*187 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ!!*
కచ్చపి అంటే సరస్వతీ దేవియొక్క వీణ. అమరకోశంలో....
విశ్వావసోస్సా బృహతీ || తుంబురోస్తు కలావతీ ।
సా నారదస్య మహతీ । సరస్వత్యాస్తు కచ్ళపీ ॥
విశ్వావసుని వీణ పేరు - బృహతి,
తుంబురుడి వీణ పేరు - కలావతి,
నారదుడి వీణ పేరు - మహతి,
సరస్వతి వీణ పేరు - కచ్ళపి,
వీణలో అక్షరాలు స్పష్టంగా వినిపించక పోయినప్పటికీ, ప్రేళ్ళు మీటినప్పుడు వచ్చే
స్వరము గతంలో మనకు తెలిసిన అక్షరాలను గుర్తుకు తెచ్చి రసానుభవం కలగచేస్తుంది.
అయితే సరస్వతీ దేవి వీణలో మిగిలిన వాటికన్న స్పష్టత ఎక్కువగా ఉంటుంది.
పరమేశ్వరుని సేవిస్తున్నటువంటి సరస్వతీ దేవి తన వీణ అయిన కచ్చపిని సృతి
చేసి శివుని యొక్క విలాసములను వాయిస్తోంది. అందుకు ఆనందించిన పరమేశ్వరి
నోటి వెంట వచ్చిన పలుకులు ఆ వీణానాదం కన్న మనోహరంగా ఉన్నాయి. శంకర
భగవత్సాదులవారు సౌందర్య లహరిలోని 66వ శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...
విపంచ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారట్టే వక్తుం చలితశిరసా సాధువచనే ।
తదీయై ర్మాధుర్యై రసలపిత తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుకయతి చోళేన నిభ్రుతమ్ ॥
సరస్వతీ దేవి వీణను సృతి చేసి పరమేశ్వరి ఎదుట శివుని విజయ విలాసాలను
మీటుతుండగా, దేవి సంతసించి ప్రశంశావాక్యాలు పలుకుతోంది. వీణానాదంకన్న
మధురంగా ఉన్న ఆ పలుకులు విని సిగ్గుపడి సరస్వతీ దేవి తన వీణను గవిసెన గుడ్డతో
రహస్యంగా కప్పివేస్తోంది. అంటే పరమేశ్వరి పలుకులు వీణానాదం కన్న మధురంగా ఉన్నాయి.
శ్రీ దేవి సంభాషణ యందలి మాధుర్యము త్రిశక్తులలో నొకరైన
సరస్వతీ దేవియొక్క 'కచ్ఛపి' యను వీణానాదమును తిరస్కరించు
నట్లుండునని భావము.
వాయిద్యములలో వీణ ఉత్తమోత్తమమైనది. ఉత్తమోత్తమ వీణలు నారదుని మహతి, విశ్వవసువు బృహతి, తుంబురుని కళావతి, సరస్వతీ దేవియొక్క కచ్ఛపి వీణ ప్రథమ స్థానమున నుండును. వ్రేళ్ళ తాకిడితో ఆ వీణ నుండియే సమస్త స్వరములు, అక్షరములు పుట్టుచున్నవి.
వర్ణముల స్పష్టత కచ్ఛపీ వీణకే కలదని పెద్దలు చెప్పుదురు. అట్టి స్పష్టత, స్వర మాధుర్యము వ్యక్తము చేయు కచ్చపీ వీణానాదము కంటే కూడా శ్రీ దేవి సంభాషణములు మధురాతి మధురముగా
నుండునని ఈ మంత్రము ప్రతిపాదించు చున్నది.
శ్రీ దేవి పలుకులను వినగలుగు భాగ్యమే భాగ్యము.అంతర్ముఖునకు అట్టి అవకాశము ఏర్పడగలదు. శ్వాసయందలి లయ, తాళముల ద్వారా నాదము చేరి, అట్టి నాదము ఆధారముగ గంధర్వలోకము స్పృశించినచో శ్రీ దేవి సంభాషణా మాధుర్యము నెరుగుట కవకాశ మేర్పడును. నారద తుంబురులట్టివారు.
ఇటీవలి కాలమున శ్రీ త్యాగరాజు మహాశయులు అట్టి భాగ్యము ననుగ్రహింపబడినారు.
ఒకసారి అమ్మవారు సభలో కొలువు తీరి ఉండగా, సరస్వతీ దేవి తన 'కచ్ఛపి' అనే వీణని మధురంగా వాయించింది.
ఆ మధుర నాదానికి అమ్మతో సహా అందరూ పరవశించగా, అమ్మవారు సరస్వతి దేవిని ప్రశంసిస్తూ కొంత సేపు మాట్లాడింది. ఒక్క క్షణ కాలం సభ మొత్తం పరవశత్వంతో నిశ్చేష్టమైపోయింది. అమ్మవారి మాటలు సరస్వతీదేవీ వీణానాదాన్ని మైమరిపించే విధంగా మాధుర్యంగా ఉన్నాయి.
ఈ నామం వాక్శుద్ధిని ప్రసాదించే నామం. పూర్వం వసంతుడు అనే ఒక మూగవాడిని పలికించడానికి వసిష్టుడు ఈ మంత్ర జపాన్ని చేసి అతనికి పలుకులు తెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment