Wednesday, December 11, 2024

సర్వ ఏకాదశి, గీతా జయంతి

*సర్వ ఏకాదశి, గీతా జయంతి*

*తస్మాత్ ధర్మమయీ గీతా* *సర్వజ్ఞాన ప్రయోజికా* *సర్వశాస్త్ర సారభూతా*
*విశుద్ధాస విశిష్యతే.*

బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైనా. ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు. నీతికథలు చెబుతాడు. ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు. తన అనుభవాలనూ వివరిస్తాడు. కొన్నిసార్లు అలతి పదాలతో, కొన్నిసార్లు కఠిన వాక్యాలతో, కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు. అరుదుగా, ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు. పరమాత్మ ప్రయత్నమూ అలాంటిదే. భగవద్గీత ...ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు . ఈ రోజు గీతా జయంతి...

ధర్మ సంస్థాపన పూర్తయింది. సంభవ లక్ష్యం నెరవేరింది. కలియుగాంతం ఆరంభమైంది. కృష్ణావతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైంది. ఆలమందలతో, అగడ్తలతో అలరారే ద్వారకను సంక్షోభాలు చుట్టుముట్టాయి. కొద్దిరోజుల్లో ఆ మహానగరాన్ని జలప్రళయం ముంచేయడం ఖాయమని స్పష్టమైపోయింది. పౌరజనమంతా ప్రభాసతీర్థానికి తరలివెళ్లాలని ఆదేశించాడు కృష్ణుడు. ఆ పరిస్థితులు అతని మిత్రుడూ, ఆంతరంగికుడూ అయిన ఉద్దవుడిని కలవరపరిచాయి. తనకు కర్తవ్యబోధ చేయమంటూ సజల నేత్రాలతో పరమాత్మను వేడుకున్నాడు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కృష్ణుడు తన బాల్య స్నేహితుడి విన్నపాన్ని కాదనలేకపోయాడు. బేలతనం మనిషి సహజ గుణమే కాదంటూ నేస్తానికి ధైర్యం చెప్పాడండి నేర్చుకునే మనసు ఉండాలే కానీ,సృష్టిలోని ప్రతి జీవీ ఓ గురువే అంటూ అనేక ఉదాహరణలు చూపాడు. భూమిలోని సహనగుణాన్నీ, ఆకాశంలోని నిశ్చలత్వాన్నీ, నీటిలోని స్వచ్ఛతనూ, అగ్నిలోని నిర్మోహత్వాన్నీ, చంద్రుడిలోని ఓరిమినీ.. వికాస పాఠాలుగా స్వీకరించమని సలహా ఇచ్చాడు. సూర్యుడు భూమిలోని నీటిని ఆవిరి రూపంలో పీల్చుకున్నా, ఆ తర్వాత వర్షంగా కురిపిస్తాడు. మనిషి కూడా తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించుకున్నా, ఆ సంపదలో కొంతైనా సమాజంతో పంచుకోవాలని చెప్పాడు. తుమ్మెద మకరందాన్ని గ్రోలినట్టు జిజ్ఞాసి మహాగ్రంథాల సారాన్ని గ్రహించాలని బోధించాడు. ఆత్మకు అంతం లేదు కాబట్టి, జరామరణాల చింతే అవసరం లేదని స్పష్టతనిచ్చాడు. ఆ సంభాషణ తర్వాత ఉద్దవుడి మనసు తేటపడింది...మృత్యుభీతి తొలగిపోయింది. నిశ్చింతగా బదరికాశ్రమానికి బయల్దేరాడు...🙏🚩

No comments:

Post a Comment