Tuesday, December 10, 2024

 *తక్షణ_కర్తవ్యం*

*చెట్టుకాయను విడవదు. కాయ చెట్టును వదలదు. కాయ పండు కానంత వరకే ఈ సంబంధము. పక్వానికి రాగనే, ఫలంగా మారగనే కాయకు చెట్టుతో సంబంధం తెగిపోతుంది. కాని, ఆస్తితి వచ్చినంత వరకు కాయ చెట్టును అంటిపెట్టుకొనే ఉండాలి. అలా అంటిపెట్టుకొని ఉంటూ, తనలో తాను పక్వత చెందడంలోనే కాయ పండుగా మారి విముక్తిని పొందుతుంది. అంతవరకు కాయలో వగరు, పులుపు, చేదులాంటివి అనివార్యాలు. అనివార్యాలుండేవి అధిగమించుటకే గాని ఆవేదన చెందేందుకు కాదు. అనివార్యాలు అభివృద్ధికి సోపానాలు కావాలే కాని అవరోధాలకు పునాదులు కాకూడదు. ”నాలో స్వార్థం ఉంది. ఈర్ష్య ఉంది. అసూయ ఉంది. లోభత్వం ఉంది. అహంకారం ఉంది” -అని చింతించనవసరం లేదు. అవి క్రమంగా పరివర్తన చెందేలా జీవించడం నేర్చుకోవాలి. దుర్గుణాలను పోగొట్టుకోవాలి అనే ప్రయత్నం కన్నా సద్గుణాలను ప్రోగు చేసుకోవాలనే ప్రయత్నంలోనే మనిషి మనీషిగా మారుతాడు.* 

*సుగుణవంతుడై, సుగుణాలు ఉన్నట్లు కూడా స్పృహలేనివాడు మనీషి మహర్షి అవుతాడు. అంతరేక్షణను, ఆత్మావలోకనమును అందించుట చేత, ముందుంచుట చేత వేదాంత విద్య మానవునిలో పరివర్తనను కలిగించి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది. ఈ జ్ఞానముతోనే వ్యక్తి శక్తివంతుడవుతాడు. ఆత్మనావిందతే వీర్యం ”ఆత్మను తెలుసుకోవడం వల్ల మానవుడు అనంతశక్తిని పొందుతాడు” అన్నది కేనోపనిషత్తు. ఈ దివ్యశక్తిని ఆశించే శిష్యుడు గురువును ఆశ్రయిస్తాడు. ఈ అనంతశక్తిని అభిలషించే గురువు శిష్యునికి బోధిస్తాడు. సహవీర్యం కరవావహై ”ఇరువురమూ శక్తి పొందెదము గాక”! అని గురుశిష్యులిరువురు శాంతి మంత్రమును పఠించి స్వాధ్యాయమును ప్రారంభించడం మనకు సంప్రదాయం ప్రసాదించిన ఆచారము. పొయ్యిమీద బియ్యం ఉడుకుతూ ఉడుకుతూ ఒక దశలో మెత్తబడి అన్నంగా మారుతుంది. నీకు ఆహారంగా తయారై శక్తిని అందిస్తుంది.ఉడికే బియ్యంతో పాటు మనం ఉడకనవసరం లేదు. సాక్షిగా వీక్షిస్తుంటే చాలు. మంటను గమనిస్తూ ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం ప్రయత్నంతో వంట సరిపడుతుంది.* 

*ఆంతర్యంలో అవగాహనను పెంచుకోవాలి. సుగుణాలను వృద్ధి చేసుకోవాలి. సద్భావాలను చలింపచేయాలి. అవి వాటి పనిని అవి చేసుకుంటూ పోతాయి. అవరోధాలు కలిగించకుండా అవలోకించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఒక దశలో మనసులో ‘మంచి మల్లెలు విరబూస్తాయి. శాంతిగాలులు వీచే ఆ హృదయవాటికలో ఆనంద విహారం చేయవచ్చు. అది అలుపెరగని ఆనందం. శ్రమ తెలియని శాంతి. అదంతా, అలా, అలా జరిగిపోతుంది. అలలను, అలజడులను సృష్టించే నైపుణ్యాన్ని మరచిపోగలిగితే మనసులో మధుమాసం ప్రవేశిస్తుంది.మనలో భావ వైరుధ్యం లేకుండా చూసుకోవాలి. భావసారూప్యంలో భాసించడం నేర్చుకోవాలి. పెద్దపెద్ద ఆలోచనలతో ఆలసిపోవడం చాలా చిన్నవాళ్లకు కూడా అలవాటైపోయింది. ఏదో జరిగిపోవాలని, అదికూడా క్షణంలోనే జరిగిపోవాలని పరితపించడం పరిపాటైపోయింది. ఒక దీపాన్ని మనం వెలిగిస్తాము. అది వెలుగుతూ ఉంటుంది. తనతో పాటు మరెన్ని దీపాలు వెలుగుతున్నాయి? అని ఆలోచించదు. చీకటి నంతా నిర్మూలించడం తనకు సాధ్యం కాదేమో? అని సంశయించదు.* 

*ఉన్నంతలో ఉత్సాహంగా ఊరేగుతుంది. తన శక్తిని తాను ఖర్చుపెడుతున్నాననే సంతృప్తితో వెలుగుతుంది. అధికారంతోనే పనిచేస్తుంది. ఫలితాలపై అధికారం లేకుండా జీవిస్తుంది. దీపంగా వెలగలేకపోతే ఏ జీవితమైనా శాపంగానే పరిణమిస్తుంది. చెట్టువేళ్లకు నీళ్లుపోయడంలో చెట్టునంతటినీ తడపడమే అవుతుందనే సత్యాన్ని మరచిపోకూడదు. అన్ని పనులు ఒక్క పనిలోనే ఇమిడి ఉన్నాయి. అన్ని ఆశలు ఒక్క ఆశయంలోనే ఒదిగిపోతున్నాయి. అన్ని కర్మలు ఒక్క జ్ఞానంలో విలీనమవుతున్నాయి. ఆలస్యానికి ఇది సమయం కాదు. అలసత్వానికి ఇది కాలం కాదు. ఉత్సాహంతో పరుగులెత్తడమే మన ముందున్న కార్యం. నిరుత్సాహం తెలియకుండా నిలబడటమే మన తక్షణ కర్తవ్యం. భగవానుని జై కొడుతూ ఓడలా సాగిపోవడమే మనకు మిగిలిన ఏకైక కార్యము.*

*┈┉┅━❀꧁ॐ🪷ॐ꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment