తడి బిందెను తీసుకొని ముక్కలు ముక్కలు చేసి తలా ఒక దిక్కు విసిరి పడేశాడు.
****************************
డా.ఎమ్.హరికిషన్-9441032212-కర్నూలు
*****************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment