Wednesday, December 11, 2024

****ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో అడుగు పెట్టిన సంజయుని మనస్సులో లెక్కపెట్టలేనన్ని ఆలోచనలు, సందేహాలు !

 ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో అడుగు పెట్టిన సంజయుని మనస్సులో లెక్కపెట్టలేనన్ని ఆలోచనలు, సందేహాలు !

"కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగి కొద్దిరోజులయింది. అవునా ? నిజంగా జరిగిందా ? ఇక్కడనేనా ఈ పుణ్యభూమి అసంఖ్యాక వీరుల రుధిరంతో తడిసి ముద్దయ్యింది ? ఇక్కడనేనా భగవానుడు శ్రీకృష్ణుడు, అర్జునుడు, పాండవులు నిలుచున్నది ? ఇక్కడనేనా విశ్వరూప సందర్శన భాగ్యం అర్జునుడికి, తద్వారా వ్యాస భగవానుని అనుగ్రహం వలన తనకూ కలిగింది ?"

"అది ఎప్పటికీ నీకు తెలిసే అవకాశం లేదు సంజయా !" అన్న వివేకపూరితమైన గొంతుకతో కాషాయాంబరధారి వృద్ధుడు ఒకరు అక్కడి పొగమంచు నుంచి వెలువడి సంజయుని ఉద్దేశించి మందహాసంతో పలికాడు. 

"నీ ఆలోచనలు, నీ శంకలు నాకు అవగతమే ! అసలు యుద్ధం ఎవరి మధ్య జరుగుతున్నదో తెలియకపోతే కురుక్షేత్ర రణము గురించిన నీ అనుమానాలు తీరే అవకాశం లేదు సంజయా !" అన్నాడాయన  నిగూఢంగా మెత్తని స్వరంతో.

"నాకు అవగతం కాలేదు మహానుభావా ! దయచేసి వివరించ గోరుతున్నాను !" అన్నాడు సంజయుడు ముకుళిత హస్తాలతో.

"మహాభారత యుద్ధం ఒక ఇతిహాసం, ఒక నృత్య రూపకం,  సత్యం ఇవి మాత్రమే కాదు. అది గూఢమైన తత్వం నాయనా !"

వృద్ధుని చిరునవ్వు సంజయుని మనసులో ఉన్న ప్రశ్నలు అడిగేలాగ ప్రోత్సహించింది.

"ఆ తత్వము ఏదో నాకు వివరించండి ఆర్యా !" 

"తప్పకుండా ! పంచ పాండవులు మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు. శబ్ద, రస, రూప, స్పర్శ, గంధములు, . మరి కౌరవులెవరో ఊహించగలవా సంజయా ? మనలను పెడదారి పట్టించే వంద వ్యసనాలు కౌరవులు నాయనా ! వీరిని విజయవంతంగా జయించడం ఎలాగో తెలుసా ?" అని ఒక క్షణం ఆగాడాయన.

సంజయుడు తెలియదన్నట్లు సంజ్ఞ చేశాడు

"నీ శరీరమనే రధం నడిపే అశ్వాల పగ్గాలు ఆ వాసుదేవుని చేతిలో పెట్టెయ్యి !"

అప్రతిభుడైపోయాడు సంజయుడు. ఎట్టయెదుట వాస్తవం అనంతమైన కాంతులీనుతూ గోచరమైంది ఆ చిన్న వాక్యం వినేసరికి !

"ఆ నందనందనుడు నీ అంతరాత్మ, నీ లోని అంతర్వాణి, నీకు సరైన దారి చూపించే మార్గదర్శిని. ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుంటే చింతా విముక్తుడవౌతావు."

సంజయుడు ఆశ్చర్యం పొందినా తేరుకుని "భీష్మ ద్రోణాది జ్ఞానవృద్ధులు వ్యసనాలు ఎలా అవుతారో తెల్పండి మహానుభావా!" అని వేడుకున్నాడు. 

విచారపూర్వకంగా తల తాటించి వివరించాడాయన "చిన్నప్పటి వయసులో నీవు పరిపూర్ణమైనవారని ఆరాధించిన వారు నీవు వయసు పెరిగినకొద్దీ అంత పరిపూర్ణమైన వారు కాదని, వారిలో కూడా లోపాలు ఉంటాయని తెలుసుకుంటావు. వారు నీకు మంచి చేస్తారా చెడు చేస్తారా అన్నది గ్రహింపుకి వచ్చే రోజు జీవితంలో తప్పకుండా వస్తుంది. నీ మంచి కోసం వారితో యుద్ధం చేయవలసిన అవసరం కూడా వస్తుంది. అది నీ పరిపక్వతలో అన్నిటి కన్నా కష్టతరమైన విషయం తండ్రీ ! అందుకనే భగవద్గీత నీకు కరదీపిక గా ఉపయోగపడుతుంది."

సంజయుడు నిలువలేక కూలబడ్డాడు. నిస్త్రాణ వలన కాదు, ఆ అపారమైన వాస్తవం యొక్క భారం వలన.

"మరి కర్ణుని విషయమేమిటి ఆచార్యా ?" అన్నాడు 

"ఆహా ! అతి ముఖ్యమైన విషయం చివరికి అడిగావు సంజయా ! కర్ణుడు జ్ఞానేంద్రియాల సోదరుడు. అతడు శరీరంలోని కోరిక, అతడు శరీరంలోని భాగమే కాని వ్యసనపరత్వం వైపు చేరుతాడు. నీ కోరికల వలెనే అతడూ వ్యసనాలకు ఆకర్షితుడై అటువైపు చేరడమే కాక తాను అన్యాయానికి గురైనానని, వ్యసనం పంచన చేరడాన్ని సమర్ధించుకుంటాడు. నీ శరీరంలో కోరికల వలెనే !! అవునా ? నీ కోరికలు వ్యసనాలవైపు నిన్ను ఆకర్షించడం గమనించే ఉంటావు !"

సంజయుడు మారు పల్కలేక తల తాటించాడు. ఆలోచించిన కొద్దీ మబ్బులు విడిపోయి కాంతి ప్రసరిస్తున్న స్పృహ కలిగి తల ఎత్తి ఆ వృద్ధుని వైపు చూశాడు. అక్కడ ఆ వృద్ధుడు కనిపించనే లేదు. జీవితములోని అతి ముఖ్యమైన తత్వాన్ని తేలికైన పదాలతో తేటతెల్లం చేసిన ఆయనకు కేల్మోడ్చి నమస్కరించాడు. 

"ఏ రోజైతే అవసరానికీ కోరికకు అంతరాన్ని గ్రహిస్తామో ఆ రోజున మానసిక గందరగోళానికి అంతం కలుగుతుందని తెలిపిన ఓ పరమాత్మా ! అందుకో నా వందనాలు !" అని హస్తిన వైపు అడుగులు వేశాడు.

ఈరోజు గీతా జయంతి 🙏 🙏 🙏 🙏

No comments:

Post a Comment