Friday, June 26, 2026

 సుఖ దుఃఖాలు--1

ప్రతి సుఖంలో దుఃఖం దాగి ఉంది. ప్రతి దుఃఖం అంచున సుఖం అంతర్లీనంగా ఉంది. ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడమే మనిషి జీవితంలో బాధలకు కారణం. మనం సుఖాన్ని మాత్రమే కోరుకుంటాం; దుఃఖాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తాం. కానీ ప్రకృతి ధర్మం అలా కాదు. పగలు తరువాత రాత్రి వచ్చినట్లే, ఎండ తరువాత వర్షం వచ్చినట్లే, సుఖం తరువాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం రావడం సహజం.

మన జీవితాన్ని జాగ్రత్తగాపరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన సత్యం కనిపిస్తుంది. మనం అత్యంత సుఖంగా భావించే అనుభవాలే కొన్నిసార్లు మనకు అత్యధిక దుఃఖాన్ని కలిగిస్తాయి. సంపద సంపాదించినప్పుడు సంతోషం కలుగుతుంది; కానీ అదే సమయంలో దానిని కోల్పోతామేమో అనే భయం కూడా వెంటాడుతుంది. పేరు ప్రతిష్ఠలు ఆనందాన్ని ఇస్తాయి; అదే సమయంలో వాటిని నిలబెట్టుకోవాలనే ఒత్తిడి మనశ్శాంతిని దూరం చేస్తుంది. అందువల్ల సుఖం మరియు దుఃఖం వేర్వేరు అనుభవాలు కాదు; ఒకే నాణానికి రెండు వైపులు.

సుఖదుఃఖాలకు మూల కారణం కోరికలు. కోరికలు లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు. మనం ఏదో ఒక వస్తువును, వ్యక్తిని, పరిస్థితిని లేదా అనుభవాన్ని కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరితే సుఖం వస్తుంది. అది నెరవేరకపోతే దుఃఖం కలుగుతుంది. కాబట్టి సుఖదుఃఖాలు బాహ్య ప్రపంచం నుండి రావు; అవి మన అంతరంగంలో పుట్టే కోరికల ప్రతిఫలాలు.

ఒక చిన్న బాలుడికి బొమ్మ కావాలి. బొమ్మ దొరికితే సంతోషిస్తాడు. అదే బొమ్మ విరిగిపోతే ఏడుస్తాడు. పెద్దవాడైన తరువాత బొమ్మ స్థానంలో ఉద్యోగం వస్తుంది, ఇల్లు వస్తుంది, సంపద వస్తుంది, సంబంధాలు వస్తాయి. కానీ సూత్రం మాత్రం మారదు. కోరిక తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం. బాల్యంలోనూ, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ ఇదే సత్యం.

వయసు పెరుగుతున్నా చిన్న పిల్లల మనస్తత్వాన్ని మనం కొనసాగిస్తున్నాం. పేరుకి మాత్రం పెద్దవారిమని చెప్పుకుంటున్నాం.  పిల్లవాడు చాక్లెట్ కోసం ఏడుస్తాడు. పెద్దవాడు పదవి కోసం, డబ్బు కోసం, గుర్తింపు కోసం,  బాధపడతాడు. వస్తువులు మారాయి కానీ మనసు మారలేదు. కోరికల స్వభావం మారలేదు. అందుకే మనిషి వయసులో పెద్దవాడైనా, అవగాహనలో మాత్రం చిన్నవాడిగానే మిగిలిపోతాడు.

ఈ చిన్నపిల్లల మనస్తత్వం నుంచి బయటపడాలంటే అజ్ఞానం తొలగాలి. మనలో జ్ఞానం వెలగాలి. కోరికల గురించి అందరిలాగా ఆలోచించకుండా, వాటి పుట్టుపూర్వోత్తరాలను అర్థం చేసుకోవాలి. కోరికల స్వభావాన్ని పరిశీలించాలి. వాటి వెనుక ఉన్న మానసిక ప్రక్రియను తెలుసుకోవాలి.

ఈ కోరికలు ఎలా పుడతాయి? ఇంద్రియాలకు మరియు ఇంద్రియ వస్తువులకు మధ్య ఏర్పడే సాంగత్యం వల్ల కోరికలు పుడతాయి. కంటికి అందమైన రూపం కనిపిస్తుంది. చెవికి మధురమైన సంగీతం వినిపిస్తుంది. నాలుకకు రుచికరమైన ఆహారం తగులుతుంది. ముక్కుకు సువాసన చేరుతుంది. చర్మానికి సుఖస్పర్శ కలుగుతుంది. ఈ అనుభవాలను మనసు గుర్తుంచుకుంటుంది. మళ్లీ మళ్లీ వాటిని పొందాలని కోరుకుంటుంది. అలా కోరిక జనిస్తుంది.

అయితే ఇంద్రియాలు సమస్య కాదు. ఇంద్రియ వస్తువులు కూడా సమస్య కాదు. సమస్య వాటి మధ్య ఏర్పడే అవివేకపూరిత సంబంధం. సంపదను సంపాదించడం తప్పు కాదు. సంపదే నా భద్రత, నా ఆనందం అనుకోవడమే సమస్య. సంబంధాలు కలిగి ఉండటం తప్పు కాదు. వాటిపైనే నా సంపూర్ణ ఆనందం ఆధారపడి ఉందని భావించడమే సమస్య.

మొదట అనుభవం వస్తుంది. అది ఆసక్తిని తెస్తుంది. ఆసక్తి మమకారం అవుతుంది. మమకారం వ్యసనంగా మారుతుంది. వ్యసనం బంధనంగా మారుతుంది. చివరకు ఆ బంధనం సుఖదుఃఖాల ఊయలలో మనిషిని ఊపుతుంది. ఒకసారి పైకి తీసుకెళ్తుంది, మరొకసారి కిందికి పడేస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోతాడు. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతాడు. రెండింటికీ బానిసగా మారిపోతాడు.

భగవద్గీత ఈ ప్రక్రియను స్పష్టంగా వివరిస్తుంది. విషయాలపై ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది. కోరిక నెరవేరితే మరింత లోభం పుడుతుంది. లోభం నుండి మోహం, మోహం నుండి స్మృతి భ్రంశం, చివరకు వ్యక్తిత్వ పతనం సంభవిస్తాయి. కోరిక నెరవేరకపోతే క్రోధం పుడుతుంది. క్రోధం నుండి విచక్షణారాహిత్యం, విచక్షణారాహిత్యం నుండి నిర్ణయ లోపం,  వ్యక్తిత్వ పతనం జరుగుతుంది.

కోరికలు లేకుండా బ్రతకటం మనిషికి సాధ్యం కాదు.  కోరికల వలలో చిక్కుకుపోవడం కూడా మంచిది కాదు. మోక్షాన్ని కోరుకోవడం కూడా ఒక కోరికే కదా! కోరిక లేకుండా లౌకిక జీవితంలో అభివృద్ధి కూడా అసాధ్యం.

అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? కోరికలు కోరుతూ, కోరికల కోరల్లో చిక్కుకోకుండా జీవించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం రేపటి ప్రసాదంలో-- 

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment