Tuesday, December 10, 2024

సృజనాత్మక జీవితం

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
         *సృజనాత్మక జీవితం*

*నయనాలు తెరచి చుట్టూ చూస్తే కనిపించే ప్రతీది సృష్టికారుడి ‘సృజన’ అని తెలుస్తుంది. సృష్టికారుడు, సృజన వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకటే. ఉపనిషత్తుల్లో దాన్ని ‘అద్వైతం’ అన్నారు. అంటే, ‘రెండుగా లేనిది’ అని అర్థం. అంకురంలోంచి ఓ చిన్న మొక్క బయటకు రావడం, మొగ్గనుంచి పుష్పం విచ్చుకోవడం, కాయ పండుగా మారడం, బాగా మాగిన ఫలం మళ్ళీ విత్తనాలు ఇవ్వడం... ఇదంతా నిరంతరం సాగే సృజనాత్మక సృష్టి కార్యకలాపం. సూర్యశక్తితో బలం పొంది సముద్రాలు ఆవిరిరెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగిరేట్లు చేసింది ఎవరు? ఆకాశం కాన్వాసు మీద మేఘాల సుద్దముక్కలతో చిత్ర, విచిత్రమైన బొమ్మలు గీస్తున్న చిత్రకారుడు ఎవరు?*

*నిశ్చలంగా ఉన్న కొలను వాకిట్లో వానచుక్కలు వేసి అలల ముగ్గులు వేస్తున్న ఆడపడుచు ఎవరు? లోకం చీదరించే గొంగళిపురుగు రూపాంతర ధ్యానానికి మెచ్చి సీతాకోక చిలుక రెక్కలకు రంగులు అద్దిన వర్ణ చిత్రకారుడు ఎవరు? ఆకాశం మెడలో వేసే సప్తవర్ణమాలకు రంగులు, పూలిచ్చిన తోటమాలి ఎవరు? ఇంతటి ఘనమైన అద్భుత సృజనశీల కార్యాలు చేసేవి- ఆనందం, ప్రేమ స్వరూపాలు. భగవంతుడు పిల్లల్లా ఆడుకుంటాడు. అతడు గొప్ప ఆటగాడు. అందుకే విశ్వంలో అనేకం సృష్టించాడు. అతడి దృష్టిలో ‘జీవితమే ఒక పెద్ద ఆట’, దుఃఖంతో ఉండి బోరున ఏడుస్తూ ఎవరైనా ఆడుకుంటారా? లేదు. ఆట ఆనందంతో ముడివడి ఉంటుంది. మనసు సంతోషంతో నిండినప్పుడు ఆట సంభవిస్తుంది. అందుకే మనిషికి బాల్యమంతా ఆటపాటలతోనే గడిచిపోతుంది. ఆటలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చదరంగం లాంటి ఆటలు మస్తిష్కాన్ని చురుగ్గా ఉంచుతాయి. పరుగులతో కూడిన ఆటలు క్షణకాలాల్లోనే సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధికుశలతకు పదునుపెడతాయి. ఈ రీతిన సృజనశక్తి వయసుతోపాటు క్రమంగా బలపడి భవిష్యత్తులో కొత్తవాటిని కనిపెట్టే సృష్టికర్తలను తయారు చేస్తుంది. చిన్నప్పుడూ స్నేహితులు చాలామంది ఉంటారు.*
 
*కాలక్రమేణా ఆ సంబంధాలు విడిపోతాయి. బాల్యంనాటి ఆటలు, ఆనందాలు మెల్లగా దూరం అవుతాయి. మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకుంటాయి. శతవిధాలా వేధిస్తాయి. చేసేదేమీలేక గతంలోకి తిరిగి చూసుకుంటాడు. బాల్యం నాటి తీపిజ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వయసుతోపాటు వచ్చే జ్ఞానం వల్ల వయోజనులు కొంతమంది మళ్ళీ ఆనందం పొందడం కోసం పిల్లలకు దగ్గరవుతారు. అందుకే తాతలు మనవళ్లతో జతకడతారు. వాళ్లకు గుర్రపు స్వారీలవుతారు. మాట్లాడే బొమ్మలవుతారు. నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం... ఇవన్నీ సృజనాత్మక అంశాలు. ఈ కళల్ని సృజిస్తున్నప్పుడు మనసు వర్తమానంలో నిలుచుండిపోతుంది. ఫలితంగా పట్టరానంత ఆనందం కలుగుతుంది. కళలు- కళాప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నెమ్మదిగా ధ్యానంవైపు తీసుకువెళతాయి. జీవితం పట్ల ప్రేమ పెంచుతాయి.*

*'ఏ పని అన్నది ముఖ్యం కాదు... దాన్ని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం’ అని పెద్దలంటారు. పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడకుండా, కీర్తి శిఖరాలకై వెంపర్లాడకుండా, నిదానమే ప్రధానంగా, శ్రద్ధాభక్తితో, ఎరుకతో, ఆనందంగా, పవిత్ర మనసుతో ఏ కార్యం చేపట్టినా అది సృజనాత్మకంగా ఉంటుంది. వర్తమానంలో జీవించడమంటే, తామరాకుపై నీటి బిందువులా ఉండటం. ఆ క్షణాల్లో మనసు భూత భవిష్యత్తులకు సంబంధించిన డోలాయమాన స్థితిలో ఉండదు. అనవసర ఆలోచనలు వేధించవు, పరధ్యానంలోకి మళ్లించవు. అప్పుడు చేతు(చేత)ల్లో ఉన్న ప్రతీ పని ఒక ప్రార్థన అవుతుంది.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴

No comments:

Post a Comment