Wednesday, February 4, 2026

 *ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?*

*చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులకి తో సహా ఈ అపోహ ఉంది.*

*అసలు తోటి బ్రాహ్మడు [అతను వేద పండితుడే కానక్కరలేదు, అసలు అతడు  బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.*

*ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు.*

*నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.*

*పూర్వం గురుకులాల్లో  ప్రతీ రోజూ గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని  బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు.*

*ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు.*

*ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ  బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.*

*అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, అలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.*

*అందుకే అలా [బిక్ష వేయకుండా] వెళ్ళకూడదు అంటారు.*

*అంతే తప్ప అది అపశకునం కాదు.* 

*ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు.*

*ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.*

*ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు.*

*కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి*.  

*అయితే  ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి.*

*మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే  అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహాయము నిష్కామకర్మతో చేసి కదలండి.*

*అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.*

*మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది.*

*సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత? మన కున్న జ్ఞానమెంత? ఒక్కసారి ఆలోచించండి!*

*అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.*
.

No comments:

Post a Comment