Friday, June 26, 2026

 అంగదుడి వివేకం

రామాయణంలోని ప్రతి పాత్ర మనకు ఏదో ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. వానర రాకుమారుడైన అంగదుడు కూడా అలాంటి పాఠ్యపుస్తకమే. వాలి కుమారుడైన అంగదుడు శ్రీరాముడి సేవలో తరించి, ధైర్యం, వివేకం, విశ్వాసం కలిగిన నాయకు డిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

అంగదుడు శారీరకంగా బలవంతుడు. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా శక్తి మంతుడు. సుగ్రీవుడి సైన్యంలో యువ నాయకుడిగా, లంకాదహనానికి ముందు రావణుడి సభకు రాయబారిగా వెళ్లినప్పుడు అతడి వివేకం స్పష్టంగా తెలుస్తుంది. రావణుడి అహంకారాన్ని, దురాలోచనలను నేరుగా ప్రశ్నించి, సత్యం బోధించడానికి ప్రయత్నిస్తాడు. అంగదుడి మాటల్లో నిగ్రహం, ధైర్యం రెండూ కనిపిస్తాయి.

మరో ముఖ్యమైన అంశం అంగదుడి ఆత్మవిశ్వాసం. తన కాలిని కదిలించగలిగిన వారే తనను ఓడించినట్లు ప్రకటించి, రావణుడి మంత్రులందరికీ సవాలు విసురుతాడు. ఈ ఆత్మవిశ్వాసం కేవలం గర్వం కాదు, అది తన సామర్థ్యాలపై, తాను నమ్మిన ధర్మంపై ఉన్న నమ్మకం. తన తండ్రిని చంపిన శ్రీరాముడి పట్ల ఎలాంటి ద్వేషం లేకుండా, తండ్రి చేసిన తప్పుల పట్ల పశ్చా త్తాపపడి, ధర్మం వైపు నిలబడ్డాడు. ఇది చాలా అరుదైన లక్షణం. అంగదుడు తన కర్తవ్యం పట్ల చూపించిన నిబద్ధత, ఒక ఉన్నత లక్ష్యం కోసం తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టగలగడం నేటి సమాజానికి ఒక గొప్ప పాఠం.

అంగదుడు కేవలం శారీరక బలంతోనే కాకుండా, అనుభవం నుంచి పాఠాలు నేర్చు కుంటూ పరిణతి చెందిన నాయకుడిగా ఎది గాడు. శ్రీరాముడికి సాయం చేయడానికి వెళ్లినప్పుడు- సుగ్రీవుడు, హనుమంతుడు తదితరుల నుంచి నాయకత్వ లక్షణాలను, దౌత్యనీతిని నేర్చుకున్నాడు. అతడి జీవితం నిరంతర అభ్యాస ప్రక్రియ. రావణుడి సభలో రాయబారి పాత్రలో అంగదుడు ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం శిక్షణ, అనుభవాల నుంచి సంపాదించుకున్నవే.
అంగదుడి పాత్ర ఒక నాయకుణ్ని మాత్రమే కాకుండా, ఒక ఆధ్యాత్మిక సాధకుణ్ని కూడా సూచిస్తుంది. అతడి ప్రయాణమంతా శ్రీరాముడితో అనుసంధానమై సాగిందే. రాముడి సేవలో తానూ ఒక భాగమని గుర్తించడం, తన జీవితాన్ని ఒక గొప్ప ధర్మం కోసం అంకితం చేయడం అతడిలోని ఆధ్యాత్మిక కోణాన్ని తెలియజేస్తుంది. జీవితంలో ప్రతి పనినీ ఒక ధర్మంగానో లేదా సేవగానో భావించినప్పుడు, అదే ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది.

ధైర్యం, వివేకం, విధేయత, క్షమాగుణం, నిరంతర అభ్యాసం, ఆధ్యాత్మిక చింతన లతో కూడిన జీవితం ఎలా ఉంటుందో అంగదుడు మనకు చూపించాడు. ఈ గుణా లను మనం మన జీవితంలో అలవర్చుకోగలిగితే- సమాజంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప మార్పులను సాధించగలం. ఆవేశంతో కాకుండా, అంగదుడిలా వివేకంతో వ్యవహరించినప్పుడే సమాజంలో శాంతి, సుస్థిరత నెల కొంటాయని నేటి నాయకులు కూడా గుర్తించాలి.

ఎన్.శివనాగేశ్వరరావు

No comments:

Post a Comment